Andhra Pradesh: ఏపీకి కేంద్రం డబుల్ షాక్... ఇలా చేస్తుందని ఎవరూ ఊహించి ఉండరు..

వైజాగ్ స్టీల్ ప్లాంట్

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ (Vizag Steel Privatization) వెనక్కి తీసుకోవడం, విశాఖ రైల్వే జోన్ (Vizag Railway Station) కేటాయింపు.. ఇవీ వైజాగ్ విషయంలో ఆంధ్రప్రదేశ్.. ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రజల ప్రధాన డిమాండ్లు.

 • Share this:
  P.ఆనంద్ మోహన్, విశాఖపట్నం ప్రతినిధి, న్యూస్18

  విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వెనక్కి తీసుకోవడం, విశాఖ రైల్వే జోన్ కేటాయింపు.. ఇవీ వైజాగ్ విషయంలో ఆంధ్రప్రదేశ్.. ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రజల ప్రధాన డిమాండ్లు. కానీ ఈ రెండు సాకారమయ్యే అవకాశాలు దాదాపు కనుమరుగయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇటీవల విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం కాస్త సద్దుమణిగినట్లు కనిపించినా.. తాజాగా ఈ అంశంలో కేంద్రం ముందడుగు వేస్తోంది. రైల్వే జోన్ కూడా వాల్తేర్ బేస్ గా ఉండబోదని సంకేతాలిచ్చింది. ఇవి రెండు సోమవారమే బయటకు రావడం.. విశాఖకు.. అందునా విశాఖపై గంపెడాశలు పెట్టుకున్న ఏపీ ప్రభుత్వానికి పెద్ద దెబ్బగానే చెప్పాలి. ఏపీలో కొత్త కార్యనిర్వాహక రాజధానిగా విశాఖను వైసీపీ ప్రాధాన్యం ఇస్తోంది. ఎన్నో అభివృద్ది కార్యక్రమాలు.. ప్రాజెక్టులు తేవాలని చూస్తోంది. కానీ.. కేంద్ర ప్రభుత్వం మాత్రం ఉన్నవాటినే ఇక్కడ్నించి ఉడాయించుకుపోతోంది.

  రైల్వేజోన్ హుష్ కాకి..?
  ఏపీ ప్రజలు.. అందులోనూ ఉత్తరాంధ్ర ప్రజలకు దశాబ్దాల కల రైల్వే జోన్. అధిక ఆదాయం.. ప్రజా రవాణా, ముడిసరుకు రవాణాలోనూ ఏ మాత్రం తీసిపోదు. పెద్ద పెద్ద నగరాలకి ధీటుగా వాల్తేర్ రైల్వే ఆదాయం ఉంటోంది. అయితే ఇక్కడ ప్రత్యేక రైల్వే జోన్ ఏర్పాటుకు ఉత్తరాంధ్రులు రెండు దశాబ్దాలుగా పోరాడుతున్నారు. ఇప్పటికీ ఒక రైల్వే టికెట్ రిజర్వేషన్, ఒక రవాణా.. ఒక ఉద్యోగం కావాలన్నా.. భువనేశ్వర్ కి వెళ్లాల్సిందే. విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ వస్తే.. తమ కష్టాలు తీరిపోతాయని ఉత్తరాంధ్రుల ఆలోచన. కానీ.. విశాఖ వాల్తేర్ జోన్ కల నెరవేరదని తేలిపోతోంది. కేంద్ర ప్రభుత్వంతో ముడిపడిన ఈ పని ఇక జరగబోదని తెలుస్తోంది. ప్రధానంగా రాష్ట్రానికి దక్షిణ కోస్తా రైల్వే జోన్ వస్తే.. వాల్తేరు కేంద్రంగా ఇది నడుస్తుందని అంతా భావించారు. కానీ.. మళ్లీ ఒడిశా ప్రభుత్వంలోని రాయగడ నుంచే జోన్ ఆపరేషన్స్ మొదలవుతాయని సమాచారం వస్తోంది. దీంతో ఉత్తరాంధ్రుల ఆశలు అడియాశలుగానే చెప్పాలి.

  ఇది చదవండి: విదేశీ విహంగాలకు ఈ ప్రాంతమే స్వర్గం.. ఎక్కడో తెలుసా..?


  2014లో జరిగిన ఏపీ విభజన నేపథ్యంలో ఇచ్చిన హామీల అమల్లో భాగంగా కొత్తగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటు చేయాల్సి ఉంది. ఇది విశాఖ కేంద్రంగానే ఇస్తారని అంతా భావించారు. కానీ కేంద్రం మాత్రం దీనికి సుముఖంగా లేనట్టు కనిపిస్తోంది. ఒడిశాలో రాయగడ డివిజన్ ఏర్పాటుకు వేగంగా పనులు పూర్తి చేస్తోందని సమాచారం. ఏపీ కోరుకున్న విధంగా వాల్తేరు డివిజన్ కు కాకుండా రాయగడ డివిజన్ కేంద్రంగా ఈ రైల్వే జోన్ ఏర్పాటు కాబోతున్నట్లు తెలుస్తోంది. దీనిపై ఇప్పటివరకూ అధికారిక ప్రకటనేదీ రాకపోయినా రాయగడ డివిజన్ ఏర్పాటుపై జరుగుతున్న ప్రయత్నాలు చూస్తుంటే వాల్తేరుకు బదులుగా రాయగడ కేంద్రంగా ఇది ఏర్పాటు కావడం ఖాయంగా తెలుస్తోంది.

