బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం.. పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ సోమవారం నాటికి వాయుగుండంగా బలపడనుంది. శ్రీలంకకు సమీపంలో హిందూ మహాసముద్రం దానికి ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోంది. ఇది పశ్చిమ వాయువ్యంగా పయనించి ఆదివారం (జనవరి 29) నాటికి తీవ్ర అల్పపీడనంగా మారింది. సోమవారం నాటికి వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) శనివారం రాత్రి ఓ రిపోర్టులో వెల్లడించింది.
వాయుగుండం నైరుతి బంగాళాఖాతంలోకి ప్రవేశించి ఫిబ్రవరి 1న శ్రీలంక తీరానికి చేరుకుంటుందని తెలిపింది. దీని ప్రభావంతో ఈ నెల 30వ తేదీ నుంచి దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించారు. సోమవారం నుంచి మూడు రోజులపాటు దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
ఉత్తర కోస్తాంధ్రలో పొడి వాతావరణం నెలకొంటుందని, దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2–3 డిగ్రీలు తక్కువగా నమోదవుతాయని పేర్కొంది. మరోవైపు ఉత్తర కోస్తాతో పాటు యానాం ప్రాంతాల్లో పొగమంచు అధికంగా ఏర్పడే అవకాశం ఉంటుందని అంచనా వేశారు. రానున్న రెండు రోజులపాటు రాష్ట్రంలో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2నుంచి 3 డిగ్రీలు తక్కువగా నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ పేర్కొంది.
అయితే వాయుగుండం ప్రభావం తెలంగాణపై పడదన్నారు అధికారులు. తెలంగాణ వ్యాప్తంగా పొడి వాతావరణమే ఉంటుంది. నేటి నుంచి రాష్ట్రమంతా చలి సాధారణంగానే ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఎక్కడా ఎల్లో అలర్ట్ లు జారీ చేయలేదని తెలిపారు. హైదరాబాద్ లో గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 29 డిగ్రీలు, 15 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.