Setti Jagadeesh, News 18, Visakhapatnam
దక్షిణ భారతదేశంలో ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న విశాఖపట్నం (Visakhapatnam) లోని సింహాచలం వరాహాలక్ష్మీనృసింహస్వామి దేవస్థానం (Simhachalam Temple) ఆధ్వర్యంలో ఈనెల 21న తెప్పోత్సవం నిర్వహించనున్నారు. ప్రతీ ఏటా పుష్య బహుళ అమావాస్య రోజున సాంప్రదాయబద్ధంగా నిర్వహించే ఈ ఉత్సవాన్ని ఈ ఏడాది కూడా అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు ఆలయ వర్గాలు భారీ ఏర్పాట్లు చేస్తున్నాయి. ఉత్సవంలో భాగంగా ఆ 'రోజు తెల్లవారు జామున సింహాద్రినాధుడు, శ్రీదేవి, భూదేవి అమ్మ వార్లను సుప్రభాత సేవతో మేల్కొలిపి ఆరాధన గావిస్తారు. అనంతరం గంగధార నుంచి తీసుకువచ్చిన పవిత్ర జలాలుతో అభిషేకం జరుపుతారు. ఆ తరువాత భక్తులకు స్వామి దర్శనం కల్పిస్తారు. సాయంత్రం సింహాద్రినాధుడు ఉత్సవమూర్తి ప్రతినిధిగా గోవిందరాజు స్వామికి సర్వాభరణాలుతో చూడముచ్చటగా వేణుగోపాల స్వామి అలంకరణ గావిస్తారు.
అనంతరం శ్రీదేవి, భూదేవిలతో స్వామిని మెట్ల మార్గం ద్వారా కొండ దిగువకు తీసుకురానున్నారు. ఆలయ తొలిపావంచ వద్ద గ్రామ పెద్దలు, అధికారులు, ధర్మకర్తల మండలి సభ్యులు స్వామికి సాష్టాంగ నమస్కారం చేసి గ్రామంలోకి సాదరంగా స్వాగతం పలుకుతారు.
అక్కడ నుంచి నేరుగా వరాహ పుష్కరణికి చేరుకొని హంసవాహనంపై అమ్మవార్లతో కలిసి విహరిస్తారు. ప్రత్యేక పూజలు అనంతరం కొండ దిగువున ఉన్న పుష్కరణి సత్రంలో ఆశీనులను చేసి ఉయ్యాల సేవ జరుపుతారు. అనంతరం సర్వజన మనోరంజక వాహనంపై స్వామిని ఆశీనులను చేసి గ్రామ తిరువీధి నిర్వహిస్తారు. ఉత్సవం సందర్భంగా ఆలయ వర్గాలు ఏర్పాట్లు చేస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Local News, Visakhapatnam