ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)లోనే ప్రత్యేకంగా నిర్వహించబడే తిరునాళ్లలో ఒకటి ఉయ్యూరు (Uyyur)వీరమ్మతల్లి ఉత్సవాలు(Veerammathalli festivals). ప్రతి ఏటా మాఘ శుద్ధ ఏకాదశి నాడు ప్రారంభమై 15రోజుల పాటు కొనసాగుతాయి. ఇందులో భాగంగానే ఈ సంవత్సరం కూడా ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. తొలి రోజు అమ్మవారిని ఉత్సవాల్లో లక్షలాది సంఖ్యలో పాల్గొన్నారు. జిల్లాతో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి కూడ పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. మొదటి రోజు అమ్మవారు బయలుదేరే సమయంలో వేలాది మంది మహిళలు ఎదురు గండ దీపాలతో మొక్కుబడులు తీర్చడం కన్నులపండువగా కనిపించింది. చీకట్లో వేలాది దీపాలు విరజిమ్మే వెలుగులు అమ్మవారు చూడముచ్చటగా కనిపించింది.
వీరమ్మ తల్లి ఆశీస్సుల కోసం..
కృష్ణా జిల్లా ఉయ్యూరులో జరుగుతున్న వీరమ్మ తిరునాళ్లకు గతంలో కంటే ఈసారి భక్తులు మరింత పెద్ద సంఖ్యలో వచ్చారు. తొలిరోజు అమ్మవారి రాకను స్వాగతిస్తూ మహిళలు ఎదురు గండ దీపాలతో మొక్కుబడులు తీర్చుకున్నారు. అటుపై ఉయ్యూరు రావిచెట్టు సమీపంలోని మెట్టి నింటి నుంచి వీరమ్మ ఊరేగింపుగా బయలుదేరింది. మరుసటి రోజు సాయంత్రం విజయవాడ-మచిలీపట్నం ప్రధాన రహదారి ప్రక్కన గల దేవాలయంలో ప్రవేశిస్తుంది. తిరుణాల చివరి రోజున తిరిగి అమ్మవారు దేవాలయం నుండి బయటకు వచ్చి తోట్లవల్లూరు మండలం ఐలూరులోని కృష్ణానదిలో స్నానమాచరించి తిరిగి మెట్టినింట ప్రవేశిస్తుంది.
తిరునాళ్లకు పోటెత్తిన భక్తులు..
ఏటా జరిగే ఈ ఉత్సవాలకు ఉయ్యూరు పట్టణంతో పాటు పొరుగు గ్రామాలకు చెందిన వాళ్లంతా వచ్చి అమ్మవారికి మొక్కులు తీర్చుకుంటారు. వీరమ్మతల్లి పుట్టి నుంచి బయల్దేరే ముందు పసుపు, కుంకుమలతో నూతన వస్త్రాలను పోలీస్ శాఖ సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. అందులో భాగంగానే గురువారం ఈ సంప్రదాయాన్ని పూర్తి చేశారు. ఉయ్యూరు పట్టణ పోలీసు స్టేషన్లో పూజాది కార్యక్రమాలు నిర్వహించి, బ్యాండు మేళాలతో పసుపు, కుంకుమతో ఊరేగింపు కార్యక్రమం చేపట్టారు.
ఊరంతా పండుగే..
వీరమ్మతల్లి బయలుదేరి రెండోరోజు సాయంత్రం వరకు ఉయ్యూరు పట్టణం మొత్తం ఊరేగుతుంది. మొక్కుబడి మహిళలు అమ్మవారి వెంటే తిరుగుతుంటారు. మహిళలు ఉపవాస దీక్ష వహిస్తారు. అలాగే ఆలయ ప్రవేశానికి ముందు ఉయ్యూరు ప్రధాన సెంటర్లో జరిగే ఊయల ఉత్సవంలో పాల్గొంటుంది. దీనిని తిలకించేందుకు లక్ష మందికి తక్కువ కాకుండా భక్తులు హాజరవుతారు. అధిక సంఖ్యలో వస్తారు. అమ్మవారి డోలాయన కార్యక్రమం పూర్తికాగానే బలి (జంతు) విధానం ముగుస్తుంది. జంతుబలి జరగందే అమ్మవారు ఆ ప్రదేశం నుండి కదలదనే నమ్మకం ప్రజల్లో నెలకొంది.
ఊయల ఉత్సవం..
ఈ కార్యక్రమం సమయంలో పెద్ద ఎత్తున తొక్కిసలాట జరుగుతుంది. పెద్ద సంఖ్యలో పోలీసులు మోహరిస్తారు. అనంతరం అమ్మవారు రోడ్డు వారగా ఉన్న ఆలయంలోకి ప్రవేశిస్తుంది. అమ్మవారి ఊరేగింపు ఊయల కార్యక్రమాలు సాగినంత సేపు భక్తులు అరటికాయలను అమ్మవారి పల్లకి పైకి విసురుతుండడం అనవాయితీ. ఉత్సవాల సమయాల్లో మొక్కుబడి ఉంటే భక్తులు తమ పశు సంపదను, ఎడ్లబండ్లు, ఇతర వాహనాలను గుడిచుట్టు ప్రదక్షిణలు చేయిస్తారు.
రెండో రోజు అద్భుత ఘట్టం..
వీరమ్మ తల్లి తిరుణాల ప్రారంభమైన పదకొండో రోజున శిడిబండి ఉత్సవం అత్యంత ఘనంగా జరుగుతుంది. బ్యాండు మేళాలు, మేళ తాళాలు కోలాట బృందాలతో కోలాహలం చోటు చేసుకుంటుంది. పెళ్ళికి సిద్ధంగా ఉన్న ఓ దళిత యువకుడిని దేవాలయ సమీపంలో శిడిబండి బుట్టలో కూర్చో పెట్టి ప్రాంగణంలో ఊరేగించటం, అతన్ని అరటికాయలతో భక్తులు కొట్టటం ఆనవాయితీగా వస్తోంది. పది హేనో రోజు రాత్రి 12 గంటల అనంతరం వీరమ్మతల్లిని మెట్టినింటికి చేర్చి శివరాత్రికి ఐలూరులో పుణ్య స్నానం చేయించి ఉయ్యూరులోని నిజనివాసానికి చేరుస్తారు.
అమ్మవారి చరిత్ర..
అమ్మవారికి తిరునాళ్లు ఇంత ఘనంగా ఏటా నిర్వహించడానికి వెనుక పెద్ద చరిత్ర ఉందంటారు భక్తులు. చిన్న వయస్సులో పెళ్లి చేసుకున్న వీరమ్మ కాపురానికి వచ్చిన సమయంలో గ్రామ కరణం సుబ్బయ్య మనసుపడటం ఆమెను లోబర్చుకోవాలని ఆమె భర్తను విషప్రయోగం ద్వారా హతమార్చినట్లుగా స్థానికులు చెబుతుంటారు. అటుపే వీరమ్మ భర్తను చంపిన సుబ్బయ్యను శపించి సహగమనం చేస్తుంది. ఆ తర్వాత సుబ్బయ్య తీవ్ర అనారోగ్యంతో మరణించినట్లుగా ఇక్కడి భక్తులు చెబుతుంటారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.