VIJAYAWADA VIJAYAWADA GANDHI HILL HAS MANY SPECIALTIES TAKE A LOOK AT THE HISTORIC PLACE FULL DETAILS HERE PRN VPR NJ
Vijayawada: మహాత్ముడికి సరైన నివాళి ఆ కొండ.. అక్కడ ప్రత్యేకతలెన్నో..!
విజయవాడ గాంధీ హిల్
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని విజయవాడ (Vijayawada) నగరం నడిబొడ్డున ఉన్న ప్రధాన టూరిస్ట్ ప్లేస్ గాంధీ కొండ. విజయవాడ లో కనకదుర్గ అమ్మవారి గుడి (Vijayawada Durga Temple) తరువాతి స్థానం ఈ గాంధీ కొండదే ప్రధాన ఆకర్షణగా చెబుతుంటారు.
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని విజయవాడ (Vijayawada) నగరం నడిబొడ్డున ఉన్న ప్రధాన టూరిస్ట్ ప్లేస్ గాంధీ కొండ. విజయవాడ లో కనకదుర్గ అమ్మవారి గుడి (Vijayawada Durga Temple) తరువాతి స్థానం ఈ గాంధీ కొండదే ప్రధాన ఆకర్షణగా చెబుతుంటారు. ఇది సముద్ర మట్టానికి 500 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఈ కొండపై గాంధీ స్మారక స్థూపం ఉంది. దేశ వ్యాప్తంగా ఉన్న ఆరు గాంధీ స్మారకస్థలాల్లో ఇది ఒకటి. అంతేకాదు ఇదే మొదటిది. దీంతో ఈ కొండకు గాంధీ కొండ అనే పేరు వచ్చింది. గాంధీ స్మారకాన్ని నిర్మించక ముందు ఈ కొండకు ఓర్ కొండ అనే పేరు ఉండేది. అప్పటి భారతదేశ రాష్ట్రపతి అయిన Dr జాకీర్ హుస్సేన్ అక్టోబర్ 1968లో ఈ స్థూపాన్ని ప్రారంభించారు.
ఈ స్థూపం 52 అడుగుల పొడవైన నిర్మాణం. ఇక్కడున్న "మహాత్మా గాంధీ మెమోరియల్ లైబ్రరీ" గాంధీజీ జీవితం, గతిపథంను చూపుతాయి. ఒక వీడియో, ఆడియో రూప ప్రదర్శన, మరియు ఒక ప్లానెటోరియం కూడా ఇక్కడ ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి.
ఓర్ కొండ టూ గాంధీ హిల్‌గా మార్పు
1852లో కృష్ణానదిపై తొలి బ్యారేజీని నిర్మించిన కెప్టెన్ చార్లెస్ ఓర్ ఈ కొండపై నుండే ఆనకట్ట నిర్మాణాన్ని పర్యవేక్షించేవాడు. అప్పటి నుండి ఈ కొండకు ఓర్ కొండ ఆనే పేరు వచ్చింది. ఆ ఆనకట్ట వందేళ్ళ తరువాత 1952లో వచ్చిన వరదల్లో కొట్టుకొనిపోగా, దానికి కొద్దిగా ఎగువన ప్రస్తుతమున్న ప్రకాశం బ్యారేజీని ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం నిర్మించింది. గాంధీ స్మారక సంస్థ దేశంలో నెలకొల్పదలచిన 6 శాశ్వత స్మారక కేంద్రాల్లో విజయవాడను ఒకటిగా ఎంపిక చేసింది. అప్పట్లో ఓర్ కొండగా పిలిచే ఈ కొండను స్మారక కేంద్ర స్థలంగా ఎంపిక చేసారు. అప్పటి నుండి దీనికి గాంధీ హిల్ అనే పేరు వచ్చింది.
