విశాఖ దేవాదాయ శాఖలో విభేదాలు తారస్థాయికి చేరాయి. అధికారులు దుమ్మెత్తి పోసుకునే వరకు వచ్చాయి. సీనియర్ అధికారిపైనే ఓ మహిళా అధికారి శాపనార్థాలు పెట్టి మీద ఇసుక పోయడం సంచలనం సృష్టించింది. పనిలో భాగంగా సీనియర్ అధికారులు మందలించడం సహజం. కానీ, అదే మందలింపులు హద్దులు దాటకుండా చూసుకోవడం కూడా తెలుసుండాలి. ఇదే తెలియక దేవాదాయ శాఖలోని డిప్యూటీ కమిషనర్, అసిస్టెంట్ కమిషనర్ల మధ్య వివాదానికి దారితీసింది. తన గురించి డీసీ బయట అసత్యాలు చెబుతున్నారని, తన క్యారెక్టర్‌ను చెడుగా చిత్రీకరిస్తున్నారని మహిళా అసిస్టెంట్ కమిషనర్ సహనం కోల్పోయారు. ఏకంగా పై అధికారి అయిన డిప్యూటి కమిషనర్‌పైనే తన ఛాంబర్లోకి వెళ్లి మట్టి పోసి ఆగ్రహం వ్యక్తంచేశారు. దీనిపై సదరు డీసీ ఉన్నతాధికారులకు ఫిర్యాదుచేయడంతో విషయం బయటకొచ్చింది.
క్యారెక్టర్ చెడుగా చూపిస్తున్నాడని..
విశాఖ దేవాదాయ శాఖలో పుష్పవర్ధన్ డిప్యూటీ కమిషనర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆయన ఇటీవలె తెలంగాణ నుంచి ఏపీకీ బదిలీపై వచ్చారు. కాగా, పనిలో అలసత్వం ప్రదర్శిస్తున్న పలువురిని ఆయన మందలించని సందర్భాలు ఉన్నాయి. తన కింద పనిచేసే అసిస్టెంట్ కమిషనర్ శాంతితో కొంచెం దురుసుగా ప్రవర్తించారనే ఆరోపణలు ఉన్నాయి. అయితే శాంతిని తన ఛాంబర్లోకి పిలిచి పుష్పవర్ధన్ మరోసారి ఆగ్రహం వ్యక్తంచేశారు. దీంతో సహనం కోల్పోయిన శాంతి ఇసుకను డీసీ మీదకు చల్లారు. దీంతో ఆయన షాక్‌కు గురయ్యారు. దీనిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదుచేశారు. కాగా, ఇదే విషయంపై అసిస్టెంట్ కమిషనర్ శాంతి స్పందిస్తూ.. తన క్యారెక్టర్‌ను బయట చెడుగా చూపెడుతున్నారని ఆరోపణలు చేసింది. కింది స్థాయి సిబ్బందితో తనకు అక్రమ సంబంధాలు అంటగడుతున్నారని తీవ్ర ఆరోపణలు గుప్పించింది. తన కుటుంబసభ్యులు సైతం ఈ ఆరోపణలపై మనోవేధనకు గురయ్యారని శాంతి బోరుమన్నారు. ఎవరెవరో కాల్చేసి అడుగుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. తమ మధ్య ఉన్న విభేదాలపై పరిష్కరించుకునేందుకు రాజమండ్రిలోని రీజనల్ జాయింట్ కమిషనర్ వద్దకు రావాలని అధికారులు కోరినా డీసీ స్పందించలేదని ఆమె ఆగ్రహం వ్యక్తంచేశారు. విచారణకు రాకుండా న్యాయవాదితో వస్తానని తప్పించుకున్నాడని శాంతి తెలిపారు. డీసీ తప్పు లేకపోతే కమిషనర్ పిలిచిన సమయంలో విచారణకు ఎందుకు రాలేదని అసిస్టెంట్ కమిషనర్ ప్రశ్నించారు. కాగా, తాను ఎన్నో చోట్ల పని చేశానని ఎక్కడా ఇలాంటి ఘటన ఎదురుకాలేదని డీసీ వ్యాఖ్యానించారు. మరోవైపు ఘటన తీవ్ర దుమారం రేపడంతో రాష్ట్రవ్యాప్తంగా వైరల్ అయింది. అయితే ఇద్దరూ మంచి హోదాలో ఉన్నవారే కావడంతో ఉన్నతాధికారులు బహిరంగంగా స్పందించలేదు. శాఖాపరమైన విచారణ జరిపి చర్యలు తీసుకునే అవకాశం ఉంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.