VISAKHAPATNAM ANDHRA PRADESH CM YS JAGAN MOHAN REDDY ANNOUNCED EX GRATIA TO GULAB CYCLONE VICTIMS FULL DETAILS HERE PRN
CM Jagan on Cyclone: తుపాను మృతుల కుటుంబాలకు అండగా ఏపీ ప్రభుత్వం... రూ.5లక్షలు ప్రకటించిన సీఎం జగన్…
గులాబ్ తుపాను నష్టంపై సీఎం జగన్ సమీక్ష
Cyclone Cyclone: గులాబ్ తుపాను మిగిల్చిన నష్టంపై ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి (AP CM YS Jagan Mohan Reddy) సమీక్ష నిర్వహించారు. తుపాను కారణంగా మరణించిన వారి కుటుంబాలకు పరిహారాన్ని ప్రకటించారు.
గులాబ్ తపాను (Gulab Tufan) ఉత్తరాంధ్రపై విరుచుకుపడిన సంగతి తెలిసిందే. శ్రీకాకుళం (Srikakulam), విజయనగరం (Vizianagaram), విశాఖపట్నం (Visakhapatnam) జిల్లాల్లో పాటు గోదావరి, దక్షిణకోస్తా జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. తుఫాన్ ధాటికి ఇళ్లు, విద్యుత్ స్తంభాలు వృక్షాలు కూలిపోయాయి. వేలాది ఎకరాల్లో పంటలు నీటమునిగాయి. తుపాను మిగిల్చిన నష్టంపై ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి(AP CM YS Jagan Mohan Reddy) సమీక్ష నిర్వహించారు. తుపాను కారణంగా మరణించిన వారి కుటుంబాలకు రూ. 5లక్షల పరిహారాన్ని ప్రకటించారు. పరిహారం తక్షణమే చెల్లించాలని అధికారులను ఆదేశించారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు వేగవంతం చేయాలన్నాన్న జగన్.. సాయం విషయంలో మానవతా దృక్పథంతో ఉదారంగా వ్యవహరించాలని సూచించారు. అవసరమైన అన్ని చోట్ల సహాయక శిబిరాలను తెరవాలని, ఇళ్లలోకి నీరు చేరి ఇబ్బంది పడుతున్న కుటుంబాలకు రూ. వెయ్యి చొప్పున, సహాయక శిబిరాల నుంచి బాధితులు వెళ్లేటప్పుడు కుటుంబానికి రూ. వెయ్యి చొప్పున ఆర్థిక సాయం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
పంట నష్టం అంచనా వేసి రైతులు ఆదుకునేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సీఎం జగన్ సూచించారు. తుపాను ప్రభావానికి గురైన శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల కలెక్టర్లతో సీఎం జగన్ మాట్లాడారు. ఇప్పటికే శ్రీకాకుళం జిల్లాల్లో ఉన్న సీఎస్ ఆదిత్యానాథ్ దాస్ ను అక్కడే ఉండి సహాయక చర్యలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆదేశించారు. శ్రీకాకుళం జిల్లాలోని 12 మండలాల్లో 64 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశామని, 38 పునరావాస కేంద్రాల్లో 1514 మంది ఉన్నారని జిల్లా కలెక్టర్ సీఎంకు వివరించారు.
ఇది చదవండి: ఏపీలో గులాబ్ తుఫాన్ బీభత్సం.., ఈ జిల్లాలకు తప్పని ముప్పు..
ఇక వర్షం తగ్గిన వెంటనే విద్యుత్ పనరుద్ధరణ యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. వర్షపునీరు ఎక్కువగా నిలిచిన ప్రాంతాల్లో మోటార్లు ఏర్పాటు చేసి నీటి పంప్ చేయాలని సూచించారు. పునరావాసాల్లో ఉన్నవారికి మంచి ఆహారం అందించడంతో పాటు వారు త్వరగా ఇళ్లకు చేరేలా పరిస్థితిని చక్కదిద్దాలని ఆదేశించారు.
మాజీ సీఎం, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు.. తుపాను సహాయక చర్యల్లో పాల్గొనాల్సిందిగా పార్టీ నేతలు కార్యకర్తలను ఆదేశించారు. ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టి నష్టాన్ని నివారించాలన్న చంద్రబాబు.. తుఫాన్ ప్రభావంతో ఉత్తరాంధ్రతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయన్నారు. ఉత్తరాంధ్ర, దక్షిణ కోస్తాలో పలు ప్రాంతాలు జలమయం కావడంతో వేలాది మంది నిరాశ్రయులు అయ్యారన్నారు. తుఫాన్ ప్రభావంతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు పార్టీ నాయకులు, శ్రేణులు, కార్యకర్తలు తమ వంతు సాయం అందజేయాలన్నారు.ప్రజలకు అవసరమైన నిత్యావసర సరకులతో పాటు లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వారిని సురక్షిత ప్రదేశాలకు తరలించడంలో సహాయం అందించాలని చంద్రబాబు పేర్కొన్నారు.
కాగా ఆదివారం రాత్రి శ్రీకాకుళం జిల్లా కళింగపట్నం వద్ద గులాబ్ తుఫాన్ తీరాన్ని దాటింది. ఆ తర్వాత ఇది తీవ్రవాయుగుండంగా మారింది. దీని ప్రభాత్వంతో ఉత్తరాంధ్రతో పాటు దక్షిణకోస్తా జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.