ఈ రోజుల్లో ఆడపిల్లలు మహిళలకు రక్షణ అనేది లేకుండా పోతోంది. విలువలు, వావి వరసలు మరుస్తున్న మృగాళ్లు అభం శుభం తెలియనివారిపట్ల అమానుషంగా ప్రవర్తిస్తున్నారు. కామవాంఛతో రగిలిపోతూ చిన్నారులను చిదిమేస్తున్నారు. చెల్లిని ఆప్యాయంగా చూసుకోవాల్సిన వాడు ఆమెపైనే కన్నేశాడు. కీచకుడిగా మారి ఆమెపై కోరిక తీర్చుకున్నాడు. అన్న అనే పదానికే మచ్చతెచ్చాడు. వివరాల్లోకి వెళ్తే.. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని విజయనగరం జిల్లా (Vizianagaram District) డెంకాడ మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక పదోతరగతి చదువుతోంది. ఆమెతో పెదనాన్న కుమారుడు చాలా క్లోజ్ గా ఉండేవాడు. బాలిక కూడా అన్నయ్యా అంటూ అప్యాయంగా పిలిచేది. రోజూ చెల్లెలితో సరదగా మాట్లాడేవాడు. ఈ క్రమంలో ఆరునెలల క్రితం ఓ రోజు ఇంట్లో ఎవరూ లేని సమయంలో బాలిక నోట్లో గుడ్డలు కుక్కి అత్యాచారానికి పాల్పడ్డాడు.
ఆమెను నగ్నంగా ఫోటోలు, వీడియోలు తీశానని ఎవరికైనా చెప్తే వాటిని సోషల్ మీడియా (Social Media) లో పెడతానని బాలికను బెదిరించాడు. దీంతో ఆమె మౌనంగా ఉండిపోయింది. మూడు నెలల క్రితం బాలికకు అనారోగ్యానికి గురికావడంతో తల్లిదండ్రులు ఆస్పత్రికి తరలించారు. స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆమెకు పరీక్షలు చేయగా.. ఆమె మూడు గర్భవతి అని.. అప్పటికే అబార్షన్ అయిందని తెలిపారు.
దీనిపై బాలికను నిలదీయడంతో పెదనాన్న కుమారుడే ఈ పనిచేశాడని బాలిక బోరున విలపించింది. ఐతే బయటకు చెప్తే పరువుపోతుందని ఎవరికీ చెప్పొద్దంటూ బంధువులు, కుటుంబ సభ్యులు బాలిక తల్లిదండ్రులకు సూచించారు. ఇన్నాళ్లూ మౌనంగా ఉండిపోయిన తల్లిదండ్రులు శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన పోలీసులు నిందితుడ్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
ఇటీవల విజయనగరం జిల్లాలో ఇదలాంటి ఘటనే చోటు చేసుకుంది. తన దగ్గర చదువు నేర్చుకునేందుకు వచ్చిన మైనర్ బాలిక ( Minor Girl) ను ట్యూషన్ మాస్టారు (Tution Master)చిన్నా బెదిరించి, లొంగదీసుకుని గర్భవతిని చేశాడు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు, కుటుంబసభ్యుల వివరాల మేరకు విజయనగరం జిల్లా గంట్యాడ మండలానికి చెందిన పదోతరగతి చదువుతున్న 16 ఏళ్ల విద్యార్థిని మూడేళ్ల నుంచి ఓ ట్యూషన్ సెంటర్‌కు వెళుతోంది. ఆ అమ్మాయిపై ట్యూషన్ మాస్టారు కన్నేశాడు.
అమెను లోబరుచుకునేందుకు.. మిగిలిన విద్యార్థులంతా వెళ్లిపోయాక.. ‘నీకు తెలివి లేదు.. మేధాశక్తి పెంచుతాను. అందుకు ప్రత్యేక శిక్షణ ఇవ్వాలి’ అంటూ బాలికను లోబర్చుకున్నాడు. కొన్ని రోజులుగా ఆ బాలిక సరిగ్గా తినకపోవడంతో తల్లిదండ్రులు ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆమెను పరీక్షించిన వైద్యులు గర్భవతి అని, ఎనిమిదో నెల అని వైద్యులు నిర్ధారిచారు. దీంతో బాలికను కుటుంబసభ్యులు నిలదీయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
వెంటనే బాధితులు దిశ పోలీసుస్టేషన్‌ను ఆశ్రయించారు. ఈ దారుణానికి సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు చిన్నాను అదుపులోకి తీసుకున్నామని దిశ డీఎస్పీ త్రినాథ్ తెలిపారు. ఇతడికి ఇదివరకే అక్క కుమార్తెతో పెళ్లయిందని, ఉద్యోగం రాకపోవడంతో ట్యూషన్ చెబుతున్నాడని పోలీసులు తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.