Visakhapatnam: విశాఖ ఉక్కు ఉద్యమంలో కీలక పరిణామం. జేడీ పిటిషన్ పై కేంద్రానికి నోటీసులు

కేంద్రానికి హై కోర్టు నోటీసులు

విశాఖ ఉక్కు ఉద్యమంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఉక్కు ప్రైవేటీకరణ దిశగా వేగంగా అడుగులు వేస్తున్న కేంద్రానికి ఏపీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. మరి దీనికి ప్రభుత్వం ఎలాంటి సమాధానం చెబుతుందో చూడాలి.

 • Share this:
  విశాఖ ఉక్కు ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడుతోంది. రోజు రోజుకూ ఉద్యమం తీవ్రమవుతోంది. ఓ వైపు కరోనా వేగంగా విస్తరిస్తున్నా.. కార్మిక సంఘాలు వెనక్కు తగ్గకుండా ఉద్యమం చేస్తూనే ఉన్నారు. రోజుకో రూపంలో నిరసన తెలుపుతున్నారు. బీజేపీ, జనసేన మినహా అన్ని రాజకీయ పార్టీలు, మేధావులు, ప్రజా, విద్యార్థి సంఘాల నుంచి మద్దతు లభించడంతో ఉద్యాన్ని నిర్విరామంగా కొనసాగిస్తున్నాయి కార్మిక సంఘాలు. అయితే కేంద్రం మాత్రం ఇప్పటి వరకు ఒక్క అడుగు కూడా వేయలేదు. ప్రస్తుతం ప్లాంట్ కు భారీగా లాభాలు వస్తున్నాయి. రికార్డు స్థాయిలో ఉత్పత్తి జరుగుతోంది అయినా కేంద్రం మాత్రం ప్లాంట్ ప్రైవేటీకరణ దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలో న్యాయస్థానాలనే నమ్ముకున్నాయి కార్మిక సంఘాలు. ఇందులో భాగంగా మాజీ ఐపీఎస్ అధికారి లక్ష్మీ నారాయణ హైకోర్టులో పిటిషన్ వేశారు.

  తాజాగా విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ అంశంపై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణను సవాల్‌ చేస్తూ జేడీ లక్ష్మీనారాయణ దాఖలు చేసిన పిల్ పై ఉన్నత న్యాయస్థానం స్పందించింది. వెంటనే కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ నాలుగు వారాలకు వాయిదా వేసింది.

  కేంద్ర కేబినెట్‌ తీసుకున్న ప్రైవేటీకరణ నిర్ణయాన్ని నిలుపుదల చేయాలని పిటిషన్‌లో ఆయన కోరారు. ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా పరిశ్రమను లాభాల బాట పట్టించవచ్చని, ప్రైవేటీకరణ సమస్యకు పరిష్కారం కాదని లక్ష్మీనారాయణ ఆ పిటిషన్‌లో పేర్కాన్నారు. విశాఖ ఉక్కును నష్టాల నుంచి లాభాల బాటలోకి తీసుకొచ్చేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలో వివరిస్తూ గతంలోనే ఆయన కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ప్రైవేటీకరణను అడ్డుకునేందుకు కార్మికసంఘాలు, వివిధ పార్టీల నేతలతో లక్ష్మీనారాయణ సమాలోచనలు జరుపుతున్నాయి. మరి తాజా హైకోర్టు నోటీసులపై కేంద్రం ఎలా స్పందిస్తుందో చూడాలి. కార్మిక సంఘాలు మాత్రం కోర్టుల ద్వారా తమకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాయి.

  అందరిలా కేవలం కార్మిక సంఘాలకు సంఘీభావం తెలిపి జేడీ చేతులు దులుపుకోలేదు. ఓ వైపు చురుగ్గా ఉద్యమంలో పాల్గొంటూనే న్యాయ పరంగా పోరాటం చేస్తున్నారు. కచ్చితంగా కోర్టులో తన పిల్ కు న్యాయం జరుగుతుందని.. విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరించే అవకాశం కేంద్రానికి లేదని ఆయన గట్టి నమ్మకంతో ఉన్నారు. అందకే కోర్టును ఆశ్రయించారు. మరోవైపు విశాఖ ఉక్కును లాభాల బాట పట్టించేందుకు పలు సూచనలు చేస్తూ ప్రధాని మోదీకి లేఖ కూడా రాశారు.

  ఆ లేఖలో పేర్కొన్న అంశాలను అమలు చేస్తే స్టీల్ ప్లాంట్ కు మళ్లీ పూర్వవైభవం తీసుకురావచ్చని లేఖలో పేర్కొన్నారు. దేశంలో మిగిలిన కర్మాగారాలకు భిన్నంగా విశాఖ ఉక్కును చూడాలని కోరారు. సముద్రతీరంలో ఉన్న ఏకైక స్టీల్ ప్లాంట్ విశాఖే అని ఆయన గుర్తు చేశారు. ఎగుమతి, దిగుమతులకు అత్యంత అనుకూలమైన ప్రాంతం ఇదేనన్నారు. రానున్న కాలంలో స్టీల్‌కు డిమాండ్ పెరగనుందని.. మొన్నటి బడ్జెట్ ప్రసంగంలో కేంద్ర ఆర్థికమంత్రి సీతారామన్ ఈ విషయాన్ని స్పష్టం చేశారన్నారు. స్టీల్ పరిశ్రమలను ప్రయివేటీకరిస్తే… సిమెంట్ పరిశ్రమలకు పట్టిన గతే పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ధరలన్నీ కంపెనీ వాళ్ల చేతుల్లో ఉంటాయని హెచ్చరించారు. మిగిలిన స్టీల్ కంటే విశాఖలో ఉత్పత్తి అయ్యేది నాణ్యమైనదని తెలిపారు. చిన్న చిన్న మార్పులతో విశాఖ ఉక్కును తిరిగి లాభాల్లోకి తీసుకు రావొచ్చని అభిప్రాయపడ్డారు. ఆయన లేఖకు ఇప్పటి వరకు కేంద్రం స్పందించలేదు. కనీసం ఆ ప్రస్థావన కూడా ఎక్కడా తేవడం లేదు. మరి ఇప్పుడు కోర్టు నోటీసులతో ఎలా స్పందిస్తుందో చూడాలి.
  Published by:Nagesh Paina
  First published: