ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రభుత్వం ఇటీవల కొత్త జిల్లాలను (AP New Districts) ప్రకటించిన సంగతి తెలిసిందే. జిల్లాల సరిహద్దులు, కేంద్రాలు, పేర్లు, ఇతర అంశాలపై రాష్ట్రవ్యాప్తంగా పలు సంఘాలు, రాజకీయ పార్టీలు, స్థానికుల నుంచి అభ్యంతరాలు వ్యక్తవమతున్నాయి. దీనిపై ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉన్నతస్థాయి కమిటీ జిల్లాల వారీగా సంప్రదింపులు, చర్చలు జరుపుతూ అభ్యంతరాలపై చర్చిస్తోంది. ఇదిలా ఉంటే కృష్ణా జిల్లా (Krishna District) విభజన, విజయవాడకు ఎన్టీఆర్ పెట్టిన విషయంలో తీవ్ర చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. విజయవాడకు దివంగత ఎమ్మెల్యే వంగవీటి రంగా పేరు పెట్టాలని, కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టాలంటూ జిల్లాకు చెందిన వివిద పార్టీల నేతలు డిమాండ్ చేస్తున్నారు. విజయవాడకు వంగవీటి రంగా పేరు పెట్టాలన్న డిమాండ్ తో కొన్నిరోజులుగా దీక్షలు, ఆందోళనలు కొనసాగుతున్నాయి.
ఐతే వంగవీటి జిల్లా కోసం వంగవీటి రంగా తనయుడు వంగవీటి రాధా మాత్రం ఇంతవరకు ఎలాంటి డిమాండ్లు చేయలేదు. తాజాగా ఆయన కూడా జిల్లా వివాదంపై స్పందించారు. విజయవాడలో ఏర్పాటు చేసిన వంగవీటి రంగా విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న రాధా.. జిల్లా వియంపై కీలక వ్యాక్యలు చేశారు. వంగవీటి రంగా జిల్లా కోసం తాను ఎవర్నీ అడగనని.. అభిమానులే సాధించుకోవాలన్నారు. రంగా అభిమానులమని చెప్పుకునే నాయకులు జిల్లా పేరును తెచ్చేలా చొరవ చూపాలని సూచించారు. తనకు రంగా అభిమానుల ఆశీర్వాదం ఉంటే చాలని.. ఎలాంటి పదవులు, అధికారం అక్కర్లేదని వంగవీటి రాధా అన్నారు.
కొంతకాలంగా విజయవాడ కేంద్రంగా వంగవీటి రంగా జిల్లా కోసం ఉద్యమం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. కాపు నేతలు, రంగా-రాధా మిత్ర మండలికి చెందిన వారు రంగా పేరుతో జిల్లాను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇందుకు టీడీపీ కూడా మద్దతు పలికింది. ఆ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే బొండా ఉమా కూడా దీక్ష చేశారు.
రాజకీయ చర్చ
ఎన్టీఆర్ స్వగ్రామం మచిలీపట్నం పరిధిలో ఉన్నా.. విజయవాడకు ఆయన పేరు పెట్టడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. దీనిపై టీడీపీ మాత్రం సైలెంట్ గానే ఉంది. విజయవాడకు ఎన్టీఆర్ పేరు పెట్టడం వెనుక వైసీపీ వ్యూహాత్మక రాజకీయం చేస్తోందన్న చర్చ జరుగుతోంది. ఎన్టీఆర్ మచిలీపట్నంకు చెందిన విజయవాడ పార్లమెంట్ పరిధిలో కమ్మ ఓటర్లు ఎక్కువ మంది ఉన్నారని.. అందుకే జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారని చెబుతున్నారు. విజయవాడ పరిధిలో కమ్మ సామాజిక వర్గం ఓట్లు ఎక్కువగా ఉండటంతో ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లు ఉంటుందని ఈ నిర్ణయం తీసుకున్నారన్న ప్రచారం జరుగుతోంది.
ప్రస్తుతం జిల్లా పేర్లు, పరిధులకు సంబంధించిన అభ్యంతరాల స్వీకరణ కొనసాగుతోంది. మార్చి 3 వరకు అభ్యంతరరాలను స్వీకరిస్తుంది. ఇప్పటికే రాష్ట్రప్రభుత్వం వినతులను పరిశీలిస్తున్న నేపథ్యంలో వంగవీటి జిల్లాపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.