ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) మూడు రాజధానుల అంశం 20 నెలలుగా నలుగుతూ వస్తోంది. ఏపీ రాజకీయాల్లో దుమారానికి కారణమైన మూడు రాజధానుల వ్యవహారం (3 Capitals Issue) ప్రస్తుతం కోర్టులో ఉంది. మూడు రాజధానులకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్ల రోజువారీ విచారణను హైకోర్టు (AP High Court) నవంబర్ కు వాయిదా వేసిన సంగతి తెలిసింది. రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడెప్పుడు విశాఖ వెళ్దామాని అని సన్నాహాలు చేస్తుంటే కోర్టులో మాత్రం బ్రేకులు పడుతున్నాయి. ఇటీవల ఈ వ్యవహారాన్ని కోర్టు వాయిదా వేసిన నేపథ్యంలో రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ (Minister Botsa Satyanarayana) కీలక వ్యాఖ్యలు చేశారు. సాంకేతికపరమైన అంశాల్లో కోర్టును ఒప్పించిన తర్వాతే మూడు రాజధానులను ముందుకు తీసుకెళ్తామని ఇటీవల ఆయన స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయం కచ్చితంగా అమలు చేసి తీరుతామని ఆయన స్పష్టం చేశారు. రాజధాని అంశంలో బొత్స మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా రైతుల ఉద్యమంపై కామెంట్స్ చేశారు.
రాజధాని తరలింపు విషయంలో రైతులతో చర్చించే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. “ ఏదైనా అంశం ఉంటే చర్చలు. మేం చేస్తుంది జరగాలంటే చర్చేంటి? కొన్ని గ్రామాలకో, ఓ సామాజిక వర్గానికో న్యాయం చేయడం కాదు. రాష్ట్ర ప్రజలందరికి సమాన న్యాయం, అభివృద్ధి చేయాలన్నదే మా ప్రభుత్వ విధానం, మా నిర్ణయం మాకు ఉంది. ఏరోజు అయితే శాసనసభలో చట్టం చేశామో, సీఎం ప్రకటించారో ఆక్షణం నుంచే మూడు రాజధానుల నిర్ణయం అమలు జరిగింది. అయితే అందుకు సంబంధించిన న్యాయపరమైన చిక్కులు అధిగమిస్తాం. ప్రభుత్వ విధానం మాకు ఉంటుంది.” అని ఆయన అన్నారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమగ్ర అభివృద్ధితో మూడు రాజధానుల నినాదాన్ని తీసుకొచ్చారన్న బొత్స.. విశాఖను పరిపాలనా రాజధానిగా ప్రకటిస్తే కోర్టుకు వెళ్లారన్నారు. అధికారం కోల్పోయిన వారు ఇలా చేయకూడదని హితవు పలికారు. విశాఖలో ఒక్క భవనం కట్టుకుండా అడ్డుకున్నారని.. ఇప్పుడు ఏ మొహం పెట్టుకొని ఉద్యమాలు చేస్తున్నారని బొత్స ప్రశ్నించారు. టీడీపీ హయాంలో ఉత్తరాంధ్ర అభివృద్ధిని మరిచారన్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి, సుజల స్రవంతి, స్టీల్ ప్లాంట్, గంగవరం పోర్టుపై ఇష్టం వచ్చినట్టు వ్యాఖ్యలు చేస్తున్న ప్రతిపక్ష నేతలు.. ఏ ఉద్దేశంతో వ్యతిరేకిస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ (Vizag Steel Plant Privatization) చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని స్వయంగా ముఖ్యమంత్రే వ్యతిరేకించారని.. ప్రధానమంత్రి, కేంద్ర మంత్రులకు ఈ విషయాన్ని స్పష్టం చేశారని బొత్స సత్యనారాయణ గుర్తు చేశారు. నరేంద్ర మోదీ కేబినెట్ లో టీడీపీ ఎంపీ అశోక్ గజపతి రాజు కేంద్ర మంత్రిగా పనిచేశారని.. అప్పట్లోనే ప్రైవేటీకరణ నిర్ణయం జరిగితే ఎందుకు వ్యతిరేకించలేదని నిలదీశారు. అచ్చెన్నాయుడు, అశోక్ గజపతిరాజు అయ్యన్నపాత్రులు ఉత్తరాంధ్ర భక్షకులు అని బొత్స విమర్శించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Amaravathi, Andhra Pradesh, Ap capital, Botsa satyanarayana, Visakhapatnam