  ఇది చదవండి: ఆ ఒక్కజిల్లాలోనే వైరస్ టెన్షన్.., ఏపీలో కరోనాపై లేటెస్ట్ అప్ డేట్ ఇదే..


  ఉపయోగం ఏమిటి.?
  రైల్వేజోన్ రాయగడో.. ఇంకే ప్రాంతమో తరలిపోతే.. ఉత్తరాంధ్రకు.. ఏపీకి నష్టమే తప్ప లాభం లేదు. రైల్వే జోన్ వల్ల ఉపయోగాలు అనేకం. కొత్త ఉద్యోగాలు.. ఇక్కడి ఆదాయం ఇక్కడే కొంత వినియోగించుకునే వెసులుబాటు.. ఇక్కడి వారికి ప్రాధాన్యత.. వంటి అనేకాంశాలు ఇక్కడ కీలకంగా చెబుతున్నారు. కానీ.. రైల్వే జోన్ రాయగడ డివిజన్ కేంద్రంగా వస్తే మాత్రం ఇక ఏపీకి ఏమాత్రం ఉపయోగం ఉండబోదు. తూర్పు కోస్తా రైల్వే జోన్ లో కొంత భాగాన్ని, దక్షిణ మధ్య రైల్వేలో కొంత భాగాన్ని తీసుకుని దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటు కోసం కేంద్రం ప్రయత్నాలు చేస్తోంది. అయితే దీని వల్ల ఏపీకి ఏ మేరకు న్యాయం జరుగుతుందనేది ఇక్కడ పెద్ద ప్రశ్న. విభజన హామీల్లో ఏపీకి ఇదొక ఉపశమనంగా అంతా అనుకున్నారు. కానీ.. కేంద్రం ఒడిశా రాష్ట్రానికే ఈ జోన్ తరలిస్తే.. ఇక ఏపీకి ఏం న్యాయం జరుగుతుందని ఇక్కడి వారి ప్రశ్న. వాల్తేరు డివిజన్ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటు కోసం ఉత్తరాంధ్ర, ఏపీ డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. ఇప్పుడు ఒడిశా ఒత్తిడితో రాయగడ కేంద్రంగా దీన్ని ఏర్పాటు చేసేందుకు కేంద్రం ప్రయత్నించడం ఏపీకి అన్యాయం చేసినట్టే అవుతుందని, ఏపీకి తీరని నష్టం ఖాయమని ఇక్కడి ప్రాంతీయుల మాట. కొత్త రైల్వే జోన్ ఏర్పాటైనా ఆదాయం తిరిగి రాయగఢ డివిజన్కే వెళ్లిపోతుంది. ఏపీకి విభజన సందర్భంగా ఇచ్చిన హామీని మరోసారి కేంద్రం తప్పినట్టే అవుతుంది.

  స్టీల్ పై ఆసలు వదులుకున్నట్లే...
  ఇక విశాఖ స్టీల్ అంశంలో కార్మిక సంఘాలు, ప్రజల మనోభావాలను కేంద్రం పూర్తిగా పక్కనబెట్టేసింది. ఎంతమంది కాళ్లావేళ్లా పడ్డా.. నెత్తీనోరూ కొట్టుకున్నా.. తన మాట చెల్లాలని కేంద్రం భావిస్తోంది. సోమవారం కూడా స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ కోసం సెంట్రల్ గవర్నమెంట్ ఓ నిర్ణయం తీసుకుంది. అంశం పై పరిశీలనకి ఇద్దరు అడ్వైజర్లను నియమిస్తున్నట్లు ప్రకటించింది. వైజాగ్ స్టీల్ ప్రైవేటీకరణకు ఇప్పటికే నిర్ణయం తీసుకున్న కేంద్రం ఈ నిర్ణయంతో ముందుకే వెళ్తోందని స్పష్టం చేసింది. ఇక్కడి ప్రాంతీయులు, కార్మికులు ఆందోళనలతో పనిలేదన్నట్టు.. కొనసాగుతోంది.

  ప్రైవేటీకరణ ప్రక్రియను వేగవంత చేసి.. ఈ ఏడాది చివరికల్లా పూర్తి చేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది. పార్లమెంటు వేదికగా ఇప్పటికే ఈ మాట చెప్పినా.. ఆందోళనలతో.. కరోనా సమయంలో ఆక్సిజన్ సరఫరా విషయంలో వెనక్కి తగ్గుతుందేమోనని అంతా భావించారు. వైసీపీ ప్రభుత్వం కూడా ఇదే అనుకుంది. కానీ.. ప్రైవేటీకరణ ప్రక్రియను వేగవంతం చేసేందుకు సలహాదారుల్ని నియమించడంతో ఏపీకి షాక్ తప్పలేదు. కేంద్రం ఎంత పక్కాగా ఉందంటే.. ఈ ఇద్దరు సలహాదారుల్లో ఒకరు లావాదేవీల సలహాదారు.. మరొకరు న్యాయ సలహాదారుగా ఉన్నారు. అంటే అన్ని విధాలా ఎలాంటి ప్రతిబంధకాలు లేకుండా కేంద్రం తనపని తాను చేస్తోందన్నమాట.
  Published by:Purna Chandra
  First published: