Home /News /andhra-pradesh /

VISAKHAPATNAM A HIGH DOSAGE OF UREA CAUSES CROP LOSS VSJ NJ ABH

Vizag: పంటకు యూరియా ఎక్కువగా వాడుతున్నారా? తస్మాత్ జాగ్రత్త.. మీ వరి పంట మటాష్...!

పంటకు

పంటకు యూరియా వాడుతున్నారా? తస్మాత్‌ జాగ్రత్త..!

తొలకరి సాగులో భాగంగా రైతన్నలు పంటపొల్లాల్లో పనులు మొదలుపెట్టారు. అయితే ఈ సమయంలోనే రైతులు చాలా జాగ్రత్తగా ఉండాలి. అటు విత్తనాల ఎంపిక నుంచి ఎరువుల వాడకం వరకు అన్ని విషయాల్లోనూ జాగ్రత్తగా ఉన్నప్పుడే పంట దిగుబడి బాగుంటుంది.

  (Setti Jagadesh, News 18, Vizag)

  తొలకరి సాగులో భాగంగా రైతన్నలు పంటపొల్లాల్లో పనులు మొదలుపెట్టారు. అయితే ఈ సమయంలోనే రైతులు చాలా జాగ్రత్తగా ఉండాలి. అటు విత్తనాల ఎంపిక నుంచి ఎరువుల వాడకం వరకు అన్ని విషయాల్లోనూ జాగ్రత్తగా ఉన్నప్పుడే పంట దిగుబడి బాగుంటుంది. అందుకే వ్యవసాయ అధికారులు సైతం ఈ సమయంలో రైతన్నలకు అవగాహన కల్పించే ప్రయత్నాలు చేస్తుంటారు.

  అనకాపల్లి జిల్లాలో వరి పొలాల్లో రైతులు వరినాట్లు వేస్తున్నారు. ఇప్పటికే పలు రిజర్వాయర్ల నుండి కాలువలోకి సాగునీరు విడుదల చేయడం, వర్షాలు విరివిరిగా కురుస్తున్న నేపథ్యంలో ఉడుపులు ప్రారంభించారు. నర్సీపట్నం ప్రాంత తాండవ రిజర్వేయర్ పరిధిలో 52,500 ఎకరాల్లో వరిసాగు జరుగుతోంది. రైతు భరోసా కేంద్రం (RBK), సొసైటీలలో విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉన్నాయని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు.

  అయితే ఈ వరి సాగు ప్రారంభం నుండి ఎంత మోతాదులో యూరియా వాడాలి.. ఎక్కువ యూరియా వాడితే ఎటువంటి నష్టాలు వస్తాయి అనే దానిపై న్యూస్‌18తో వ్యవసాయ అధికారి అప్పారావు కొన్ని విషయాలను పంచుకున్నారు.

  యూరియా ... రైతన్నలకు వరమా..? నష్టమా..?

  రోజురోజుకు ఎరువుల ధరలు పెరిగిపోతున్నాయి. ఈ తరుణంలో కాంప్లెక్స్ ఎరువుల కన్నా తక్కువ ధరలకే యూరియా లభ్యమవుతుంది.. అంతేకాదు యూరియా వేసిన వెంటనే పైరు పచ్చగా కన్నుల పండుగగా కనిపిస్తుంది..దీంతో అధిక మోతాదులో యూరియాను వాడేందుకు రైతులు మొగ్గు చూపుతున్నారు. దీని వల్ల ఆర్థిక ఖర్చు.. చీడపీడల తాకిడి ఎక్కువవ్వడం..మళ్లీ వాటి నిర్మూలనకు ఆర్థిక వ్యయం ... చివరగా రైతు జేబుకు చిల్లు తప్ప ఎలాంటి ఉపయోగం లేదంటున్నారు వ్యవసాయ అధికారి అప్పారావు.

  అసలు యూరియాలో ఏముంటుంది?

  46 శాతం నత్రజని కలిగిన అత్యంత శక్తివంతమైన ఎరువు యూరియా. తెల్లని గులికల రూపంలో ఉన్న ఈ ఎరువును పొలాల్లో వెదజల్లుటకు రైతులకు అనుకూలంగా ఉంటుంది. తేలికగా నీటిలో కరిగి మొక్కకు అందుబాటులోకి మారుతుంది.

  యూరియా ఎక్కువగా వాడితే..!

  యూరియా చాలా తేలికగా నీటిలో కరిగిపోతుంది.. గాలిలో కలిసిపోతుంది. దీనివల్ల గాలి, నీరు కలుషితం అవుతున్నాయి. ధాన్యపు పైర్లు విపరీతంగా పెరిగి.. బరువు తట్టుకోలేక మొక్క వంగిపోయి నేలకు పడిపోవడం, పూత ఆలస్యంగా వచ్చి పంటకాలం పొడిగించడం, తాలు గింజలు ఏర్పడటం వంటి నష్టాలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. బెల్లం దగ్గరకు చీమలు చేరినట్లు అధికంగా యూరియా వేసిన చోట.. చీడపీడలు సులభంగా చేరుతాయి. దీనివల్ల ఆర్థిక పెట్టుబడులు, దిగుబడి తగ్గిపోవడం లాంటివి జరుగుతాయి.

  యూరియాతో లాభం పొందాలంటే..!

  పైరుకు నత్రజని అవసరం మొదటి నుండి చివరి వరకు ఉంటుంది కాబట్టి 3 -4 దఫాలుగా యూరియా వేయాల్సిఉంటుంది. యూరియా వేసేటప్పుడు తేమ ఉండేలా చూసుకోవాలి. వరిలో నాట్లు వేసేప్పుడు, పిలక దశలో చిరుపొట్ట దశలో వేయాలి. అంతే కాదు నీరు తీసివేసి బురద పదును మీద చల్లి 24 -48 గంటల తర్వాత నీరు పెట్టాలి.

  వేపపిండితో కలిపి యూరియా వేసుకుంటే నత్రజని సామర్థ్యం పెరుగుతుంది. అంతేకాదు చీడపీడలను అరికడుతుంది. (50 కిలోల యూరియాను 5 కిలోల వేపపిండి కలపాలి).

  భూమిలో తగిన తేమ లేనప్పుడు, ఎరువును వేసిన తరువాత నీరు పెట్టడానికి వసతి లేనప్పుడు, సమస్యాత్మక భూములలో నత్రజని అందించడానికి సాధారణంగా అన్ని పంటల మీద, ఫలవృక్షములు మీద 2 -3 శాతం యూరియా ద్రావణాన్ని పిచికారీ చేయాలి. మెట్ట పైర్లలో యూరియా వెదజల్లుట కాని మొక్క ప్రక్క గుంతలో వేసి మట్టి కప్పడం వలన యూరియా వృధానీ అరికట్టవచ్చు.

  మీ పొలాల్లో యూరియా చల్లేటప్పుడు కాస్త జాగ్రత్తగా చూసి వాడండి.. మీకు ఏమైనా సందేహాలుంటే మీ దగ్గరలోని రైతుభరోసా కేంద్రాలకు గానీ, వ్యవసాయ అధికారులను కానీ సంప్రదించండి.

  ఫోన్‌ నెంబర్‌ : 8331056413, అప్పారావు, AO నర్సీపట్నం.
  Published by:Abhiram Rathod
  First published:

  Tags: Agriculture, Andhrapradesh, Local News, Visakhapatnam

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు