Telugu Tradition: సంవత్సరంతా పెట్టుకున్నా పెట్టుకోకపోయినా, అసలు గోరింటాకంటే ఇష్టంలేని వాళ్లయినా సరే ఈ మాసంలో మాత్రం ప్రతి ఆడపిల్ల తమ చేతులు, కాళ్ళకి అందంగా గోరింటాకు పెట్టుకోవాలని పెద్దలు చెబుతుంటారు.
ఆషాడం (Ashadam) వచ్చిందంటే చాలు…కొత్త కోడలు పుట్టింటికి వెళ్లడం ఎంత ఆచారమో…ఆడపిల్లలు చేతికి గోరింటాకు పెట్టుకోవడం కూడా అంతే అనాదిగా వస్తున్న ఆచారం. ఈ ఆషాడ మాసం వచ్చిందంటే చాలు ఆడవాళ్లందరి నోటి నుంచి వచ్చే ఒకే ఒక పాట.. గోరింట పూచింది కొమ్మ లేకుండా.. ఇలా పాడుకుంటూ పెరట్లోని గోరింటాకు చెట్టు ఆకులు తెంచుతూ అందంగా మురిసిపోతుంటారు. సంవత్సరంతా పెట్టుకున్నా పెట్టుకోకపోయినా, అసలు గోరింటాకంటే ఇష్టంలేని వాళ్లయినా సరే ఈ మాసంలో మాత్రం ప్రతి ఆడపిల్ల తమ చేతులు, కాళ్ళకి అందంగా గోరింటాకు పెట్టుకోవాలని పెద్దలు చెబుతుంటారు. అయితే, అసలు ఆషాడమాసానికి, గోరింటాకు ఉన్న సంబంధం ఏంటనేది నేటి యువతుల ప్రశ్న. పెద్దల మాట పెరుగన్నం మూట..ఇది ఒకప్పటి మాట.
కానీ ఇప్పుడు పెద్దల మాట.. పిల్లల ప్రశ్నల మూట అన్నట్లుగా ఉంది. నేటి తరానికి పెద్దలు ఏం చెప్పినా.. మొదట ప్రశ్నలే సమాధానంగా వస్తాయి. అందుకే ఈ రోజుల్లో ఆడపిల్లలను గోరింటాకు పెట్టుకోమ్మా అంటే.. దానికి సమాధానంగా వందరకాల ప్రశ్నలు వేస్తుంటారు.
గోరింటాకు ఎలా పుట్టింది? దాని చరిత్ర..!
పురాణాల గాథల ప్రకారం గోరింటాకు ఎలా ఆవిర్భవించిందో ఓ కథనం ప్రాచుర్యంలో ఉంది. అదేంటంటే గోరింటాకు అంటే గౌరి ఇంటి ఆకు. గౌరీదేవి తన బాల్యంలో చెలికత్తెలతో కలిసి వనంలో ఆటలాడుకుంటున్న సమయంలో రజస్వల అయ్యిందట. ఆ రక్తపు చుక్క నేలతాకినప్పుడు ఓ మొక్క పుట్టింది. ఆ చెట్టుకున్న ముల్లులు చూసి చెలికత్తెలు భయంతో పర్వతరాజుకు విషయాన్ని తెలియజేశారు. వెంటనే పర్వతరాజు సతీసమేతంగా ఆ వనానికి విచ్చేశారు. అంతలోనే ఆ చెట్టు పెద్దదై..తాను సాక్షాత్తూ పార్వతీదేవి రుధిరాంశతో జన్మించానని..తన వలన లోకానికి ఏ రకమైన ఉపయోగం అంటూ ప్రశ్నిస్తుంది. ఆ సమయంలోనే పార్వతి ఆ చెట్టు ఆకులను తన చేతులతో కోస్తుంది. వెంటనే ఆమె చేతి వేళ్లు ఎర్ర బారిపోవడంతో..తన బిడ్డ చేతులు కందిపోయాయని రాజు బాధపడుతుంటే.. పార్వతి తనకు ఏవిధమైన బాధా కలుగలేదని… పైగా చేతులు చాలా అందంగా కనిపిస్తున్నాయని అంటుంది.
