Positive Story: మానవత్వం ముందు హిందువేంటి, ముస్లిం ఏంటి.. ఇంతకన్నా పాజిటివ్ వార్త ఉంటుందా..!

అల్తాఫ్ అంత్యక్రియలు నిర్వహిస్తున్న దృశ్యం, నివాళులర్పిస్తున్న అల్తాఫ్

ఏపీలోని విశాఖపట్నం నగరానికి చెందిన 84 ఏళ్ల వృద్ధురాలు గాంధారమ్మ కోవిడ్ లక్షణాలతో బాధపడుతూ.. మృత్యువుతో పోరాడుతూ వారం క్రితం తనువు చాలించింది. అయితే.. ఆ వృద్ధురాలు చనిపోయే ముందుగా తన చివరి కోరిక ఏంటో తెలియజేసింది.

  • Share this:
    కరోనా సెకండ్ వేవ్‌లో దేశంలో ఎటు చూసినా బెడ్లు దొరక్క అవస్థలు పడుతున్న కరోనా బాధితులు, ఆక్సిజన్ దొరక్క ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు, శ్మశానాల ముందు క్యూ కట్టిన అంబులెన్స్‌లు, కరోనా సోకిందన్న భయంతో కొందరి ఆత్మహత్యలు, ఈ మహమ్మారి కారణంగా తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మారిన చిన్నారులు, చేతికందొచ్చిన కొడుకునో, కూతురినో పోగొట్టుకుని కడుపు కోతతో కుమిలిపోతున్న కొందరు తల్లిదండ్రులు.. ఇలా పాజిటివ్ కేసులతో పరిస్థితులన్నీ నెగిటివ్‌గా తయారయ్యాయి. ఇలాంటి పరిస్థితుల్లో మనిషిలో ఆశ సన్నగిల్లింది. మానవత్వం మచ్చుకైనా కనిపించకుండాపోయింది. ఇంట్లో వ్యక్తి కరోనాతో చనిపోతే మృతదేహానికి అంత్యక్రియలు చేసేందుకు కూడా అయినోళ్లు ముందుకు రాక అనాథ శవంలా కరెంట్ మిషన్లలో కాలిపోయిన వాళ్లు ఎందరో. ఇలాంటి దీన పరిస్థితుల్లో మానవత్వంపై ఆశ కలిగించేలా, మనుషుల్లో ఇంకా మానవత్వం మిగిలే ఉందని ఈ సంఘటన గుర్తుచేసింది.

    వివరాల్లోకి వెళితే.. ఏపీలోని విశాఖపట్నం నగరానికి చెందిన 84 ఏళ్ల వృద్ధురాలు గాంధారమ్మ కోవిడ్ లక్షణాలతో బాధపడుతూ.. మృత్యువుతో పోరాడుతూ వారం క్రితం తనువు చాలించింది. అయితే.. ఆ వృద్ధురాలు చనిపోయే ముందుగా తన చివరి కోరిక ఏంటో తెలియజేసింది. తాను చనిపోతే.. తన కొడుకు, మనవడు విశాఖకు చేరుకోలేకపోయినట్లయితే తన అంత్యక్రియలను తమ పొరుగు వాళ్లైన అల్తాఫ్ బాబ్‌జాన్ చేతుల మీదుగా జరిపించాలని ఆమె తన కూతురికి చెప్పింది.


    ఈ పెద్దావిడ, అల్తాఫ్ ఇరుగుపొరుగు వారే కావడం గమనార్హం. అల్తాఫ్‌ను గాంధారమ్మ కొడుకులా చూసుకునేది. అయితే.. మతాలు వేరు కావడం, స్వతహాగా అల్తాఫ్ మలయాళీ ముస్లిం కావడంతో అమ్మ అంత్యక్రియలు నిర్వహించేందుకు ఒప్పుకుంటారో, లేదో అని తాను భావించినట్లు గాంధారమ్మ కుమార్తె విజయ కుమారి చెప్పారు. కానీ.. తన తల్లి చివరి కోరికను అల్తాఫ్‌కు చెప్పగానే ఆయన మరో ఆలోచన పెట్టుకోకుండా అందుకు అంగీకరించారని.. ఆమె తనను కొడుకులా చూసుకుందని, గాంధారమ్మ చివరి కోరిక తీర్చడం తన బాధ్యత అని అల్తాఫ్ తనతో చెప్పారని ఆమె తెలిపారు.

    మతం కంటే మానవత్వమే ముందు పుట్టిందని భావించిన అల్తాఫ్ గాంధారమ్మ అంత్యక్రియలను నిర్వహించి నలుగురికి ఆదర్శంగా నిలిచారు. అంతేకాదు.. గాంధారమ్మ అస్థికలను.. విశాఖ నుంచి 200 కిలోమీటర్లు ప్రయాణించి ఆమె స్వస్థలమైన కాకినాడకు తీసుకెళ్లి సొంతవాళ్లకు అందజేశాడు. తల్లీకొడుకు బంధానికి అల్తాఫ్ తన మానవతా హృదయంతో కొత్త నిర్వచనమిచ్చాడు. కడుపున పుట్టినంత మాత్రాన కొడుకులు కాలేరని, మనిషన్నాక కాస్తంత మానవత్వం కూడా ఉండాలని అల్తాఫ్ నిరూపించాడు.
    Published by:Sambasiva Reddy
    First published: