VISAKHAPATNAM APARTMENTS SALES DOWN FALL IN VISAKHAPATNAM DUE TO HIGH PRICES FULL DETAILS HERE PRN VSP
Real Estate in Vizag: విశాఖలో రియల్ ఎస్టేట్ కు రెక్కలు.. భారీగా పెరిగిన ఫ్లాట్ల ధరలు
విశాఖపట్నం(ఫైల్)
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) కార్యనిర్వాహక రాజధానిగా (AP Executive Capital) విశాఖపట్నంను (Visakhapatnam) రాష్ట్ర ప్రభుత్వం (AP Government) ప్రకటించింది.
ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) కార్యనిర్వాహక రాజధానిగా (AP Executive Capital) విశాఖపట్నంను (Visakhapatnam) రాష్ట్ర ప్రభుత్వం (AP Government) ప్రకటించింది. దీంతో విశాఖ చుట్టుపక్కల ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ భూమ్ వచ్చింది. దీంతో వైజాగ్ లో అపార్ట్మెంట్ ఫ్లాట్ల ధరలు సామాన్యులకు అందనంత ఎత్తుకు వెళుతున్నాయి. ప్రతి బిల్డరు మధ్య తరగతి ప్రజలను లక్ష్యంగా చేసుకొని అపార్ట్మెంట్లు నిర్మిస్తున్నా... చివరికి వచ్చేసరికి అందుబాటు ధరల్లో ఇవ్వలేకపోతున్నారు. దాంతో ఫ్లాట్లు అమ్ముకోలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనికి ప్రధాన కారణం భూముల ధరలు భారీగా పెరిగిపోవడమేనని ఆయా వర్గాలు చెబుతున్నాయి. ఓవైపు ధరలు మధ్యతరగతికి అందుబాటులో లేకపోవడం.., మరోవైపు నిర్మాణ ఖర్చు పెరిగిపోవడంతో బిల్డర్లు నష్టపోయే పరిస్థితి వచ్చింది.
విశాఖపట్నంలో పరిపాలనా రాజధాని అని ప్రకటించిన తరువాత భూములకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. దాదాపు అన్ని ప్రాంతాల్లోను భూముల ధరలు 30 శాతం నుంచి 50 శాతం పెరిగిపోయాయి. అపార్ట్మెంట్ల నిర్మాణంలో ప్రధాన వ్యయం భూమిదే. అదే ఎక్కువ కావడం, ఆపై నిర్మాణానికి ఉపయోగించే స్టీల్, ఇసుక, సిమెంట్ ధరలు భారీగా పెరగడంతో ప్రాజెక్టుల వ్యయం అంచనాలను మించిపోయింది. అందుకు తగిన ధర వస్తేనే విక్రయించాలని బిల్డర్లు ఎదురు చూస్తుంటే.., బిల్డర్లు చెబుతున్న ధరలకు తామెక్కడ కొనగలం అంటూ మధ్య తరగతి ప్రజలు వెనక్కితగ్గుతున్నారు. ఈ నేపథ్యంలో మధురవాడ, పీఎం పాలెం, కొమ్మాది, పెందుర్తి, సుజాతనగర్, గాజువాక, కూర్మన్నపాలెం తదితర ప్రాంతాల్లో వేల సంఖ్యలో ఫ్లాట్లు ఖాళీగా ఉండిపోయాయి.
నగర శివారు ప్రాంతాల్లో గజం ధర రూ.40 వేలకు తక్కువ లేదు. పెద్ద రహదారులను ఆనుకుని వుంటే రూ.75 వేల నుంచి రూ.లక్ష వరకు చెబుతున్నారు. మరోపక్క నిర్మాణాలకు అవసరమైన ఇసుక, సిమెంట్, స్టీల్, ఎలక్ర్టికల్, టైల్స్ ధరలు 50 శాతం మేర పెరిగాయి. వీటికి తోడు ప్లాన్ అనుమతులు, విద్యుత్, తాగునీరు కనెక్షన్లు పొందడానికి చెల్లించే లంచాలు. ఈ నేపథ్యంలో చదరపు అడుగు రూ.4 వేలకు అమ్మడం తప్పనిసరిగా బిల్డర్లు చెబుతున్నారు. అంటే వెయ్యి చదరపు అడుగుల ఫ్లాట్ రూ.40 లక్షలకు విక్రయిస్తే కానీ బిల్డర్‌కు గిట్టుబాటు కావడం లేదు. మధ్య తరగతి ఉద్యోగులకు అంత మొత్తం రుణంగా లభించడం లేదు. రూ.20 లక్షల నుంచి రూ.25 లక్షల వరకే బ్యాంకులు రుణాలు ఇస్తున్నాయి. మిగిలిన మొత్తం చేతి నుంచి పెట్టాల్సి వస్తోంది. అది అందరికీ సాధ్యం కావడం లేదు.
కొత్తగా కొన్న ఫ్లాట్‌లో కుటుంబంతో కలిసి వుండాలనుకునే వారు తప్ప పెట్టుబడి కోసం ఎవరూ ఫ్లాట్లను కొనడం లేదు.మధురవాడ, పెందుర్తి ప్రాంతాల్లో ఫ్లాట్ అద్దెలు రూ.7 వేలకు మించి రావడం లేదు. నగరంలో కూడా రూ.కోటి పెట్టి ఫ్లాట్ కొన్నా రూ.20 వేలకు మించి అద్దె రావడం లేదు. ఇలా ఆలోచిస్తున్నవారు ఫ్లాట్‌పై కాకుండా స్థలంపై డబ్బు పెడితే భవిష్యత్తులో మంచి ధర వస్తుందని, అటు దృష్టి పెడుతున్నారు. దీనివల్ల ఫ్లాట్లు అమ్ముడుపోక చాలామంది బిల్డర్లు నష్టాలు చవిచూస్తున్నారు. మధురవాడ నుంచి అచ్యుతాపురం వరకు నగర పరిధిలో దాదాపు 30 వేల ఫ్లాట్లు అమ్మకానికి వున్నాయంటే నిర్మాణ రంగం పరిస్థితి ఏ విధంగా వుందో అర్థం చేసుకోవచ్చు.
గత ఏడాది వరకు మధురవాడ జాతీయ రహదారి నుంచి కిలోమీటరు లోపు గజం రూ.23 వేలు, సుజాతనగర్, కూర్మన్నపాలెం, పెందుర్తి ఏరియాల్లో గజం రూ.20 వేలు నుంచే లభ్యమయ్యేది. రాజధాని ప్రకటనతో ఎన్ఆర్ఐలు, ఇతర నగరాల నుంచి ఇన్వెస్టర్లు నగరానికి వచ్చి భూములపై పెట్టుబడులు పెట్టడంతో సాధారణ ప్రజలు, ఇక్కడున్న చిన్న బిల్డర్లు ఎక్కడా స్థలం కొనుగోలు చేసే పరిస్థితి లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో బిల్డర్లు అటు హైదరాబాద్, ఇటు ఒడిశా రాష్ట్రం గుణుపూర్, రాయఘడ, బరంపూర్, పర్లాకిమిడి వెళ్లి తమ వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.