VISAKHAPATNAM DENGUE FEVER SPREADING QUICKLY IN VISAKHAPATNAM CITY OF ANDHRA PRADESH HOSPITALS FILLING WITH FEVER CASES FULL DETAILS HERE PRN VSP
Dengue Fevers: జనాలపై దండెత్తిన దోమ... డెంగ్యూ జోన్ లో వైజాగ్..
ప్రతీకాత్మకచిత్రం
Seasonal Fevers: ఇప్పటికే వందలాది మంది డెంగ్యూ (Dengue), మలేరియా (Malaria) బారినపడగా, రానున్న రోజుల్లో బాధితుల సంఖ్య మరింత పెరిగే ప్రమాదం వుందని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.
విశాఖ జిల్లా (Visakhapatnam District)లో వైరల్ జ్వరాలు (Viral Fevers) విజృంభిస్తున్నాయి. ముఖ్యంగా డెంగ్యూ (Dengue), డెంగ్యూ తరహా ఫీవర్స్, మలేరియా (Malaria(, చికున్‌గున్యా కేసులు అధికంగా నమోదవుతున్నాయి. వీటిబారిన పడిన రోగులు వైద్య పరీక్షల కోసం ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులు, మెడికల్ ల్యాబ్‌లకు క్యూ కడుతున్నారు. రక్త పరీక్షల్లో పాజిటివ్ రిపోర్టు వస్తే ఆందోళన చెందుతున్నారు. కొంతమంది మందులు రాయించుకుని ఇంటికి వెళుతుండగా, పరిస్థితి తీవ్రంగా వున్న రోగులు చికిత్స నిమిత్తం ఆస్పత్రుల్లో చేరుతున్నారు. జిల్లాలో ఇప్పటికే వందలాది మంది డెంగ్యూ, మలేరియా బారినపడగా, రానున్న రోజుల్లో బాధితుల సంఖ్య మరింత పెరిగే ప్రమాదం వుందని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. సాధారణంగా వర్షాకాలం తరువాత డెంగ్యూ, డెంగ్యూ తరహా ఫీవర్స్, మలేరియా, చికున్‌గున్యా వంటి కేసులు ఎక్కువగా నమోదు అవుతుంటాయి. కానీ ఈ ఏడాది పరిస్థితి ఇందుకు భిన్నంగా వుంది.
వర్షాకాలం ప్రారంభం నుంచే డెంగ్యూ, మలేరియా కేసులు నమోదు అవుతున్నాయి. ఈనెల ఐదో తేదీ వరకు నమోదైన కేసుల గణాంకాలను పరిశీలిస్తే.. అత్యధికంగా 708 మలేరియా కేసులు నమోదయ్యాయి. 462 మంది డెంగ్యూ, 24 మంది చికున్‌గున్యా బారినపడ్డారు. ఇవన్నీ అధికారులు చెబుతున్న లెక్కలు. అనధికారికంగా వీటి సంఖ్య మరింత ఎక్కువ ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. నగరంలోని పలు ప్రైవేటు ఆస్పత్రులకు డెంగ్యూ, మలేరియా బాధితుల తాకిడి అధికంగా వుంది. నిత్యం పదుల సంఖ్యలో బాధితులు ఈ ఆస్పత్రుల్లో చేరుతున్నారు.
ముఖ్యంగా డెంగ్యూ తరహా జ్వరాలు, వైరల్ ఫీవర్స్ బాధితులు వుంటున్నారని, వీరిలో ఎక్కువ మందికి ప్లేట్ లెట్స్ పడిపోతున్నాయని ఆయా ఆస్పత్రుల వైద్య నిపుణులు చెబుతున్నారు. మలేరియా, డెంగ్యూ, చికున్‌గున్యా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. మూడు రోజులకు మించి జ్వరం ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలని చెబుతున్నారు.
ప్రస్తుతం ఎక్కువగా కనిపిస్తున్న డెంగ్యూ జ్వరం ఎడిస్ ఈజిప్ట్ అనే దోమ కాటు వల్ల వస్తున్నది. దీనిని ‘బ్రేక్ బోన్ ఫీవర్’ అని కూడా పిలుస్తుంటారు. డెంగ్యూ బారినపడిన వారిలో మూడు రోజులకు మించి తీవ్రమైన జ్వరం, తలనొప్పి, తీవ్రఒళ్లు నొప్పులు, అలసట, చర్మంపై దద్దుర్లు వంటి లక్షణా లు ఉంటాయి. డెంగ్యూ లైక్ ఫీవర్స్ లోనూ ఇంచుమించుగా ఇవే లక్షణాలే ఉంటున్నాయి. డెంగ్యూ తరువాత ఎక్కువగా నమోదవుతున్నవి మలేరియా కేసులు. ఈ తరహా బాధితుల్లో తీవ్రమైన చలిజ్వరం, కండరాల నొప్పి, చెమలు పట్టడం, వాంతులు, విరేచనాలు వంటి లక్షణాలు వుంటాయి. చికున్‌గున్యా బారినపడిన వారిలోనూ జ్వరంతోపాటు తీవ్రమైన కండరాల నొప్పి ఉంటుంది. ఆయా లక్షణాలు కనిపించిన వెంటనే అప్రమత్తం కావాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
దోమల కారణంగానే మలేరియా, చికున్‌గున్యా, డెంగ్యూ జ్వరాలు ప్రబలుతున్నందున ప్రజలు అప్రమత్తంగా వుండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. దోమలు వృద్ధి చెందేందుకు అవకాశం ఇవ్వొద్దని, వారంలో కనీసం రెండు రోజులపాటు డ్రై డే పాటించాలని, దీనివల్ల దోమల వ్యాప్తికి అడ్డుకట్ట పడుతుందని అంటున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.