ఏపీలో వాతావరణం మారిపోయింద. ఇవాళ ఉదయం నుంచి పలు చోట్ల వాతావరణం చాలా చల్లగా మారింది. ఆకాశం మేఘావృతమై... చల్లగా మారింది. మరోవైపు ఆగ్నేయ బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం సోమవారం (జనవరి 30) ఉదయానికి నైరుతి బంగాళాఖాతంలో ప్రవేశించి వాయుగుండంగా బలపడింది. రేపు అంటే బుధవారం (ఫిబ్రవరి 1) ఉదయం శ్రీలంకలో తీరం దాటనుందని వాతావరణ శాఖ తెలిపింది. జనవరి 30 మధ్యాహ్నానికి శ్రీలంక ట్రింకోమలైకు 610 కిలోమీటర్లు, తమిళనాడులోని కరైకల్ కు 820 కిలోమీటర్లు తూర్పు ఆగ్నేయంగా కేంద్రీకృతమై ఉంది.
వాయుగుండం రేపు సాయంత్రం వరకు పశ్చిమ దిశగా పయనించి.. ఆ తర్వాత దక్షిణ నైరుతి వైపు దిశ మార్చుకుని ఫిబ్రవరి ఒకటో తేదీన శ్రీలంకలో తీరం దాటనుందని అధికారులు తెలిపారు. ఈ ప్రభావంతో ఏపీలోని కృష్ణపట్నం, నిజాంపట్నం తదితర ఓడరేవుల్లో ఒకటో నంబరు భద్రతా సూచిక ఎగరవేశారు. వాయుగుండం ప్రభావంతో రాయలసీమ, దక్షిణ కోస్తా ప్రాంతాల్లో ఈ రోజు అక్కడక్కడ వర్షాలు కురిశాయి. రానున్న 24 గంటల్లో ఉమ్మడి చిత్తూరు , నెల్లూరు , ప్రకాశం జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
అటు తిరుపతి జిల్లాతో పాటుగా తమిళనాడు సరిహద్దు ప్రాంతాల్లో ఈస్టర్లీస్ గాలుల మొదటి వర్షాలు ప్రారంభం అయ్యాయి. ఇది చిన్న చిన్న వర్షాలుగా కొద్దిసేపు ఉంటుందే కానీ భారీగా ఉండవు.నెల్లూరు, తిరుపతి, అన్నమయ్య, కడప జిల్లాలో తేలికపాటి వర్షాలుంటాయి. ఒకటి, రెండు చోట్ల మాత్రమే కొంచం సేపు గట్టిగా వర్షాలుంటాయి.ప్రకాశం, నంద్యాల, అనంతపురం, సత్యసాయి జిల్లాల్లో ఒకటి, రెండు చోట్లల్లో మాత్రమే తేలికపాటి వర్షాలు ఉంటాయి.ఇటు తెలంగాణలో మాత్రం వర్షాలు ఉండవని చెప్పారు వాతావరణ శాఖ అధికారులు. వాతావరణం చల్లగా ఉన్న వర్ష సూచన మాత్రం లేదన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.