• Home
  • »
  • News
  • »
  • andhra-pradesh
  • »
  • VIJAYAWADA WOMAN WON CORONA AND GIVES BIRTH A BABY BOY AND DIED AFTER HEARING HER MOTHER DEATH NEWS IN VIJAYAWADA ANDHRA PRADESH FULL DETAILS HERE PRN

కరోనాను గెలిచి బిడ్డకు జన్మనిచ్చింది.. కానీ ఆ సంతోషం ఎంతోసేపు నిలవలేదు.. ఇది మాటలకందని విషాదం..

ప్రతీకాత్మక చిత్రం

కరోనా మహమ్మారి (Corona Virus) జీవితాలను తలకిందులు చేస్తోంది. రోజుల వ్యవధిలో కుటుంబాలను ఊడ్చేస్తోంది.

  • Share this:
    కరోనా వైరస్ ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. ప్రస్తుతం భారత్ లో విలయతాండవం చేస్తోంది. ఆరోగ్యంగా ఉన్నవారు సైతం మహమ్మారి బారి నుంచి తప్పించుకోలేక ఊపిరి వదులుతున్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లోనూ కరోనా తీవ్రత అధికంగా ఉంది. కానీ నిండు గర్భంతో ఉన్న ఓ మహిళ కరోనాను గెలిచింది. వైరస్ ను సవాల్ చేస్తూ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఇక అంతా సంతోషంగా ఉన్న సమయంలో ఊహించని ఘటన ఎదురైంది. రెండు వారాల పసిగుడ్డుకు తల్లిని దూరం చేసింది. వివరాల్లోకి వెళ్తే.. విజయవాడలోని సింగ్ నగర్ కుచెందిన వెంకటేశ్వరరావు, రమాదేవి దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు. బీఎస్ఎన్ఎల్ లో పనిచేసిన వెంకటేశ్వరరావు కొంతకాలం క్రితం రిటైర్ అయ్యారు. వీరి చిన్న కుమార్తె ప్రమీలా.. తాను పనిచేసే బ్యాంకులోనే సహోద్యోగి అయిన గణేష్ అనే యువకుడ్ని ప్రేమించి పెద్దల అంగీకారంతో గత ఏడాది పెళ్లి చేసుకుంది. గర్భిణి కావడంతో మూడు నెలల క్రితం పుట్టింటికి వచ్చింది. ఇదిలా ఉంటే గత నెలలో కుటుంబ సభ్యులంతా కరోనా బారినపడ్డారు.

    ఈ క్రమంలో ప్రమీలకు కూడా పాజిటివ్ గా తేలడంతో ధైర్యంతో మహమ్మారిని ఎదుర్కొంది. రెండు వారాల పాటు కరోనాతో యుద్ధం చేసి పూర్తిగా కోలుకుంది. ఆ వెంటనే పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఓవైపు కరోనా తగ్గిపోవడం, మరోవైపు బాబు పుట్టడంతో కుటుంబ సభ్యులంతా సంతోషంలో మునిగిపోయారు. ఇటీవలే బాబును తీసుకొని అత్తగారింటికి కూడా వచ్చింది.

    అంతాబాగానే ఉందనుకున్న సమయంలో ప్రమీల తల్లి రమాదేవికి కరోనా సోకింది. ఆమె కరోనాతో పోరాడుతూ సోమవారం మృతి చెందారు. ప్రమీలకు ఆపరేషన్ జరగడంతో ఆమెకు తల్లిమరణ వార్తను తెలియనివ్వలేదు. ఐతే మంగళవాలం తల్లి మరణ వార్త తెలియడంతో ఒక్కసారిగా షాక్ కు గురై కుప్పకూలిపోయింది. అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను కుటుంబ సభ్యులు హాస్పిటల్ కు తరలించారు. ఐతే అప్పటికే ప్రమీల మృతి చెందినట్లు డాక్టర్లు తేల్చారు.

    ప్రమీల మృతితో రెండు వారాల పసికందు తల్లి లేనివాడయ్యాడు. కొడుకు పుట్టాడని ఆనందపడేలోపే గణేష్ కు భార్య దూరమైంది. ఒక్క రోజు వ్యవధిలో అటు భార్య, ఇటు కుమార్తె మృతి చెందడంతో వెంకటేశ్వరరావు శోకసంద్రంలో మునిగిపోయారు. ప్రస్తుతం ఆయన కూడా కరోనాతో పోరాడుతున్నారు. తల్లికుమార్తెల మృతితో సింగ్ నగర్ ప్రాంతంలో విషాదఛాయలు అలముకున్నాయి. ఆరోగ్యవంతులను కూడా బలితీసుకుంటున్న కరోనా మహమ్మారి ప్రత్యక్షంగా తల్లిని.. పరోక్షంగా కూతురిని బలితీసుకుంది. ఏపీలో కరోనా వైరస్ సృష్టిస్తున్న విలయానికి ఇదే ఉదాహరణగా చెప్పవచ్చు.
    Published by:Purna Chandra
    First published: