Anand Mohan Pudipeddi, Visakhapatnam, News18.
Virus Alert: తెలుగు రాష్ట్రాల్లోనూ కొత్త వైరస్ భయం వెంటాడుతోంది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఎక్కువగా ఈ వైరస్ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. ముఖ్యంగా కాబోయే రాజధాని విశాఖలోని ప్రతి నలుగురిలో ఒకరు జ్వరం, శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్నారని వైద్యులు.. అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే ఈ లక్షణాలతో పెద్దాసుపత్రితో పాటు, ప్రైవేట్ ఆసుపత్రులకు రోజూ వందల మంది వస్తున్నారు. అయితే దీనికి కారణంగా హెచ్3ఎన్2 వైరస్ అయి ఉండొచ్చనే అనుమానాలు పెరుగుతున్నాయి. దేశాన్ని వణికిస్తున్న ఈ మాయదారి రోగం తెలుగు రాష్ట్రాలను టెన్షన్ పెడుతోంది. మొన్నటి వరకూ కరోనా.. ఇప్పుడు H3N2 వైరస్ తాండవం మొదలైందని.. దీంతో ఇవేం మాయదారి రోగాలు అంటూ జనం గగ్గోలు పెడుతున్నారు.
హాంగ్‌కాంగ్‌ఫ్లూ అయిన H3N2 వైరస్ ఇప్పుడు భారత్ ను వణికించేలా చేస్తోంది. ఈ పేరు చెప్తే గుండెల్లో గుబులు రేపుతోంది. H3N2 వైరస్ కారణంగా సోకే ఇన్‌ఫ్లూయెంజానే హాంగ్‌కాంగ్ ఫ్లూ అంటున్నారు డాక్టర్లు. ఈ ఫ్లూ జ్వరం సోకి దేశంలో ప్రాణాలు కోల్పోతున్నవారి సంఖ్య పదికి చేరువలో ఉంది.
మెల్లిగా చాపకింద నీరులా దేశ వ్యాప్తంగా ఈ మాయదారి రోగం విస్తరిస్తోంది. దేశవ్యాప్తంగా ప్రస్తుతం వందమందికి పైగా ఈ వైరస్ కేసులు నిర్ధారించారు. అదే విధంగా ఎనిమిది H1N1 వైరస్ కేసులు కూడా నమోదయ్యాయి. సీజనల్ వ్యాధులకు సీజన్ కాదు.. మాడు పగిలే మండుటెండకు స్వాగతం పలికే సమయం..ఇలాంటి టైమ్‌లో ఫ్లూ జ్వరాలు దేశమంతటా పెరిగుతుండడం ఆందోళన పెంచుతోంది. అందులో H3N2 వైరస్ కారణంగా వచ్చే ఫ్లూ జ్వరాలే ఎక్కువగా ఉంటున్నాయి. రెండు నెలలుగా ఈ ఫ్లూ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఇతర వేరియంట్లతో పోలిస్తే ఈ హెచ్3 ఎన్2 రకం ఎఫెక్ట్ ఎక్కువ అంటున్నారు.
ఇదీ చదవండి : ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనం.. స్థానిక సంస్థలు క్లీన్‌స్వీప్
ఈ రోగం సోకితే దగ్గు, జ్వరం, ఒళ్లు నొప్పులతో పాటు శ్వాసకోశ ఇబ్బందులు, వికారం, వాంతులు, గొంతునొప్పి, ఒళ్లు నొప్పులు, విరేచనాలతో తీవ్ర ఇబ్బందులు పడాల్సిందే. తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ వైరస్ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఎక్కువగా కనిపిస్తున్నట్టు వైద్యులు గుర్తించారు. విశాఖలోని ప్రతి నలుగురిలో ఒకరు జ్వరం, శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్నారు. దీంతో అలెర్టయిన అధికారులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు.
H3N2 వైరస్ సోకితే కనీసం వారం రోజుల పాటు లక్షణాలు కనిపిస్తాయి అంటున్నారు. ఇక స్మోకింగ్, డ్రింకింగ్ ఉన్నవారిపై దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది అంటున్నారు. వృద్ధులు, చిన్నారుల్లో మరింత ఎఫెక్ట్ చూపించనుంది. కొన్ని సందర్భాల్లో న్యూమోనియాకు దారితీసే ప్రమాదం కూడా ఉంది అని హెచ్చరిస్తున్నారు. ఈ వైరస్ సోకిన వారు పారాసిట్‌మాల్, బ్రూఫిన్ లాంటి ట్యాబ్‌లెట్లను వినియోగించవచ్చని వైద్యులు సూచిస్తున్నారు. యాంటీ బయాటిక్స్‌తో పాటు ఓఆర్‌ఎస్, పండ్ల రసాలు, ఎక్కువగా నీళ్లు తీసుకోవాలనేది డాక్టర్ల సలహా. ముఖ్యంగా చిన్నారులకు ఈ లక్షణాలు ఉంటే స్కూళ్లకు పంపకపోవడం మంచిదంటున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Ap government, AP News, Virus, Visakhapatnam