ఉత్తమ సేవలు అందించిన వాలంటీర్లకు సత్కారం చేసే కార్యక్రమాన్ని ఏపీ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా చేపడుతోంది. విజయనగరం జిల్లా కురుపాంలో వాలంటీర్లకు సత్కార కార్యక్రమంలో పాల్గొన్న డిప్యూటీ సిఎం పుష్ప శ్రీవాణి.. పలువురు వాలంటీర్లపై బహిరంగంగా అసహనం వ్యక్తం చేశారు. కొంతమంది వాలంటీర్లు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారని ఆమె వ్యాఖ్యానించారు. నియోజకవర్గంలోని కొన్ని మండలాల్లో వైసీపీకి, జగన్ కు వ్యతిరేకంగా బహిరంగంగా ప్రచారం చేస్తున్నారని అన్నారు. కురుపాం మండలంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న పరిస్థితులు నెలకొన్నాయని తెలిపారు. గరుగుబిల్లి మండలంలో ఒక వాలంటీర్ భర్త ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎన్నికల్లో పోటీ చేశారని అన్నారు.
90 శాతం మంది ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేస్తున్నారని.. 10 శాతం ప్రభుత్వానికి వ్యతిరేక శక్తులుగా పనిచేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో వాలంటీర్లకు గుర్తింపు లభించిందంటే కేవలం సీఎం జగన్ వల్లే అని.. అది గుర్తు పెట్టుకోవాలని ఏపీ డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి అన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా సేవా మిత్ర అవార్డు కింద 2,18,115 మందిని సత్కరిస్తున్నామని రెండు రోజుల క్రితం సీఎం జగన్ అన్నారు. ఈ కేటగిరీలో ప్రతి వాలంటీర్కు రూ.10వేలు నగదు, సర్టిఫికెట్, శాలువా బ్యాడ్జి అందిస్తున్నామన్నారు. సేవారత్న అవార్డు కింద 4వేల మంది వాలంటీర్లుకు రూ.20వేలు నగదు, పతకం, శాలువా, బ్యాడ్జీ అందజేస్తున్నట్లు సీఎం తెలాపారు. మూడో కేటగిరీ అయిన సేవా వజ్ర అవార్డు కింద 875 మందికి రూ.30వేల నగదు సర్టిఫికెట్, శాలువాతో పాటు బ్యాడ్జి ఇస్తున్నామన్నారు. ఇక ప్రతి ఏడాది వాలంటీర్లకు సత్కారం చేస్తామని సీఎం జగన్ ప్రకటించారు. ప్రతి ఏడాది వాలంటీర్లు మెరుగైన పనితీరు కనబరచాలని పిలుపునిచ్చారు.
ప్రభుత్వం అందించే జగనన్న అమ్మఒడి, జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన, రైతు భరోసా, ఆరోగ్య శ్రీ వైఎశ్ఆర్ పెన్షన్ కానుక వంటి పథకాలు వాలంటీర్ల వల్లే సక్రమంగా అమలవుతున్నాయన్నారు. 20 నెలలుగా ఏమీ ఆశించకుండా పనిచేస్తున్న వాలంటీర్లను ప్రభుత్వం తగిన గుర్తింపునిస్తోందన్నారు. ఈ సందర్భంగా విధి నిర్వహణలో ప్రతిభ కనబర్చిన ఘటనలను సీఎం ప్రస్తావించారు. ప్రతి జిల్లాలోనూ రోజుకు ఓ నియోజకవర్గం చొప్పున వాలంటీర్లకు సత్కార కార్యక్రమం నిర్వహిస్తామని సీఎం జగన్ తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.