CM Jagan on Cyclone: బంగాళాఖాతంలో అసాని తీవ్ర తుపాను (Asani Cyclone) నుంచి తుపానుగా బలహీనపడింది. రేపు ఉదయానికి తుపాను వాయుగుండంగా బలహీనపడనుంది. ప్రస్తుతం మచిలీపట్నంకు 40 కిలోమీటర్లు.. కాకినాడ (Kakinada)కు 140 కిలోమీటర్లు, విశాఖపట్నం (Visakhapatnam)కు 280 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. మరోవైపు అసాని తుపానుపై కలెక్టర్లు (Collectors), ఎస్పీ (SP) లతో సీఎం జగన్ సమీక్ష చేశారు. తీసుకోవాల్సిన చర్యలపై సీఎం జగన్ (CM Jagan) ఆదేశాలు జారీ చేశారు. తుపాను నేపథ్యంలో అధికారులు అందరూ అనుక్షణం హై అలర్ట్ గా ఉండాలి అన్నారు. ఇప్పటికే సహాయక చర్యలకు సంబంధించి నిధులు విడుదల చేశామన్నారు. తీర ప్రాంతాల్లో మరింత అప్రమత్తత అవసరం అన్నారు. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. తుపాను బలహీనపడటం ఊరటనిస్తోంది అన్నారు. అయినంత మాత్రాన.. ఎక్కడా నిర్లక్ష్యానికి చోటివ్వకండి అన్నారు. ప్రజలకు ఎలాంటి ముప్పు రాకుండా చూడాల్సిన బాధ్యత అధికారుది అన్నారు. ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు. అవసరమైన చోట సహాయ, పునరావాస శిబిరాలు ఏర్పాటు చేయాలన్నారు. సహాయ శిబిరాలను తరలించిన వ్యక్తికి వెయ్యి రూపాయలు.. కుటుంబానికి 2 వేల రూపాయలు చొప్పున ఇవ్వాలని అధికారులకు సూచించారు..
ఇప్పటికే తొమ్మిది ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్ బృందాలను జిల్లాలకు ప్రభుత్వం పంపిందని గుర్తు చేశారు. అలాగే సహాయ శిబిరాల్లో మంచి సౌకర్యాలు ఏర్పాటు చేయండని సూచించారు. జనరేటర్లు, జేసీబీలు.. ఇవన్నీకూడా సిద్ధంచేసుకోండని.. ముఖ్యంగా కమ్యూనికేషన్ వ్యవస్థకు అంతరాయం ఏర్పడితే వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. తుపాను బాధితుల పట్ల మానవతా దృక్పథంతో వ్యవహరించాలన్నారు. సహాయక శిబిరాల్లో ఉన్నవారికి ఎలాంటి కష్టం వచ్చినా వెంటనే ఆదుకోవాలని సూచించారు. పరిహారం ఇచ్చే విషయంలో ఎలాంటి సంకోచాలు పెట్టుకోవద్దన్నారు. సెంట్రల్ హెల్ప్ లైన్‌తో పాటు, జిల్లాల వారీగా హెల్ప్‌లైన్ నంబర్లు సమర్థవంతగా పనిచేసేలా చూడాలన్నారు.
ఇదీ చదవండి : ఏపీని భయపెడుతున్న తుఫాను అలజడి.. పలు జిల్లాల్లో కంట్రోల్ రూంలు ఏర్పాటు.. నెంబర్లు ఇవే
మరోవైపు తుఫాను కొన్ని గంటల్లో వాయువ్య దిశగా పయనించి కొనసీమ అంతర్వేది దగ్గర భూభాగంపైకి వచ్చే అవకాశం ఉంది. సాయంత్రానికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోకి చేరుకునే అవకాశం ఉంది. ఇవాళ కోస్తాంధ్ర వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. రేపు ఉత్తరాంధ్ర వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు తెలిపారు. కోస్తాంధ్ర తీరం వెంబడి గంటకు 60-80 కిమీ వేగంతో ఈదురగాలులు వీస్తాయి.. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Ap cm jagan, AP News, Cyclone alert