Setti Jagadeesh, News 18, Visakhapatnam
మెగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న 'వాల్తేరు వీరయ్య' (Waltair Veeraiah) చిత్రం ఈ సంక్రాంతి (Sankranthi) సందర్భంగా జనవరి 13న విడుదల కాబోతోంది. ఇప్పటికే ఈ సినిమా ప్రమోషన్స్ శరవేగంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా విశాఖపట్నంలో (Visakhapatnam) ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహణకు చిత్రయూనిట్ సన్నద్ధమవుతుంది. ముందు అనుకున్నట్లుగా సాగరతీరంలో ఏర్పాట్లను పెద్ద ఎత్తున చేస్తున్నారు. ఈనెల 8న ఈ ఈవెంట్ విశాఖలో జరగనుంది. మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) సంక్రాంతి కానుకగా వాల్తేరు వీరయ్య సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. బాబీ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా యొక్క ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
జనవరి 8న విశాఖలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని నిర్వహించబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు. దీంతో ఇక్కడ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. చాలా ఏళ్ల తర్వాత మెగాస్టార్ చిరంజీవి సినిమా ఈవెంట్ విశాఖలో జరగడం పట్ల ఇక్కడ అభిమానులు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ ఈవెంట్ కు విశాఖ నుంచే కాకుండా ఉత్తరాంధ్ర నుంచి అలాగే తెలంగాణ నుంచి కూడా పెద్ద ఎత్తున అభిమానులు తరలి రానున్నారు.
బీచ్ రోడ్డులో వాల్తేరు వీరయ్య మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది. సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ఆంధ్రప్రదేశ్ లో చేస్తేనే అదనపు షోలకు అనుమతి ఇస్తారనే ప్రచారం జరుగుతూ ఉన్న నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమా ఫ్రీరిలీజ్ ఈవెంట్ ని చిరంజీవి ఆంధ్రప్రదేశ్ లో ప్లాన్ చేశారు అంటూ పలువురు పేర్కొంటున్నారు.
ఇదిలా ఉండగా ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా అప్పుడే విశాఖ నగరంలో మెగా అభిమానుల హడావిడి మొదలయ్యింది. నగరంలో ఎక్కడ చూసినా మెగా అభిమానుల సందడి కనిపిస్తుంది. ఆర్ కె బీచ్ లో ఈవెంట్ నిర్వహణ ఏర్పాట్లు చేస్తున్న ప్రాంతానికి వెళ్లి చాలా ఉత్సాహంగా సంబరాలు చేసుకుంటున్నారు. జై చిరంజీవ అంటూ వాల్తేరు వీరయ్య మూవీలో చిరంజీవి గెటప్ వేసుకుని హంగామా చేస్తున్నారు. శుక్రవారం సాయంత్రం చిరంజీవి అభిమానులు పెద్ద సంఖ్యలో వుడా పార్క్ నుంచి ఆర్కే బీచ్ వైపు పెద్ద ఎత్తున ప్రదర్శన నిర్వహించారు. చిరంజీవి పోస్టర్స్ తో, అలాగే ఆ మూవీకి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్ టికెట్లతో ర్యాలీగా నడుచుకుంటూ వెళ్లారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Local News, Megastar Chiranjeevi, Visakhapatnam, Waltair Veerayya