VISAKHAPATNAM AGENCY ARAKU PADERU TURNING OUT TO BE GOOD DESTINATIONS FOR MOVIE SHOOTINGS IN ANDHRA PRADESH FULL DETAILS HERE PRN VSP
AP News: పుష్ప నుంచి ఆర్ఆర్ఆర్ వరకు.. ఏపీలో బెస్ట్ షూటింగ్ స్పాట్ ఇదే..
ప్రతీకాత్మకచిత్రం
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో చాలా పర్యాటక ప్రాంతాలున్నాయి. ముఖ్యంగా విశాఖపట్నం (Visakhapatnam) ఏజెన్సీ ప్రకృతి అందాలకు కేరాఫ్ అడ్రస్. ఒక ఆర్.ఆర్.ఆర్ (RRR Movie), ఒక పుష్ప (Pushpa Movie). ఇలాంటి సినిమాల షూటింగ్ లకి వేదిక మన్యం. అరకు (Araku Valley) లో ఎన్నో సినిమాలు అలవోకగా షూటింగ్ జరుపుకున్నాయి.
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో చాలా పర్యాటక ప్రాంతాలున్నాయి. ముఖ్యంగా విశాఖపట్నం (Visakhapatnam) ఏజెన్సీ ప్రకృతి అందాలకు కేరాఫ్ అడ్రస్. ఒక ఆర్.ఆర్.ఆర్ (RRR Movie), ఒక పుష్ప (Pushpa Movie). ఇలాంటి సినిమాల షూటింగ్ లకి వేదిక మన్యం. అరకు (Araku Valley) లో ఎన్నో సినిమాలు అలవోకగా షూటింగ్ జరుపుకున్నాయి. అటు రంపచోడవరంలోని అనేక అటవీ ప్రాంతాలు సినిమా షూటింగ్ లకి హాట్ స్పాట్ లు మారాయి. పాడేరు వంటి ఏజెన్సీలు ఎన్నో అందాలతో సినిమా వాళ్లని ఇటు రమ్మని ఆకట్టుకుంటున్నాయి ఇలా ఒకటేంటి ఎన్నో సినిమాల షూటింగ్ లకి వేదికవుతోంది ఏజెన్సీ ప్రాంతం. అయితే అవి మాత్రమే అనుకుంటే పొరపాటే. ఏజెన్సీలో మరెన్నో అందాలు ఉన్నాయి. షూటింగ్ స్పాట్ లకి అనుకూలంగా కొద్ది మార్పులు చేస్తే చాలు. ఇటు గిరిజనులకి.. అటు సినీ పరిశ్రమ అభివృద్ధికి కూడా నోచుకుంటుంది.
అరకు.. పాడేరు.. రంపచోడవరం.. ఈ మూడు ప్రాంతాల పేర్లు చాలు. మన్యం అందాల్ని పరిచయం చేయడానికి. ఆంధ్రా ఊటీ అరకు అందాలు... చారిత్రక సాక్ష్యం బొర్రా గుహలు... ఆ గుహలో కొలువుదీరిన మహా శివుడు.. డముకు జల ప్రవాహం .. రెండో ప్రపంచ యుద్ధానికి సాక్ష్యంగా పద్మాపురం గార్డెన్... ఎన్నో సినిమాలకు అందాన్నిచ్చిన చాపరాయి.. కాఫీ మాట చెప్తే గుర్తుకొచ్చే అనంతగిరి.. అరకు... పచ్చని కొండలు మంచు మేఘాలు... వేసవిలో వర్షాలు ఇవి చాలు మన్యం అందాల్ని మచ్చుకైనా చెప్పడానికి. కొత్త జిల్లాగా ఏర్పడిన పాడేరులో ఇప్పుడు ఇవన్నీ చూడొచ్చు. అల్లూరి నడిచిన నేలగా చెప్పే ఈప్రాంతమంతా మన్యంగా పిలుకుంటారు. ఇక్కడి అందాలు చూసిన వారు మళ్ళీ మళ్లీ వస్తారు. మరి అవే అందాలు సినిమా షూటింగ్ లకి కూడా ఉపయోగించుకుంటే ఎంతో బాగుంటుంది.
ఆంధ్ర కాశ్మీర్ గా చెప్పుకునే లంబసింగిలో పాండవులు కొలువుతీరిన పాండవుల కొండ.. అక్కడికి రెండు కిలోమీటర్ల దూరంలో చెరువుల వెనం అందాలు మర్చిపోలేనివి. పైనాపిల్.. ఆపిల్ ..స్ట్రాబెర్రీ... సీతాఫలం... రామా ఫలం... మొక్కజొన్న ఇలాంటి ఎన్నో స్వచ్ఛమైన పంటలకు నిలయమైన రాజుల పాక.. చిట్రాల గొప్పి వంటివి ఇక్కడ ఫేమస్. వీటిలో కొన్నిటిలో ఇప్పటికే షూటింగ్ స్పాట్లుగా మారుతున్నాయి. డ్రాగన్ ఫ్రూట్ తొలి ప్రయోగం రాజుల పాకలోనే జరిగింది. ఇప్పుడు మన్యం అంతా పాకింది. ఈ అందాలు చూడటానికి, షూటింగ్ చేసుకోవడానికి ఎంతో బాగుంటాయి. ఇక చింతపల్లి... గూడెం రోడ్లు... రూథర్‌ఫర్డ్ గెస్ట్ హౌస్ ఇవన్నీ ఆ నాటి సూపర్ స్టార్ కృష్ణ అల్లూరి సీతారామరాజు చిత్రానికి హిట్ ఇచ్చాయి. తాజంగి రిజర్వాయర్ గురించి చెప్పాల్సిన పనిలేదు.
ఇక ఆంధ్రా ఒడిశా సరిహద్దులోని జోలాపుట్ .. ఒనక ఢిల్లీ.. డుడుమ వాటర్ ఫాల్స్ కూడా షూటింగ్లకి అనుకూలమే. గిరిజనుల ఆరాధ్య దైవాలైన వనదేవతలకి పెట్టింది పేరు మన్యం. కాశీ పట్టణంలో కొత్తమ్మ తల్లి... అరకు లో గంగమ్మ తల్లి... పాడేరులో మోదకొండమ్మ తల్లి.. చింత పల్లి ముత్యాలమ్మ తల్లి దారకొండలో దారాలమ్మ తల్లి.. సీలేరులో మారెమ్మ తల్లి.. గూడెం..లంబసింగి ఘాట్ రోడ్ లో బోడకొండ అమ్మ తల్లి.. కల్యాణపులోవలో పోతురాజు ఆలయాలు ఇప్పటికీ పూజలందుకుంటున్నాయి. ఇవి షూటింగ్లకి అట్టే ఖర్చు లేని పని. తక్కువ ఖర్చుతోనే ఇక్కడ షూటింగ్ లు జరుపుకోవచ్చు. జోనర్ ఏదైనా షూటింగ్ లకి అనుకూలంగా అందాలు కనిపించాలంటే ఈ ప్రాంతాలు బాగుంటాయి.
మొన్నటి ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ కోసం రాజమోళి ఇక్కడ రెండు వారాలు గడిపారు. ఇక్కడే ఒక సెట్ వేసి.. ఫస్ట్ ఆఫ్ షూటింగ్ జరిపారు. గిరిబాలిక పిక్చరైజేషన్ మొత్తం ఇక్కడే జరిగింది. పాడేరుకు 15 కిలోమీటర్ల దూరంలోని ఏపీ ఫారెస్ట్ డెవలెప్మెంట్ అధారిటీకి చెందిన మినుములూరు కాఫీ తోటల్లోనే చిత్రీకరించారు. ఇందుకోసం గిరిజన గూడెం సెట్‌ను నిజంగా గిరిజన పల్లె అన్నట్లుగానే రూపొందించారు. అలాగే ఘాట్‌లోని అమ్మవారి పాదాలకు ముందున్న మరో కాఫీ తోటల్లో ఆ గిరి బాలికను ఆంగ్లేయులు ఎత్తుకుపోవడం, వారి వాహనాన్ని అడ్డుకున్న బాలిక తల్లిపై దాడి చేయడం వంటివి చిత్రీకరించారు. పుష్ప సినిమా అటు రంపచోడవరం అటవీ ప్రాంతాల్లో షూటింగ్ జరిపిన సంగతి తెలిసిందే.
ప్రస్తుతానికి అడవులు, ఏజెన్సీ అందాలు చూపాలంటే.. ఆంధ్రలోని ఈ మన్యం అటవీ ప్రాంతాలు చాలా అనుకూలం. అందుకే ఇక్కడ షూటింగ్ జరపడానికి ప్రయత్నాలు మొదలైతే మరింత మేలు. ఇప్పటికే ఆర్ఆర్ఆర్ వంటి సినిమాలు షూటింగ్ జరుపుకోవడంతో మరిన్ని సినిమాలకి షూటింగ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందని అంటున్నారు ఇక్కడి ప్రజలు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.