K Pawan Kumar, News18, Vijayawada
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో హనుమాన్ దేవాలయం (Hanuman Temple) లేని గ్రామం లేదు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. విజయవాడలోనూ ప్రముఖ హనుమంతుడి ఆలయం భక్తులచే పూజలందుకుంటోంది. మాచవరంలో దాసాంజనేయ స్వామిగా వెలసిన హనుమంతుడు భక్తులను కటాక్షిస్తు్న్నాడు. సుమారు నూట యాభై సంవత్సరాల క్రితం దున్న వీరాస్వామి నాయుడు అనే కాంట్రాక్టర్ ఏలూరు - విజయవాడ రహదారిని నిర్మిస్తున్నారు. ఆ సమయంలో ఆంజనేయుడు వీరాస్వామినాయుడికి కలలో కనిపించి తన విగ్రహం ఉన్న చోటు చెప్పాడు. మర్నాడు ఉదయం సదరు కాంట్రాక్టర్ కూలీలతో వెళ్లి ఆ ప్రదేశంలో తవ్వకాలు జరపగా.. సింధూర అలంకారంలో ఉన్న ఆంజనేయుడి విగ్రహం బయటపడింది.
అప్పటి నుంచి భక్తులకు దర్శనం కల్పించేందుకు అక్కడక్కడ ఓ పాకను నిర్మించారు. ఆలయ నిర్మాణానికి పూర్వం అక్కడున్న చెట్టే స్వామివారికి ఆశ్రయం కల్పించింది. ఇప్పటికీ ఆ వృక్షం సజీవంగానే ఉంది. మాచవరం ఆలయంలో దాస ఆంజనేయ విగ్రహం రెండు నుండి మూడు అడుగుల పొడవుతో శ్రీరాముని సన్నిధిలో మోకాళ్లపై కూర్చొని దాసుగా కనిపిస్తాడు. అతని రెండు చేతులు అరచేతులతో ముడుచుకుని 'అంజలి'లో అతని భగవంతునికి 'ప్రాణాలు' అర్పిస్తున్నట్లు కనిపిస్తాయి. స్వామివారి ప్రకాశవంతమైన కుండలం పరిమాణంలో పెద్దదిగా మిరుమిట్లు గొలిపేదిగా కనిపిస్తుంది.
ప్రతి రోజూ ఈ ఆలయం భక్తులతో కిక్కిరిసిపోతుంటుంది. మంగళవారమైతే దర్శనానికి రెండు మూడు గంటలు పడుతుంది. తమలపాకులతో దాసాంనేయస్వామిని దర్శిస్తే భయాలు, దష్టశక్తి ప్రభావాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. ఈ దేవాలయం వాహన పూజలకు ప్రత్యేకమనే పేరుంది. అందుకే సైకిల్ నుంచి బైకులు, కార్లు, లారీలు, బస్సుల వంటి వాహనాలకు ఈ ఆలయం వద్దకు తీసుకొచ్చి పూజలు చేయిస్తుంటారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Local News, Vijayawada