Anand Mohan Pudipeddi, Visakhapatnam, News18.
AP Deputy Speaker: సాధారణంగా సోషల్ ఇంజనీరింగ్ (Social Engineering) లో సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM Jagan Mohan Reddy) తరువాతే ఎవరైనా..? పదువుల పంపకాల్లో ఆయన్న అన్నీ లెక్కలు వేసుకున్న తరువాత.. ఎంపిక చేస్తారు. ముఖ్యంగా సామాజిక సమీకరణాలపై ఎక్కువగా ఫోకస్ చేస్తారు. అలాగే రాజకీయ ప్రాంతల పరంగా కూడా ఈక్వెషన్స్ చూసుకుంటారు. తాజాగా స్పీకర్ (Speaker), డిప్యూటీ స్పీకర్ (Deputy Speaker) ఇద్దరూ ఒకే ప్రాంతానికి చెందిన వారినే నియమించడం రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే తాజా ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ గా వైసీపీ ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్ర స్వామి (Kolagatla Veerabadra Swamy) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
అధినేత జగన్ సూచనల మేరకు డిప్యూటీ స్పీకర్ పదవికి ఆయన ఒక్కరే నామినేషన్ దాఖలు చేయడంతో కోలగట్ల ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు స్పీకర్ ప్రకటించారు. దీంతో కోలగట్లను అధికార, ప్రతిపక్ష సభ్యులంతా అభినందనలు తెలిపారు. ఇంతకుముందు ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ గా ఉన్న కోన రఘుపతి ఉండేవారు. కానీ ఈ అసెంబ్లీ సెషన్ తొలి రోజే ఆయన ఆ పదవి నుంచి తప్పుకోవడంతో ఆయన స్ధానంలో కోలగట్లకు అవకాశం లభించింది.
అధికార పార్టీ నిర్ణయం మేరకు విజయనగరం వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్న కోలగట్ల వీరభద్రస్వామిని డిప్యూటీ స్పీకర్ గా సభ్యులు ఎన్నుకోవాల్సి ఉంది. అయితే విపక్ష టీడీపీ నుంచి ఎవరూ పోటీ చేయకపోవడంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవమైంది. జగన్ ఇచ్చిన మాట ప్రకారం తనను డిప్యూటీ స్పీకర్ స్ధానంలో కూర్చోబెట్టినందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నట్లు బాధ్యతలు స్వీకరించాక కోలగట్ల తెలిపారు.
ప్రస్తుతం టీవీలు, ఇతర మాధ్యమాల ద్వారా సభా కార్యక్రమాలను ప్రజలు గమనిస్తుంటారని, సభ పట్ల, సభ్యుల పట్ల గౌరవం పెంపొందించుకునే విధంగా అందరూ పనిచేయాలని కోలగట్ల కోరారు. సభలో చర్చలు అర్ధవంతంగా సాగేందుకు సభ్యులు సహకరించాలని, సభ్యులు వివిధ అంశాలపై పూర్తి అవగాహనతో రావాలని కూడా కోలగట్ల సూచించారు. తమను ఎన్నుకున్నందుకు ప్రజా ప్రతినిధులు అంతా..? ప్రజల మనోభావాల్ని గౌరవిస్తూ, వారికి, ప్రభుత్వానికి వారధిగా చట్టసభల్ని వాడుకునేందుకు అందరూ కృషి చేయాలన్నారు.
ఇదీ చదవండి : బంధువుల కారణంగా నష్టపోయాం.. లిక్కర్ స్కామ్ లింకులపై వైసీపీ ఎంపీ మాగుంట క్లారిటీ
డిప్యూటీ స్పీకర్ గా కోలగట్ల వీరభద్రస్వామిని కూర్చోబెట్టడం సంతోషంగా ఉందని సీఎం జగన్ తెలిపారు. రెండుసార్లు ఎమ్మెల్యేగా.. రెండుసార్లు ఎమ్మెల్సీగా పనిచేయడం, ఇప్పుడు డిప్యూటీ స్పీకర్ గా బాధ్యతలు చేపట్టడం సంతోషంగా ఉందన్నారు. కోలగట్ల కంటే ముందు డిప్యూటీ స్పీకర్ గా ఉన్న కోన రఘుపతి సేవల్ని కూడా సీఎం జగన్ ప్రశంసించారు. డిప్యూటీ స్పీకర్ గా చట్టసభలో అందరికీ మంచి చేయాలని ఆశిస్తున్నట్లు జగన్ తెలిపారు.
అయితే కోలగట్లను డిప్యూటీ స్పీకర్ గా ఎన్నిక చేయడానికి ప్రధాన కారణం.. ఇటీవల మంత్రి వర్గ విస్తరణ తర్వాత కొన్ని పదవుల్లో మార్పులు చేర్పులు చేయాలనుకున్నారు. అప్పుడే ఆయకు మంత్రి పదవి ఇస్తారని ప్రచారం జరిగింది. కానీ సామాజిక సమీకరణాలు.. జిల్లాల వారి లెక్కల నేపథ్యంలో అది సాధ్యం కాలేదు. అలాగే వైశ్య, బ్రాహ్మణ, కమ్మ సామాజిక వర్గాలకు నుంచి కేబినెట్ లో ఎవరికీ చోటు ఇవ్వలేదు. దీంతో అప్పుడు కోలగట్లకు డిప్యూటీ స్పీకర్ పదవి ఇస్తామని హామీ ఇచ్చారు. ఇటీవలే ఏపీ ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్‌గా మల్లాది విష్ణును నియమించారు. బ్రాహ్మిణ్ వర్గానికి ఆ పదవి ఇచ్చారు. చీఫ్ విప్‌గా శ్రీకాంత్ రెడ్డిని తొలగించి ప్రసాదరాజును నియమించారు. క్షత్రియ వర్గానికి అవకాశం ఇచ్చారు. అలాగే కొడాలి నానికి కూడా త్వరలోనే పెద్ద పోస్టు ఇస్తారని.. దీంతో కమ్మ సామాజిక వర్డానికి కూడా ప్లేస్ ఇచ్చినట్టు అవుతుంది. ఆ సామాజిక సమీకరణాలతో కోన రఘుపతిని తప్పించి కోలగట్ల వీరభద్రస్వామికి చాన్సిస్తున్నారు. దీంతో అనుకోకుండా స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఇద్దరూ ఒకే ప్రాంతానికి చెందినవారు ఎన్నికయ్యారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP Assembly, AP News, AP Politics, Vizianagaram