సాధారణంగా భార్యభర్తల మధ్య చాలా గొడవలు జరుగుతుంటాయి. ఒకరి పద్ధతులు ఒకరికి నచ్చకపోవడం, సరిగా వంట చేయకపోవడం, భర్త ఆలస్యంగా ఇంటికొస్తున్నాడనో.. లేక మద్యం తాగుతున్నాడనో.. డబ్బులు జాగ్రత్త చేయడం లేదనో గొడవలు జరుగుతుంటాయి. కానీ ఓ భార్య తన భర్తపై వెరైటీ కేసు పెట్టింది. భర్త తన బుగ్గ కొరికాడంటూ కంప్లైంట్ ఇచ్చింది. పోలీసులు కూడా భర్తపై కేసు బుక్ చేశారు. ఐతే ఇదేదో సరదాగానో లేక రొమాంటిక్ గానో జరిగిన ఘటన కాదు. దీని వెనుక పెద్ద స్టోరీనే ఉంది. వివరాల్లోకి వెళ్తే... ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని కృష్ణా జిల్లా (Krishna District) పెనమలూరు మండలం కానూరులోని కేసీపీ కాలనీకి చెందిన తాళ్లపూడి రాంబాబు, స్రవంతి భార్యభర్తలు. భర్త సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. భార్య ఇంట్లోనే ఉంటోంది.
ఐతే రాంబాబుకు మద్యం తాగే అలవాటుంది. ఈ క్రమంలో ఆదివారం సాయంత్రం బాగా తాగి ఇంటికొచ్చాడు. మత్తులో స్రవంతితో గొడవ పెట్టుకున్నాడు. అప్పటికే భర్తపై విసిగిపోయిన స్రవంతి.. గొడవలు వద్దంటూ గట్టిగా మందలించింది. దీంతో భార్యపై కోపంతో ఊగిపోయిన రాంబాబు.. ఆమెను కొట్టి ఆ తర్వాత బుగ్గ కొరికేశాడు. వెంటనే తప్పించుకొని ఆస్పత్రికి వెళ్లిన ఆమె.. చికిత్స చేయించుకున్న తర్వాత భార్యపై పెనమలూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు రాంబాబుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరి ఈ కేసులో భర్తను అరెస్ట్ చేశారా.. లేక భార్యాభర్తల గొడవ గనుక రాజీ చేసి పంపారా అనేది మాత్రం తెలియాల్సి ఉంది.
ఇదిలా ఉంటే గతంలో భార్యాభర్తలు సిల్లీ రీజన్స్ తో పోలీస్ స్టేషన్ మెట్లు, కోర్టులకు వరకు వెళ్లిన సందర్భాలున్నాయి. ఇండియాలో తక్కువగానీ విదేశాల్లో అయితే టూత్ పేస్ట్ సరిగా పెట్టుకోవడం లేదని, బఠాణీలు ఫోర్క్ తో తినడం లేదని, స్నానం సరిగా చేయడం లేదని, డ్రెస్సింగ్ సరిగ్గా లేదని, కుటుంబ సభ్యులతో సరిగా మాట్లాడటం లేదన్న వంకలతో ఆలుమగలు విడాకుల వరకు వెళ్లిన ఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. ఇక టైమ్ కి ఇంటికి రావడం లేదని, కుటుంబానికి సమయం కేటాయించడం లేదన్న రీజన్స్ కూడా డైవర్స్ కు పోలీస్ కంప్లైంట్లకు దారితీస్తున్నాయి. చిన్నచిన్న గొడవలు చినికి చినికి గాలివానలా మారి దాంపత్య జీవితాన్ని నాశనం చేస్తున్నాయి. భార్యభర్తల గొడవల కారణంగా పిల్లలు నలిగిపోతున్నారు. ఇలాంటి ఘటనలు వారి భవిష్యత్తుపై ప్రభావం చూపుతున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.