పర్వతరాజు ఇకపై స్త్రీ సౌభాగ్యం చిహ్నంగా ఈ గౌరింటాకు మానవలోకంలో ప్రసిద్ధి చెందుతుందని తెలుపుతారు. రజస్వల సమయాన ఉద్భవించిన ఈ చెట్టు స్త్రీల గర్భాశయ దోషాలు తొలగిస్తుందని చెబుతారు. అతిఉష్ణం తొలగించి స్త్రీల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. తన వర్ణం వలన చేతులకు, కాళ్లకూ అందాన్నిచ్చే అలంకార వస్తువుగానూ దీన్ని వాడవచ్చంటారు. అదే ఈ చెట్టు జన్మకు సార్ధకత అని పలుకగా గౌరితో సహా అందరూ ఆ చెట్టు ఆకుల పసరుతో చేతులు కాళ్లూ అందంగా ముస్తాబుచేసుకుంటారు.
అయితే ఆ సమయంలో కుంకుమకు ఒక సందేహం కలిగిందట. నుదుటన కూడా ఈ ఆకుతో బొట్టుగా పెట్టుకుంటారేమో.. తన ప్రాధాన్యత తగ్గిపోతుందేమోనని గౌరితో అంటుందట. ఇది కేవలం చేతులు, కాళ్లకు మాత్రమే.. నుదుటన పండదు అని సెలవిస్తుంది పార్వతీదేవి. మన భారత సంప్రదాయాలు, ఆచారాల్లో మనకు తెలిసినా..తెలియని ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉంటాయి. ఈ విషయాలను ఇప్పటికే చాలా మంది శాస్త్రవేత్తలు నిరూపించారు కూడా. గోరింటాకు అనేది చేతులు అందంగా కనిపించేందుకు మాత్రమే కాదు.. ఇందులో కొన్ని ఆరోగ్యప్రయోజనాలు కూడా ఉన్నాయి.
ఒంట్లో వేడిని తగ్గించే గోరింటాకు:
మన భారత కాలమానం ప్రకారం ఈ సీజన్లో అంటే ఆషాడంలో వర్షాలు పడుతుంటాయి. భగభగమండే ఎండా కాలం నుంచి తప్పించుకుని వాతావరణం అంతా చల్లగా మారుతుంది. వాతావరణం మారినా మన ఒంట్లో వేడి అలానే ఉంటుంది. బయట వాతావరణానికి తగ్గట్లుగా మన శరీరం వెంటనే మారకపోవడం వల్ల సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఈ గోరింటాకులో వేడిని తగ్గించే గుణం ఉంటుంది.. అంతేకాకుండా రోగ నిరోధక శక్తిని పెంచి రక్త ప్రసరణ సక్రమంగా జరిగేలా చేస్తుంది.
గర్భాశయ బాధలు నయం చేస్తుంది..!
ఇక శాస్త్రపరంగా గర్భాశయదోషాలు తీసేస్తుంది. అరచేతి మధ్యలో స్త్రీ గర్భాశయానికి రక్తాన్ని చేరవేసే ప్రధాన నాడులుంటాయి. వాటిలో ఉన్న వేడిని లాగేసి ప్రశాంత పరుస్తుంది గోరింటాకు. ప్రసవం కాగానే గోరింటాకు ముద్దగా నూరి బాలింత చేత మింగిస్తే ప్రసవం వలన ఏర్పడే గర్భాశయబాధలు నయం అవుతాయని పూర్వీకులు చెబుతున్నారు.
చేతి గోళ్లకు రక్షణ నిచ్చే గోరింటాకు..!
పలు చర్మవ్యాధులు రాకుండా గోరింటాకు రక్షణ ఇస్తుంది. ఆడవాళ్లు చేతులకు గోరింటాకు పెట్టుకోవడానికి మరో ముఖ్య కారణం ఉంది. ఇప్పడంటే వాషింగ్ మెషిన్లు వచ్చాయి కానీ…ఇంతకుముందు ఆడవాళ్లు ఎక్కువగా సర్ఫ్ (Surf), డిజర్జెంట్ (Detergent), బట్టల సబ్బులను ఎక్కువగా వాడుతుంటారు. ఆ సమయంలో వారి గోళ్లలోకి నీరు ఎక్కువగా వెళ్లి పలు సమస్యలు తలేత్తెవి. గోరుచుట్టు లాంటివి రాకుండా ఉండేందుకే గోరింటాకు పెట్టుకోమంటారు.
ఎర్రగా పండితే మంచి మొగుడొస్తాడు…!
ఆడపిల్లలు తమ చేతికి పెట్టుకునే గోరింటాకు ఎర్రగా పండితే మంచి మొగుడొస్తాడని చెబుతూ అమ్మమ్మ, నాయనమ్మలు పిల్లల చేతికి గోరింటాకు పెట్టేవాళ్లు. ఇలా ఎందుకంటారంటే.. పాత కాలంలో ఆడపిల్లలకు చదవుకన్నా కూడా మంచి భర్త వస్తే చాలనుకునే రోజులు.. అందుకే ఆడపిల్లలు మారాం చేయకుండా గోరింటాకు పెట్టుకోడానికి ఈ మాట అనేవారట.అయితే దాని వెనక ఒక మర్మం ఉందంటున్నారు నర్సీపట్నంకు చెందిన ఓ అమ్మమ్మ. ఆడవాళ్ల చేతులు సుతిమెత్తంగా ఉంటాయి..ఆ లేత చేతులకు పెట్టుకున్న గోరింటాకు.. మరింత ఎర్రగా పండి అందంగా కనిపిస్తుంది. అలా గోరింటాకు పండిన విధానం ఆడవాళ్ల ఆరోగ్యాన్ని సూచిస్తుంది. ఆరోగ్యంగా ఉన్నవాళ్లు చక్కగా ఉంటారు..అలాంటి వాళ్లకు మంచి భర్తే వస్తాడు కదా. అది కాలక్రమేణా ఓ నానుడిలా తయారయ్యింది.
గోరింటాకు ఎర్రగా పండాలంటే…!
ఇప్పటికీ ఆ నానుడి ప్రచారంలో ఉందనుకోండి. అయితే ఈ గోరింటాకు ఎర్రగా పండాలంటే మీరు కొన్ని చిట్కాలు పాటించాలి. గోరింటాకు నూరేటప్పుడు అందులో కొన్ని చుక్కల నిమ్మరసం పిండితే చాలు. లేదంటే చిటికెడు చింతపండు వేసినా సరిపోతుంది. ఈరోజుల్లో అంతా మిక్సీలోనే వేస్తున్నారు. అయితే కాస్త నిమ్మరసంతోపాటు గోరంత పంచధార కానీ, బెల్లం ముక్క గానీ వేసినా గోరింటాకు ఎర్రగా పండుతుంది. గోరింటాకు చేతికి, కాళ్లకు పెట్టుకున్నాక.. అది పూర్తిగా ఎండిపోయి రాలిపోయే స్థితిలోకి వచ్చిన తర్వాతే తీసేయాలి. అలా తీసేసిన తర్వాత వెంటనే చేతులను నీళ్లతో కడగకుండా..కాస్త కొబ్బరినూనె రాస్తే... మంచి కలర్ మాత్రమే కాదు ఎక్కువ రోజులు ఉంటుంది.
ప్రస్తుతం పల్లెటూర్లలో మాత్రమే దొరుకుతుంది ఈ గోరింటాకు. సిటీల్లో అయితే దొరకడం కష్టమే. అలాంటి వారి కోసం మార్కెట్లోనూ అమ్ముతుంటారు. అస్సలు గోరింటాకు దొరకని వాళ్లు కొందరు మెహందీతో తృప్తి పడుతుంటారు. ఏదో ఒకటి..చేతికైతే గోరింటాకు పెట్టుకుంటున్నారు కాదు అని కొందరు పేరెంట్స్ సంతోషపడుతుంటారు. కుదిరితే మీరు కూడా గోరింటాకు పెట్టుకోండి..అందానికి అందం ఆరోగ్యానికి ఆరోగ్యం.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.