కొండపై ఉన్న ప్రత్యేకతలు
మహాత్మా గాంధీ శత జయంతి సందర్భంగా దేశ వ్యాప్తంగా ఆరు గాంధీ స్థుపాలను ఏర్పాటు చేశారు. అందులో మొదటిది విజయవాడ వన్ టౌన్ ప్రాంతంలోని తారపేటలో ఉన్న గాంధీ స్థూపం. 1967లో అప్పటి ఉప ప్రధాన మంత్రి మొరార్జీ దేశాయ్, గాంధీ హిల్ సొసైటీని ప్రారంభించాడు. పదేళ్ళ తరువాత ఈ సొసైటీని, గాంధీ హిల్ ఫౌండేషన్ పేరుతో ట్రస్టుగా మార్చారు. 52 అడుగుల గాంధీ స్మారక స్థూపాన్ని 1968 అక్టోబరు 6న అప్పటి రాష్ట్రపతి జాకీర్ హుసేన్ ఆవిష్కరించారు. ఈ స్థూపం పీఠంపై గాంధీ సూక్తులను చెక్కారు.
మహాత్మా గాంధీజీ 1919-1946 మధ్య విజయవాడకు 6 సార్లు వచ్చారనీ కొందరు చెబుతుంటారు. 1969 లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక రైలును బహూకరించింది. భారతీయ రైల్వే కొండపైకి ఒక రైలు మార్గాన్ని నిర్మించింది. ఈ రైలు ఇక్కడి ప్రధాన ఆకర్షణల్లో ఒకటి. 1968లో అప్పటి రాష్ట్రపతి వివి గిరి ఒక దృశ్య శ్రవణ ప్రదర్శనకు శంకుస్థాపన చేసాడు. 1969 లో సరిహద్దు గాంధీగా పేరొందిన ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ దీన్ని ప్రారంభించాడు. కొండపై ఒక నక్షత్ర వేధ శాలను ఏర్పాటు చేసారు. 1971 లో దీన్ని ప్రారంభించారు. న్యూయార్కుకు చెందిన ఫోర్డు ఫౌండేషను దీనికి టెలిస్కోపును సమకూర్చింది. కొండపై ఒక గ్రంథాలయం కూడా ఉంది.
మహాత్మా గాంధీ స్మారక చిహ్నం
గాంధీ హిల్ మెమోరియల్‌లో గాంధీ ఉల్లేఖనాల శాసనాలను కలిగి ఉన్న ఒక రాతి స్లాబ్ ఉంది. 1968 అక్టోబరు 6న, 52 అడుగుల (16 మీటర్లు) పొడవు గల ఒక స్తూపం భారత మాజీ రాష్ట్రపతి డా. జాకీర్ హుస్సేన్ చేత ఆవిష్కరించబడింది. అదేవిధంగా ఏడు పొడవైన స్తంభాలు కూడా ఉన్నాయి, ప్రతి స్తంభం 150 మీ పొడవైనది.
ఇది చదవండి: ఏ కూరలో వేసినా లొట్టలేసుకుంటూ తినాల్సిందే..! రేటు మాత్రం టాప్ లేపుతోంది..!
గాంధీ కొండ అభివృద్దిని విస్మరించిన ప్రభుత్వాలు
తరువాతి కాలంలో ఈ మహాత్మా గాంధీ స్మారకం వివిధ రాజకీయాల కారణంగా విస్మరణకు గురైంది. రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి గాంధీ స్మారక సంస్థల మధ్య నిధుల విషయంలో ఉన్న విభేదాల కారణంగా నిర్వహణ, అభివృద్ధి కార్యక్రమాల విషయంలో గాంధీ కొండ అశ్రద్ధకు లోనైంది.
వెలవెల బోతున్న గాంధీ కొండ
జాతి పిత నడయాడిన ప్రదేశం ఇప్పుడు పాలకులు, అధికారులు అలసత్వం కారణంగా వెలవెలబోతోంది. జాతిపిత గాంధీ మనతో లేకపోయినా ఆయన గుర్తులు, స్మృతులు మనతోనే ఉన్నాయి. విజయవాడలోని గాంధీ హిల్ ప్రస్తుతం పాలకుల అలసత్వం కారణంగా కనుమరుగయ్యే ప్రమాదం ఉందని ఇక్కడికి వస్తున్న పర్యాటకులు అంటున్నారు. విజయవాడలో అత్యంత ముఖ్యమైన టూరిస్ట్ స్పాట్స్ లో గాంధీ హిల్ కూడా ఒకటి. ప్రతిరోజూ సుదూర ప్రాంతాల నుంచి పర్యాటకులు వస్తుంటారు. వారి కోసం కొండపై కనీసం మంచినీటి సదుపాయం కూడా కల్పించడం లేదని, వేసవి సెలవలు కావడంతో అధిక సంఖ్యలో టూరిస్టులు వస్తున్నప్పటికీ అధికారులు ఏర్పాట్లు చేయడంలో పూర్తిగా విఫలం అయ్యారని పర్యాటకులు అవేదన వ్యక్త పరిచారు.
