ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నం(Visakhapatnam ) జీ-20 సదస్సు(G-20 Summit)కు వేదికగా మారింది. మార్చి నెల 28, 29, 30 తేదీలలో మూడ్రోజుల పాటు జరిగే ఈ సదస్సుకు వచ్చే దేశ, విదేశాల అతిథుల కోసం ఏర్పాట్లు పూర్తి చేశారు. జీ-20 సదస్సు ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ. మల్లిఖార్జున (Mallikharjuna)అధికారులతో సమీక్ష జరిపారు. అతిథులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని అధికారుల్ని ఆదేశించారు. విఎంఆర్డిఎ(VMRDA) కార్యాలయంలో మూడ్రోజుల క్రితం విస్తృతంగా చర్చించారు.
విదేశీ అతిథులకు ఏర్పాట్లు..
జీ-20 సదస్సుకు వచ్చే వివిధ దేశాలకు చెందిన అతిధులు రాక సందర్భంగా విమానాశ్రయంలో వారికి స్వాగతం పలికేందుకు అవసరమైన ఏర్పాట్లు చేశారు. అతిథుల రోజు వారి కార్యక్రమాలు, వారి పర్యటనకు సంబంధించి ఆయా ప్రాంతాల్లో అవసరమైన ఏర్పాట్లకు తగు చర్యలు చేపట్టాలన్నారు. వారు బస చేయు హోటల్ వద్ద 24/7 హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ హెల్ప్ డెస్క్ లో రెవెన్యూ, జివియంసి, మెడికల్, పర్యాటకశాఖలకు సంబంధించిన సిబ్బందిని అందుబాటులో ఉండేలా 3 సిఫ్టులుగా పనిచేసేలా ఏర్పాట్లు చేయాలని వివరించారు. విమానాశ్రయంలోనూ హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసేలా తగు చర్యలు చేయాలని చెప్పారు.
మూడ్రోజుల పాటు సదస్సు..
జీ-20 సదస్సుకు వచ్చే గెస్ట్‌లు, వారి షెడ్యూల్‌ను అబ్జర్వ్ చేసేందుకు జివియంసిలో కంట్రోల్ రూం నిరంతరం పనిచేయాలని కమీషనర్ కు తెలిపారు. నగర సుందరీకరణ పనులుపై జివియంసి కమీషనర్ ను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో ప్రత్యేక స్పెషల్ శానిటైజేషన్ డ్రైవ్ నిర్వహించాలని కమీషనర్ కు సూచించారు. కేంద్ర మంత్రులు రాక సందర్భంగా వారికి బస, లైజన్ ఆఫీసర్లు, ఎస్కార్ట్, వాహనాలు, తదితర ఏర్పాట్లు గావించాలని డిఆర్ఒని ఆదేశించారు. ఈ కార్యక్రమానికి విచ్చేయుచున్న రాష్ట్ర మంత్రులు, కార్యదర్శులు, ఇతర రాష్ట్ర స్థాయి అధికారులకు అవసరమైన ఏర్పాట్లు గావించాలన్నారు.
సక్సెస్ అయ్యేలా ఏర్పాట్లు..
ఈ నెల 27వ తేదీ సోమవారం 80 మంది ఫారిన్ డెలిగేట్స్ విశాఖ రానున్నారు. 28వ తేదీ రాత్రికి రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్. జగన్ మోహన్ రెడ్డి విశాఖకు రానున్నారు. , అదే రోజు గాలా డిన్నర్ ఉంటుంది. అధికారులందరూ వారికి కేటాయించిన విధులను బాధ్యతగా నిర్వహించి జి-20 సదస్సును విజయవంతం చేయాలని సూచించారు విశాఖ జిల్లా కలెక్టర్. ఈ సమావేశంలో జిల్లా జాయింట్ కలక్టర్ కె.యస్. విశ్వనాధన్, జివియంసి కమీషనర్ పి. రాజబాబు, డిఆర్ఒ శ్రీనివాసమూర్తి, పలువురు అధికారులు పాల్గొన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.