Home /News /andhra-pradesh /

VIJAYAWADA TWO GIRLS FROM KANKIPAADU ZPH SCHOOL ARE MISSING REGARDING INTERSET ON ACTING VPR NJ ABH

Vijayawada: " సినిమాల్లో ఛాన్స్‌".. ఇంటి నుంచి పారిపోయిన విద్యార్థులు..! నాలుగు బృందాలుగా పోలీసుల గాలింపు..!

నటనపై ఆసక్తితో ఇంటి నుంచి పారిపోయిన విద్యార్థులు..!

నటనపై ఆసక్తితో ఇంటి నుంచి పారిపోయిన విద్యార్థులు..!

ప్రస్తుత కాలంలో చిన్నారులపై సోషల్‌ మీడియా ప్రభావం ఎక్కువగా ఉంది. టిక్ టాక్‌, షేర్‌చాట్, మోజ్ లాంటివాటిల్లో వీడియోల ప్రభావం మరికాస్త ఎక్కువ. అలా ఆ యాప్స్‌ చూస్తూ, సినిమాలు చూస్తూ… నటనపై ఆసక్తి పెంచుకున్న ఇద్దరు విద్యార్థులు అదృశ్యమయ్యారు.

ఇంకా చదవండి ...
    (Prayaga Raghavendra Kiran, News 18, Vijayawada)

    ప్రస్తుత కాలంలో చిన్నారులపై సోషల్‌ మీడియా ప్రభావం ఎక్కువగా ఉంది. టిక్ టాక్‌, షేర్‌చాట్, మోజ్ లాంటివాటిల్లో వీడియోల ప్రభావం మరికాస్త ఎక్కువ. వీటిల్లో కొన్ని వేల వ్యూస్‌ వస్తే చాలు తాము సెలబ్రెటీలం అయిపోతాం అని ఫీల్ అవుతుంటారు. అలా కొందరు రోజువారీ జీవితాన్ని వదిలేసి… వీటిపైనే ఆసక్తి చూపుతుంటారు. అలా ఆ యాప్స్‌ చూస్తూ, సినిమాలు చూస్తూ…  నటనపై ఆసక్తి పెంచుకున్న కృష్ణ జిల్లా కంకిపాడు జడ్పీ ఉన్నత పాఠశాలకు చెందిన ఇద్దరు విద్యార్థులు అదృశ్యమ్యారు.

    సినిమా పరిశ్రమలో నటించాలని కోరికతో ఇద్దరు బాలికలు ఇళ్ల నుంచి వెళ్లిపోయారని భావిస్తున్నారు. మూడు రోజుల క్రితం కంకిపాడు జడ్పి ఉన్నత పాఠశాల నుంచి తొమ్మిదో తరగతి విద్యార్థులు కనిపించకుండా పోయిన సంగతి తెలిసిందే. దీనిపై పోలీసులు నాలుగు ప్రత్యేక బృందాలతో చెన్నై, హైదరాబాద్ తదితర ప్రాంతాల్లో గాలిస్తున్నారు. ఈ ఇద్దరు పిల్లలకు నటనంటే పిచ్చి. ఒక అమ్మాయి అయితే తన తల్లితో కలిసి హైదరాబాద్‌లో కొన్ని ఆడిషన్స్ కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది. మరో బాలిక టిక్ టాక్ , మోజ్ , షేర్ చాట్, రీల్స్‌ చేయడం అలవాటుగా మారిపోయింది. నిద్ర లేచింది మొదలు.. స్కూల్‌ నుంచి వచ్చాక.. ఎప్పుడు చూడు ఆ ఫోన్‌ పట్టుకుని కూర్చునేది.

    అయితే ఇద్దరు విద్యార్థులు మరొకరి తోడు లేకుండా వెళ్లి ఉండరని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ స్కూల్‌ సమీపంలో ఉండే జోజి అనే వ్యక్తి వీరిని నమ్మించి మాయమాటలు చెప్పి తీసుకెళ్లి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. ఆడిషన్స్‌కు వెళ్తున్నామని.. తమకు టీవీలో కూడా ఆఫర్లు వస్తున్నాయంటూ ఇద్దరు విద్యార్థులు తమ స్నేహితులతో చెబుతూ ఉండేవారట. నిందితుడు జోజి భార్య ప్రసవం కోసం పుట్టింటికి వెళ్లడంతో… ఇదే అదునుగా టీవీలో నటించేందుకు అవకాశాలు ఇప్పిస్తానని బాలికలను తీసుకువెళ్లాడని భావిస్తున్నారు.

    ఇంట్లోంచి వెళ్లేటప్పుడు బాలికలు మరో జత బట్టలు కూడా తీసుకువెళ్లలేదని..స్కూల్‌ యూనిఫాంతోనే వెళ్లినట్లు తల్లిదండ్రులు చెబుతున్నారు. అయితే ఆ రోజు విద్యార్థులను తమ ఆధార్ కార్డులను వెంట తీసుకువెళ్లారని.. డబ్బుల కోసం వాళ్ల దగ్గర ఉన్న పుస్తకాలను స్కూల్‌ సమీపంలోని ఓ పాత వస్తువులు కొనే వ్యక్తికి అమ్మినట్లు తెలుస్తోంది.

    నిందితుడిగా భావిస్తున్న వ్యక్తి ఇంటికి తాళం వేసి ఉండడంతో దానిని పగలకొట్టి తనిఖీ చేశారు. కంకిపాడు నుంచి బాలికలను తీసుకొని ఇతడు విజయవాడ రైల్వే స్టేషన్‌కు బైక్‌పై వెళ్లారు. అక్కడ పార్కింగ్‌లో బండిపెట్టి రైలు ఎక్కినట్లు సీసీ కెమెరాలో రికార్డయ్యింది.

    బైక్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే విజయవాడ నుంచి వెళ్లిన ఈ ముగ్గురు ఎక్కడకు వెళ్లారు అనేది తెలియడం లేదు. నిందితుడు రైల్వే స్టేషన్‌లో ఫోన్ స్విచ్చాఫ్‌ చేశాడు. ఎలాగైనా తమ పిల్లల ఆచూకీ కనిపెట్టమని తల్లిదండ్రులు కోరుతున్నారు. పోలీసులు ఈ కేసును నాలుగు బృందాలుగా విడిపోయి చెన్నై, హైదరాబాద్‌ తదితర ప్రాంతాల్లో గాలిస్తున్నారు.
    Published by:Abhiram Rathod
    First published:

    Tags: Andhrapradesh, Crime news, Kurnool, Local News

    తదుపరి వార్తలు