గాంధీ హిల్ పై గతంలో గ్రీనరీ ప్రత్యేక ఆకర్షణగా ఉండేదని ప్రస్తుతం వాటి స్థానంలో పిచ్చి కంప మాత్రమే దర్శనం ఇస్తుందని అంటున్నారు టూరిస్టులు. అదేవిధంగా పురాతనమైన లైబ్రరీ ఒకటి ఉండేదని, ప్రస్తుతం అది కనుమరుగైపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. వినోదంతో పాటు విజ్ఞానం కూడా పెంపొందించుకునేలా లైబ్రరీ ఎంతగానో తోడ్పడేదని... అయితే ప్రస్తుతం ఈ లైబ్రరీ లేకపోవడం తమను తీవ్ర ఆవేదనకు గురి చేసిందని అంటున్నారు టూరిస్టులు.
గాంధీ స్మారక స్థూపం వద్దా గతంలో సెక్యూరిటీ ఉండేది. ప్రస్తుతం సెక్యూరిటీ లేకపోవడంతో ఎవరి ఇష్టానుసారం వారు వ్యవహరిస్తున్నట్లు పర్యాటకులు వాపోతున్నారు. కొన్నేళ్ల క్రితం గాంధీ హిల్ పై రైలు మార్గం ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఆ రైలు పరిస్థితి కూడా అంతంత మాత్రంగానే ఉంది. రైలు మార్గంలో ట్రాక్ పరిస్థితి మరీ అధ్వాన్నంగా మారింది. గట్టిగా పది మంది కూర్చుంటే ట్రైన్ కదిలే పరిస్థితి లేదు. రైలు మార్గానికి చుట్టుపక్కల గ్రీనరీ బదులుగా పిచ్చి మొక్కలు ఏపుగా పెరిగిపోయాయని నగరవాసులు తెలిపారు. గాంధీ హిల్ పై ఉన్న రైలు ఆధునీకికరణకు నోచుకోకపోవడం, ప్రస్తుతం ఉన్న ఆరైలు కూడా పాత ఆటో ఇంజన్ సహాయంతో నడుస్తున్నట్లు సమాచారం.
గతంలో గాంధీ హిల్ సొసైటీ.. ఈ ప్రాంతాన్ని మెయింటెన్ చేసినట్లుగా చెబుతారు. అయితే ప్రస్తుతం ఆ హిల్‌ను సొసైటీ మెయింటెన్ చేయలేక నగర పాలక కార్పొరేషన్‌కు అప్పచెప్పినట్లుగా తెలుస్తోంది. కార్పొరేషన్ చేతికి వెళ్లినా.. ఆశాజనక ఫలితం లేదని పలువురు టూరిస్టులు తెలిపారు. ఎంత మంది మున్సిపల్ అధికారులు, పాలకులు మారినప్పటికీ గాంధీ హిల్ పై ఎవరు దృష్టి సారించడం లేదని టూరిస్టులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ కొండను అభివృద్ధి చేసి.. కనీస సౌకర్యాలు ఏర్పాటు చేస్తే పర్యాటకుల సంఖ్య పెరుగుతుందని..నగర వాసులు కోరుతున్నారు.
అడ్రస్ : జవహర్ లాల్ నెహ్రూ రోడ్, కే. అర్. మార్కెట్, తారపేట్, విజయవాడ, ఆంధ్ర ప్రదేశ్ - 520001.
Timings : సాయంత్రం 4.30 నుంచి రాత్రి 8.30 వరకు ... మంగళవారం మాత్రం సెలవు.
ఎలా వెళ్లాలి..?
విజయవాడ రైల్వే స్టేషన్ కు దగ్గరలో ఉన్న ఈ గాంధీ హిల్ కు ఆటోలో వెళ్లొచ్చు. లోకల్ సిటీ బస్సులు కూడా అందుబాటులో ఉంటాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.