P.భానుప్రసాద్, విజయనగరం ప్రతినిధి, న్యూస్18
ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. ప్రతి రోజూ వేలాది పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ప్రతి ఒక్కరూ మాస్క్ ధరిస్తూ, భౌతికదూరం పాటించాలని ప్రభుత్వాలు, వైద్య నిపుణులు ప్రతిరోజూ హెచ్చరిస్తూనే ఉన్నారు. సాధారణ జనం సంగతి ఎలా ఉన్నా.. నలుగురికి ఆదర్శంగా ఉండేవారు మాత్రం ఈ రూల్స్ తప్పనిసరిగా పాటిస్తూ.. అందరినీ చైతన్య పరచాలి. కానీ ఓ మంత్రిగారు మాత్రం తనకు రూల్స్ పట్టవన్నట్లు వ్యవహరిస్తూ విమర్శల పాలవుతున్నారు. ఆయనే ఆంధ్రప్రదేశ్ పశుసంవర్ధక శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు. ఈ మధ్య అప్పలరాజు గారు కోవిడ్ నిబంధనలు పాటించే విషయంలోఈ మధ్య బాగా పాపులర్ అవుతున్నారు. ప్రభుత్వ కార్యక్రమాల పేరుతో ఈ మధ్య జనాలలో తిరుగున్న మంత్రి అప్పలరాజు.. కోవిడ్ నిబంధనలు తనకేమీ పట్టవన్నట్లు వ్యవహరిస్తున్నరు. ఇటీవల ప్రభుత్వ కార్యక్రమాలైన వాహనమిత్ర పధకం, వైఎస్ఆర్ చేయూత చెక్కుల పంపిణీ కార్యక్రమాల్లో కనీస జాగ్రత్తలు కూడా పాటించకుండానే భారీ జన సందోహంతో కార్యక్రమాలు చేస్తున్నారు.
మంత్రిగారి సమక్షంలోనే గుంపుగుంపులుగా వస్తున్న జనాలతో కోవిడ్ వ్యాప్తిని పెంచేలా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఓ వైపు ధర్డ్ వేవ్ వస్తుందని, దానికి తగ్గ ఏర్పాట్లు చేస్తున్నామని చెబుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పెద్దలే కోవిడ్ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు. కోవిడ్ నిబంధనలు పాటించడం లేదని ప్రతిపక్ష నాయకులపై పోలీసులతో కేసులు పెట్టిస్తున్న ప్రభుత్వం.. ఇలా నిబంధనలు ఉల్లంఘించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీలో ఈ ఏడాదికి సంబంధించిన జగనన్న చేయూత పధకం చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున లబ్ధిదారులు, కార్యకర్తలతో బహిరంగ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి సీదిరి అప్పలరాజుతో సహా మరికొంత మంది వైసీపీ నేతలు, కార్యకర్తలు కూడా స్టేజీపై మాస్కులు లేకుండా కనిపించారు. ఇక ఈ కార్యక్రమానికి వచ్చిన లబ్ధిదారులకు కూడా మాస్కులు లేవు. ఇలాంటి కోవిడ్ సమయంలో కోవిడ్ నిబంధనలు పాటించాల్సి ఉన్నా ఏ ఒక్కరికి ఆ ధ్యాసే లేకుండా పోయింది. 2 మీటర్ల కనీస దూరం పాటించాలని, మాస్కులు ధరించాలని ఓవైపు పెద్ద ఎత్తున ప్రచారం చేసే ప్రభుత్వ పెద్దలే నిబంధనలు బేఖాతరు చేస్తూ ఇలా బహిరంగ కార్యక్రమాలలో పాల్గొంటుంటే.. ఇక మేమెందుకు నిబంధనలు పాటించాలన్న నిర్లక్ష్యంతో లబ్ధిదారులు కూడా కోవిడ్ నిబంధనలు పక్కన పెట్టేశారు.
