విశాఖపట్నంలో అప్పుడే వాతావరణం వేడెక్కింది. అయితే, అది పొలిటికల్ వాతావరణం కాదు. మామూలు వాతావరణమే. గత కొన్ని రోజులుగా ఉష్ణోగ్రతల్లో పెరుగుదల నమోదవుతోంది. ఇంకా వేసవి కాలం పూర్తిగా రాకముందే విశాఖ నగరంలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. విశాఖపట్నం మాత్రమే కాకుండా రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో కూడా టెంపరేచర్ పెరుగుతున్నట్టు రికార్డులు చెబుతున్నాయి. రాష్ట్రంలోని 495 వాతావరణ తనిఖీ సెంటర్లలో మధ్యాహ్నం పూట 35 డిగ్రీల నుంచి 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మరో 513 వాతావరణ కేంద్రాల్లో 30 డిగ్రీల నుంచి 35 డిగ్రీలకు అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్టు ఏపీ స్టేట్ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ ప్రకటించింది.
చిత్తూరు జిల్లాలోని విజయపురంలో రాష్ట్రంలోనే అత్యధికంగా 39.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. కడప జిల్లాలోని చింతకొమ్మందిలో 38.5 డిగ్రీల టెంపరేచర్ రికార్డయింది. ప్రకాశం జిల్లాలోని బెస్తవారి పేటలో 38 డిగ్రీలు, పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమడోలు 37.3 డిగ్రీలు, విశాఖ జిల్లాలోని కశింకోటలో 35 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాత్రి సమయంలో వాతావరణం చల్లగానే ఉంటున్నా, పగటి పూట మాత్రం వేడిగా ఉంటోంది. శీతాకాలం నుంచి వేసవికాలంలోకి మారే సమయం ఇదేనని, ఈ నెలలోనే రాష్ట్రంలో 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ డైరెక్టర్ కె.నాగరత్నం తెలిపారు. ఇంకా వేసవి కాలం రాకముందే విశాఖలో కూడా వేడి తీవ్రత పెరుగుతోందని ప్రజలు అంటున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Visakhapatnam, WEATHER