P.Anand Mohan, Visakhapatnam, News18
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని పాడిపరిశ్రమలో సమూల మార్పులు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం (AP Government) అమూల్ మిల్క్ (Amul Milk)కు బాధ్యతలు అప్పజెప్పింది. ఏపీ డెయిరీ (AP Dairy) ఆస్తులతో పాటు ఇతర వ్యవహారాలన్నీ అమూల్ కు ఇచ్చేలా ఒప్పందం చేసుకుంది. ఇందులో భాగంగా ప్రయోగాత్మకంగా పశ్చిమ గోదావరి జిల్లా(West Godavari District)లో అమూల్ పాలసేకరణను ప్రారంభించింది. ఐతే అమూల్ పాలకి ప్రజల నుంచి స్పందన కరువైనట్లు తెలుస్తోంది. అమూల్ ఆశించిన స్థాయిలో కనీస సేకరణ కూడా జరగలేదు. వ్యవసాయ, పాడి పరిశ్రమ ప్రధానంగా ఉన్న జిల్లా కావడంతో ప్రభుత్వం ఈ జిల్లాపై ప్రత్యేక దృష్టి పెట్టింది. కలెక్టర్ సహా అనేక శాఖలను ఇందులో భాగస్వాములను చేసింది. కానీ ఫలితం మాత్రం సాధించలేకపోయింది. జిల్లాలో ఉత్పత్తి అయ్యే పాలలో కనీసం 0.5 శాతం పాలు కూడా అమూల్ పాల సేకరణ కేంద్రాలు సేకరించలేకపోతున్నాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.
పశ్చిమ గోదావరి జిల్లాలో అమూల్ పాల వెల్లువ పథకాన్ని అమలు చేయడం కోసం జిల్లా యంత్రాంగం 128 పాల సేకరణ కేంద్రాలను ఏర్పాటు చేసింది. వీటిలో ఇప్పటికే 16 కేంద్రాలు మూత పడ్డాయి. మిగిలిన 112 కేంద్రాల్లో పాల సేకరణ జరుగుతున్నా అంతంతమాత్రంగానే ఉంది. కాగా మరో 4 సేకరణ కేంద్రాలు మూసివేత దిశలో ఉన్నాయి. వీటన్నిటి ద్వారా ప్రభుత్వం సేకరిస్తున్న పాలు రోజుకు కేవలం 5,876 లీటర్లే. గతనెల 4,407 లీటర్లు మాత్రమే సేకరించాయి. జిల్లా నుంచి మండల స్థాయి వరకూ ఉన్న అధికారులంతా పూనుకోవడంతో ఈ నెల పాల సేకరణ కాస్తంత పెరిగింది.
కాగా అమూల్ కోసం మూసేసిన ఏపీ డెయిరీలో మూసివేత సమయంలో కూడా రోజుకు 10 వేల లీటర్ల పాల సేకరణ జరుగుతుండేదని పాడి రైతులు చెబుతున్నారు. కాగా ప్రైవేటు పాలకేంద్రాలు 10 శాతం వెన్న ఉన్న పాలకు లీటరుకి రూ.73 ఇస్తుండగా అమూల్ రూ.68లే ఇస్తోంది. మరోవైపు పాల సేకరణ సొసైటీ నిర్వాహకులు వేతనాలు డిమాండ్ చేస్తుండగా కమీషన్‌తో సరిపుచ్చుకోమని అమూల్ చెపుతుండడంతో వారు నిరాసక్తత ప్రదర్శిస్తున్నారు. ఫలితంగా పాలసేకరణ ఏమాత్రం పుంజుకోవడం లేదు.
పశు గణాభివృద్ధి శాఖ గణాంకాల ప్రకారం జిల్లాలో 5,01,840 పాడి గేదెలు ఉన్నాయి. వీటిలో 3,01,104 పాలు ఇచ్చేవి ఉండగా వీటి ద్వారా ప్రతి రోజూ 12 లక్షల 4 వేల 416 లీటర్ల పాలు ఉత్పత్తి అవుతున్నాయి. వీటిలో గృహ, పాక్షిక విక్రయాలకు 5 లక్షల 11 వేల 816 లీటర్లు వినియోగిస్తున్నారు. మిగిలిన 6 లక్షల 92 వేల 600 లీటర్ల పాలను పాడి రైతులు ప్రైవేటుగా విక్రయిస్తున్నారు.
వీటిలో ప్రైవేటు డెయిరీలకు 2 లక్షల 42 వేల 717 లీటర్లు, సైకిల్ వ్యాపారులు, ప్రైవేటు పాల కేంద్రాలకు 4 లక్షల 50 వేల 893 లీటర్ల పాలు విక్రయిస్తున్నారు. ప్రైవేటు పాలకేంద్రాలు, వ్యాపారులకు అమ్ముతున్న పాలను అమూల్‌కు సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు అనుగుణంగా కసరత్తు మొదలు పెట్టింది. అయితే ఆశించినంతగా స్పందన మాత్రం రాలేదు.ప్రస్తుతం 0.5 శాతం అంటే 5,876 లీటర్ల పాలు మాత్రమే అమూల్‌కు వస్తున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Dairy, Milk price