ఇక మంత్రి గారి తీరే అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. వ్ళత్తిరీత్యా డాక్టర్ అయిన మంత్రి సీదిరి అప్పలరాజే.. నిబంధనలు ఉల్లంఘించడాన్ని నేషనల్ మీడియా హైలైట్ చేసింది. కోవిడియట్ అంటూ సంబోధిస్తూ జాతీయ మీడియాలో వార్తలు ప్రసారమయ్యాయి. కోవిడ్ ప్రోటోకాల్ ప్రకారం కనీస నిబంధనలు పాటించాల్సి ఉన్నా.. స్వయంగా మంత్రే ఇలా నిబంధనలు ఉల్లంఘిస్తున్నారంటూ మంత్రిని ఏకిపారేసాయి. మంత్రి గారే మాస్క్ లేకుండా ఇలాంటి కార్యక్రమంలో పాల్గొంటే ఎలా అంటూ వార్తలు ప్రసారం చేసాయి. ఇక ఆయనతో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఇతర నేతలు కూడా మాస్క్ లేకుండా కనిపించారు. ప్రభుత్వం ద్వారా మహిళలకు పెద్ద ఎత్తున సహాయం చేస్తున్నామని చెప్పేందుకు ఉద్దేశించిన ఈ కార్యక్రమానికి మహిళలను ఇలా పెద్దఎత్తున తరలించడమే నేరమయితే.. ఇక మంత్రి, ప్రజా ప్రతినిధులు నిబంధనలు పాటించకపోవడాన్ని ప్రతిపక్ష నేతలు మండిపడుతున్నారు.
ఈ బహిరంగ సభలో మాట్లాడుతూ.. కరోనా కారణంగా గత సంవత్సర కాలంగా ఎన్నో ఇబ్బందులు పడ్డామని, ఇప్పుడిప్పుడే కరోన కష్టకాలం నుంచి మనందరం కోలుకుంటున్నామని, 45 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి మనం వ్యాక్సినేషన్ పూర్తి చేసుకున్నామని, అందుకే ఈ సంతోషకరమైన సమావేశం ఏర్పాటు చేసుకున్నామని, దీని ద్వారా ప్రపంచ దేశాలకు కరోనా పై వ్యాక్సిన్ తో విజయం సాధించామని తెలియజేయడానికి ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేసుకున్నామని మంత్రి అన్నారు. ఓ వైపు వ్యాక్సిన్ వేస్తున్నామని, కరోనా కేసులు భారీగా తగ్గుతున్నాయని చెబుతూ .. కోవిడ్ నిబంధనలు పక్కన పెట్టడంపై సాధారణ ప్రజలనుండి, ప్రతిపక్షాల వరకూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
దీంతోపాటు ఇటీవల వైయస్సార్ చేయూత కార్యక్రమంలో భాగంగా మందస మండల సమాఖ్య ఆధ్వర్యంలో మందస పట్టణంలో ఇలాంటి భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసారు. ఈ భారీ బహిరంగ సభకు ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి, డాక్టర్ సీదిరి అప్పలరాజు హాజరయ్యారు. ఇక్కడ కూడా వందల మందితో కనీస నిబంధనలు పాటించకుండా బహిరంగ సభ ఏర్పాటు చేసారు. ఇక వాహన మిత్ర పథకం ద్వారా ఆటో డ్రైవర్లకు లబ్ధి చేకూర్చే కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అక్కడ కూడా మాస్క్ లేకుండా ఆటో డ్రైవ్ చేస్తూ, మిగిలిన కార్యక్రమాలలో పాల్గొంటూ కనిపించారు. ఆయన వెంట మరికొంత మంది స్ధానిక నేతలు, కార్యకర్తలు కూడా ఇలా నిబంధనలు పక్కనపెట్టేసి కనిపించారు. ఇక మంత్రి అప్పలరాజు ఓ టీవీ డిబేట్ లో పాల్గొంటూ.. N440k వైరస్ కర్నూలులో