P. Anand Mohan, Visakhapatnam, News18
వర్క్ ఫ్రమ్ హోమ్ టౌన్ (Work From Home Town). ఇపుడు విశాఖపట్నంలో (Visakhapatnam) ఈ కాన్సెప్ట్ ఐటి యువతకి ఊతంగా కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (AP Government) ఐటీ రంగాన్ని మరింత విస్తరించడానికి ‘వర్క్ ఫ్రమ్ హోమ్ టౌన్’ (డబ్ల్యుఎఫ్హెచ్టీ) పథకాన్ని కొద్ది రోజుల క్రితం ప్రారంభించింది. కరోనా నేపథ్యంలో ఐటీ కంపెనీలు అనేకం ఉద్యోగులకు ఇంటి నుంచి పనిచేసే అవకాశం కల్పించాయి. అయితే ఉద్యోగులు ఎక్కువ మంది గ్రామీణ ప్రాంతాల్లో వుండడంతో వారికి విద్యుత్, హైస్పీడ్ ఇంటర్నెట్ సదుపాయం వంటివి లోపించాయి. దాంతో వారు అన్నిరకాల సౌకర్యాలున్న పట్టణాలకు వెళ్లి, ఓ ఇల్దు అద్దెకు తీసుకొని అక్కడి నుంచి పనిచేస్తున్నారు. ఈ సమస్యను గుర్తించిన ప్రభుత్వం ప్రతి ఉద్యోగి కేవలం 15 నిమిషాల వ్యవధిలో వర్క్ స్టేషన్కు చేరుకొని విధులు నిర్వహించేలా ‘వర్క్ ఫ్రమ్ హౌమ్ టౌన్’ సెంటర్లు ఏర్పాటుచేయాలని నిర్ణయించింది.
సాధారణంగా ఐటి కంపెనీలకి కార్యాలయాలలో, క్కడి వాతావరణం అనుగుణంగా ఉంటుంది. కరోనా వల్ల వర్క్ ఫ్రమ్ హోమ్ తప్పలేదు. అయితే గ్రామీణ ప్రాంతాల్లో టెక్నికల్ కారణాలతో చాలా అవరోధాలు ఉన్నాయి. ఇక వర్క్ ఫ్రమ్ హోమ్ టౌన్ సెంటర్లు ఇంజనీరింగ్ కాలేజీల్లో పెడుతున్నారు. సాయంత్రం ఐదు గంటల తరువాత మూసేస్తారు. ఆ తరువాత పనిచేసే అవకాశం ఉండదు. అలాగే ఆయా కాలేజీలకు హైస్పీడ్ ఇంటర్నెట్ ఉన్నా, నిరంతర విద్యుత్ సరఫరా కష్టం. ముఖ్యంగా ఐటీ కంపెనీలు వాటి ప్రాజెక్టులకు సంబంధించిన సమాచారం గోప్యంగా ఉంచాలనుకుంటాయి. డేటా సెక్యూరిటీ చూసుకుంటాయి. వాటికి ఈ సెంటర్లు తగిన భరోసా ఇవ్వలేవు. అయినా ఐటీ కంపెలన్నీ ఉద్యోగులను తిరిగి కార్యాలయాలకు రప్పించే సమయంలో ఈ వర్క్ స్టేషన్లు ప్రారంభించడం ఒక విధంగా ఐటి ఉద్యోగులకు మంచి పరిణామంగా ఉంది.
ప్రభుత్వం ఈ వర్క్ ఫ్రం హోమ్ టౌన్ సెంటర్లు ఏర్పాటు చేసి.. అక్కడ అన్ని రకాల సౌకర్యాలు కల్పించి, ఉద్యోగి నుంచి లేదా కంపెనీ యజమాని నుంచి నెలకు కొంత మొత్తం తీసుకునేలా ప్రణాళిక రూపొందించింది. ఇందుకోసం ఏపీ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్, ఏపీ ఐటీ అసోసియషన్, ఐటీ ఇన్నోవేషన్ సొసైటీ తదితర సంస్థలన్నింటినీ ఒక తాటిపైకి తెచ్చి నగరాలు, పట్టణాల్లో ఇందుకు అనువైన భవనాలు, సంస్థలను గుర్తించాలని ఆదేశించింది. రాష్ట్రవ్యాప్తంగా తొలుత 20 నుంచి 25 కేంద్రాలు ఏర్పాటు చేసి, దానికి లభించే స్పందనకు అనుగుణంగా ముందుకు వెళ్లాలని భావిస్తోంది. ఈ మేరకు ఐటీ శాఖ మంగళవారం ఈ ‘డబ్ల్యుఎఫ్హెచ్టీ’లను ప్రారంభించింది.
విశాఖపట్నంలో రుషికొండలోని స్టార్టప్ విలేజ్ (ఏపీ ఇన్నోవేషన్ సొసైటీ), అనిట్స్ ఇంజనీరింగ్ కళాశాల (తగరపువలస), దాడి ఇంజనీరింగ్ కాలేజీ (అనకాపల్లి)ని ఎంపిక చేశారు. ఒక్కో దాంట్లో కనీసం 50 మంది కూర్చొని పనిచేసుకునేలా ఏర్పాట్లు చేశారు. పథకంలో ఉద్యోగులు ప్రభుత్వం ఏర్పాటుచేసిన సెంటర్లకు వెళ్లి పనిచేసే అవకాశం విశాఖపట్నంలో చాలా తక్కువగా కనిపిస్తోంది. ఇంటి నుంచి బయటకు వచ్చే పరిస్థితే ఉంటే...వారు నేరుగా ఆఫీసుకు వెళ్లే చేసుకోవచ్చు. మరో సెంటర్కు వెళ్లాల్సిన పని లేదు. ఇంటి నుంచి బయటకు వస్తే పెట్రోల్, భోజనం ఖర్చు అదనం. స్టార్టప్ విలేజ్ రుషికొండలో ఐటీ పార్క్లోనే ఉంది. అది నగరానికి దూరం. అలాగే అనిట్స్ తగరపువలసలో ఉంది. ఉద్యోగులు అంతా నగరంలోనే ఉంటున్నారు. అంత దూరం వెళ్లాలంటే కష్టం. ఇటు వైపు దాడి కాలేజీ తీసుకుంటే అనకాపల్లి, చోడవరం వైపు వున్న ఉద్యోగులకు కాసింత వెసులుబాటుగా ఉంటుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.