తల్లిదండ్రులు తమ పిల్లలను ఉన్నతస్థానాల్లో చూడాలని కలలుకంటూ ఉంటారు. అందుకు తగ్గట్లుగానే వారిని మంచి చదువులు చదివించాలని తాపత్రయపడుతుంటారు. ఐతే కొందరు మాత్రమే వాటిని నిజం చేస్తారు.. మరి కొందరు మాత్రం ఏమీ చేయలేక అడ్డదారులు తొక్కుతుంటారు. అలా ఓ తల్లి కలను నిజం చేసే క్రమంలో అడ్డదారులు తొక్కిన కొడుకు చివరకు కటకటాలపాలయ్యాడు. వివరాల్లోకి వెళ్తే.. ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణాజిల్లా తోట్లవల్లూరు మండలం రొయ్యూరుకు చెందిన లుక్కా పృథ్వీరాజ్ బీఎస్సీ కంప్యూటర్స్ చదివాడు. తండ్రి లేకపోవడంతో తల్లి సుజాత కూలి పనులు చేస్తూ అతడ్ని పెంచి పెద్ద చేసింది. ఈ క్రమంలో పృథ్వీరాజ్ పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగానికి దరఖాస్తు చేశాడు. 2017లో సెలక్షన్స్ కు వెళ్లినా ఉద్యోగం సాధించలేకపోయాడు. కానీ తనకు విజయవాడలో కానిస్టేబుల్ ఉద్యోగం వచ్చిందని అందర్నీ నమ్మించాడు. ఓ యూనిఫామ్ కొనుగోలు చేసి అదే యూనిఫాంలో స్వగ్రామానికి వెళ్లడంతో కుటుంబ సభ్యులు, బంధువులు, స్థానికులు అందరూ నమ్మేశారు.
మూడేళ్ల క్రితం ట్రైనింగ్ కి వెళ్తున్నట్లు నమ్మించి కొన్నినెలలు ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. విజయవాడ శివారులోని నున్న సమీపంలో తన ఫ్రెండ్ కి చెందిన కోళ్ల పారంలో పనిచేశాడు. ఏడాది క్రితం ఓ యువతిని పెళ్లి కూడా చేసుకున్నాడు. తనపై నమ్మకం కుదిరేందుకు నెలనెల ఇంటికి డబ్బులు కూడా పంపేవాడు. ఐతే పృథ్వీ వ్యవహారంపై పోలీసులకు అనుమానం వచ్చి అతడిపై నిఘా పెట్టారు.
ఈ క్రమంలో ఆదివారం కండ్రిక సమీపంలో వాహనాలు తనిఖీ చేస్తుండగా పోలీస్ యూనిఫాంలో బైక్ పై వెళ్తూ పోలీసులకు దొరికిపోయాడు. పృథ్వీ నకిలీ పోలీస్ అని తేలడంతో అతడ్ని అరెస్ట్ చేసి నున్న పీఎస్ కు తరలించారు. ఐతే తాను యూనిఫాంతో ఎవర్నీ బెదిరించలేదని.. కేవలం తన తల్లిని సంతోషపెట్టేందుకే అలా చేశానని వివరించాడు. మొత్తానికి తల్లిని సంతోషపెట్టాలన్న కోరిక ఆ కొడుకును కటకటాల పాలు చేసింది. ఉద్యోగం రాకుంటే నిజం చెప్పి వేరే ఉద్యోగానికి ప్రయత్నించాలి గానీ ఇలా అందర్నీ మోసం చేయడం సరికాదని పలువురు అంటున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.