VISAKHAPATNAM ANNAVARAM TEMPLE TO INSTALL NEW TECHNOLOGY FOR MAKING SATYAVDAVA PRASADAM IN EAST GODAVARI DISTRICT FULL DETAILS HERE PRN VSP
Annavaram Temple: అన్నవరం భక్తులకు గుడ్ న్యూస్... 45 నిముషాల్లోనే సత్యదేవుని ప్రసాదం..
అన్నవరం ఆలయం
అన్నవరం (Annavaram Temple) అనగానే సత్యనారాయణ స్వామి వ్రతం, ఆ వెంటనే గోధుమనూక ప్రసాదం (Annavaram Prasadam) గుర్తు వస్తుంది. విస్తరిలో కట్టి ఇచ్చే ఆ ప్రసాదం భక్తులు అత్యంత ప్రీతికరమైనది.
అన్నవరం అనగానే సత్యనారాయణ స్వామి వ్రతం, ఆ వెంటనే గోధుమనూక ప్రసాదం గుర్తు వస్తుంది. విస్తరిలో కట్టి ఇచ్చే ఆ ప్రసాదం భక్తులు అత్యంత ప్రీతికరమైనది. సత్యనారాయణ స్వామి ప్రసాదానికి చాలా విశిష్టత ఉంది. తిరుపతి లడ్డూ తర్వాత అంతటి ప్రాశస్త్యం, పవిత్రత కలిగిన ప్రసాదం అన్నవరం సత్యదేవుడి ప్రసాదమే. వ్రతం చేసి ఈ గోధుమనూక ప్రసాదం తినకుంటే వ్రతఫలం దక్కదనే సాంప్రదాయం కూడా ఉంది. అంతటి ప్రాముఖ్యత ఈ ప్రసాదానికి ఉంది. అన్నవరం ఆలయానికి వెళ్లకపోయినా సరే.. అక్కడికి వెళ్లివారితో ప్రసాదం తెప్పించుకొని తింటారు సత్యదేవుని భక్తులు. గోధుమనూక, పాలు, నెయ్యి మరికొన్ని పదార్ధాలు కలిపి ఈ ప్రసాదాన్ని తయారు చేస్తారు. ఎలాంటివారైనా సరే ఒక్కసారి ఈ ప్రసాదాన్ని తింటే మళ్లీ మళ్లీ కావాలంటారు.. దాని రుచికి ఫిదా అవుతారు. తయారీ గురించి ఆరా తీస్తారు.
నిత్యం సత్యదేవుడి దర్శనానికి వచ్చే వేలాది మందికి ఆలయ అధికారులు ఈ ప్రసాదాన్ని అందిస్తున్నారు. అలాగే వ్రతం చేసుకునే దంపతులకు ఉచితంగానూ పంపిణీ చేస్తున్నారు. అధిక సంఖ్యలో వచ్చే భక్తులకి ఈ ప్రసాదాన్ని తయారు చేసి అందించడానికి దేవస్థానము ప్రత్యేక ఏర్పాటు చేసింది. ముప్పావుగంటలో ప్రసాదం తయారీ ఆ వెంటనే భక్తుల చేతిలో ప్రసాదం ఉండేలా అన్నవరం దేవస్థానం కొత్త యంత్రాలని సిద్ధం చేసి అమలు చేస్తుంది.
ముప్పావు గంట..!
ఇక మీద ముప్పావుగంటలో అన్నవరం సత్యదేవుని గోధుమ నూక ప్రసాదాన్ని యంత్రాల ద్వారా తయారు చేయడానికి శ్రీకారం చుట్టారు. ఈ ప్రక్రియ కొత్త భవనంలో మొదలైంది. తొలి కళాయిలో 80 కిలోల ప్రసాదం తయారైంది. స్వామికి నివేదన సమర్పించాక ప్యాకింగ్ సిబ్బంది 150 గ్రాముల చొప్పున విస్తర్లలో ప్యాక్ చేసి, విక్రయ కౌంటర్లకు పంపించారు. మంగళవారం భక్తుల సంఖ్య తక్కువగా ఉంటుందని, 98 కళాయిల్లో 7,930 కిలోల ప్రసాదం తయారు చేశామని అధికారులు తెలిపారు.
ప్రసాదం తయారీ ఇలా..
తొలుత వంద డిగ్రీల సెల్సియస్ వేడినీరు 40 లీటర్లు గొట్టం ద్వారా కళాయిలో పడింది. అందులో 35 కిలోల గోధుమ నూక మరో గొట్టం ద్వారా, ఇంకో గొట్టం ద్వారా రెండు విడతలుగా 30 కిలోల పంచదార పడ్డాయి. ప్రసాదం ఉడికిన తర్వాత ఆరు కిలోల నెయ్యి, 150 గ్రాముల యాలకుల పొడిని సిబ్బంది కలిపారు. కళాయికి ఇరువైపులా ఉన్న చక్రాలను ముందుకు వంచడం ద్వారా ప్రసాదం మరో తొట్టెలో పడింది. ప్యాకింగ్ సమయంలో మరికొంత నెయ్యి కలుపుతామని సిబ్బంది తెలిపారు. ఈ తయారీ ప్రక్రియ 45 నిమిషాల్లో ముగియడం ఆశ్చర్యం కలిగించింది. భవన దాత మట్టే సత్యప్రసాద్ చొరవ తీసుకుని యంత్రాల పనితీరు పర్యవేక్షణకు నలుగురు టెక్నీషియన్లను పంపించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.