కనుగొనబడిందని, ఈ వైరస్ మామూలు వైరస్ కంటే 15 రెట్లు వేగంగా వ్యాప్తి చెందుతుందని అన్నారు. ఇలా అనడం వలన కర్నూలు ప్రజలు భయబ్రాంతులకు గురి అవుతున్నారని, తప్పుడు ప్రచారం చేసిన మంత్రి పై కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా, కర్నూలు జిల్లాకు చెందిన టీడీపీ నేతలు, అడ్వకేట్లు కర్నూలు వన్ టౌన్, కర్నూలు రూరల్ పీఎస్, ఎమ్మిగనూరు పోలీస్ స్టేషన్ లలో ఫిర్యాదు చేశారు. ఇలా మంత్రి అప్పలరాజు కోవిడ్ నిబంధనల విషయంలో అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
కరోనా వ్యాప్తి సమయంలో నిబంధనలు ఉల్లంఘించినందుకు మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు, పలాస మునిసిపల్ చైర్మన్ బళ్ల గిరిబాబుపై చర్యలు తీసుకోవాలని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతు శిరీష డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం ఆన్‌లైన్‌లో లేఖ ద్వారా డీజీపీ గౌతమ్‌సవాంగ్‌కు ఫిర్యాదు చేశారు. మంగళవారం సాయంత్రం కాశీబుగ్గ సంత మైదానంలో వైఎస్‌ఆర్ చేయూత పథకం లబ్ధిదారులతో కలిసి భారీ బహిరంగ సభ నిర్వహించిన మంత్రి అప్పలరాజు కరోనా నిబంధనలు ఉల్లంఘించారని ఆమె ఆరోపించారు. ఎపిడమిక్ వ్యాధుల చట్టం 1897 అనుసరించి నిబంధనలు ఉల్లంఘించరాదని పేర్కొన్నారు. వైద్యులుగా ఉన్న మంత్రి అప్పలరాజు.. కరోనా కేసులు ఉన్న సమయంలో ఇటువంటి సభలు నిర్వహించడంతో ప్రజలు ఆందోళన చెందారని ఆరోపించారు. సెక్షన్ 144 అమలులో ఉన్నా.., మంత్రి పట్టించుకోకపోవడం శోచనీయమని పేర్కొన్నారు. చట్టాలపై గౌరవం లేని ఇటువంటి వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. నిబంధనలు ఉల్లంఘించిన మంత్రి అప్పలరాజు, ఆయన అనుచరులపై కేసు నమోదు చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఎపిడమిక్ వ్యాధుల చట్టం లాంటి అనేక చట్టాల ప్రకారం ఎవరు కోవిడ్ నిబంధనలు పాటించకుండా తిరిగినా.. మాస్క్ లేకుండా కనిపించినా.. ఫైన్లు వేయడంతో పాటు కేసులు పెడుతున్న పోలీసు యంత్రాంగం .. ఇలా ప్రభుత్వ పెద్దలు, అధికారుల విషయంలో ఏం చేయలేని పరిస్థితి. ప్రతిపక్ష నాయకులు, మాజీ మంత్రులపై ఇలాంటి సెక్షన్ల కిందే.. కేసులు నమోదు చేస్తున్న పోలీసులు... ప్రభుత్వ పెద్దలు, మంత్రులు, వైసీపీ నాయకులు, అధికారుల తీరుపై మాత్రం చూసీచూడనట్లు పోతున్నారు. ధర్డ్ వేవ్, డెల్డా వేరియంట్ అంటూ అనేక భయాలు, అనుమానాల నేపధ్యంలో ఇకనైనా కోవిడ్ నిబంధనల ఉల్లంఘన జరగకుండా చూడాల్సి ఉంది. ప్రభుత్వ పెద్దలు, అధికారులు కోవిడ్ నిబంధనల పాటించే విషయంలో అందరికీ ఆదర్శంగా నిలబడాల్సిన అవసరం ఉంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Covid rules, Srikakulam