రిపోర్టర్ : జగదీష్
లొకేషన్ : వైజాగ్
అకాల వర్షాలకు అరటి తోటలు నేలమట్టమవడంతో రైతులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. అనకాపల్లి జిల్లాలో ఉగాది చినుకులు కొంతమంది రైతుల కళ్లల్లో ఆనందం నింపితే అరటి పండ్ల తోటల రైతులకు మాత్రం కన్నీటిని మిగిల్చింది. ఈ ఏడాదిలోనే లక్షలాది రూపాయలు పెట్టుబడులు పెట్టి కంటికి రెప్పలా కాపాడుకోగా, చేతికందివచ్చిన పండ్ల తోటలను ఈదురుగాలులు, వర్షం అంతా నేలమట్టం చేసింది. ఈదురుగాలులకు తోడు భారీ వర్షంతో అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గంలోని పలు గ్రామాల్లోని అరటి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. పలు గ్రామాల్లోని తోటలు చూస్తే గెలలతో ఉన్న అరటి పంట నేలమట్టమై రైతుల కంట నీరు తెప్పిస్తుంది. మరికొద్దిరోజులలో అరటిపంట చేతికి అందుతుందని ఆశించిన సమయంలో తుఫాను కారణంగా నేలమట్టంఅవ్వడంతో తీవ్రంగా నష్టపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
జిల్లాలో ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు గొలుగొండ మండలంలో సుమారు 300 ఎకరాల్లో టమాటా తోటలు కూడా దెబ్బతిన్నాయి. ఇవి తిరిగి కోలుకునే అవకాశం లేదని రైతులు చెబుతున్నారు. తాళ్లచీడికాడ, ఏటిగైరంపేట, లింగంపేట, పాకలపాడు, రావణాపల్లి, కొమిరి, ముంగర్లపాలెం తదితర ప్రాంతాల్లో వెయ్యి ఎకరాల్లో సాగవుతున్న అరటి తోటల్లో నీరు నిలిచిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కొన్ని చోట్ల భారీగా తోట పడిపోవడం జరిగింది. వాటికి మొదటి రోజు కురిసిన వర్షాలకు కర్రలు పెట్టి ఉంచినా.. మరో రెండు రోజులు కురిసిన వర్షాలుకు అవి కూడా పడిపోయాయి.రెండు రోజుల్లో 89.4 మిమీ వర్షపాతం నమోదైంది.
వాతావరణ శాఖ ప్రకటన ప్రకారం మరో రెండు, మూడు రోజులు వర్షాలు పడే అవకాశం వుందని చెప్తుండగా.. ఇప్పటికే కోతకు సిద్ధంగా ఉన్న అరటి గెలలు నేలపాలు అయిపోతున్నాయని వాపోతున్నారు. అధికారులు స్పందించి తమకు తగిన న్యాయం చేయాలని తెలుపుతున్నారు. పంటలు పడిపోయి వారం రోజులు అవుతున్నా ఎవరూపో పట్టించుకోవడంలేదని అరటి తోట రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Farmers, Local News, Rains, Visakhapatnam