K Pawan Kumar, News18, Vijayawada
మన ఆచార వ్యవహరాల్లో పూలకు ఎంత ప్రత్యేకత ఉందో చెప్పనవసరం లేదు. ఈ పూలల్లో దేని ప్రత్యేకత దానిదే. పూలలో రారాజు అయిన గులాబీ తర్వాత స్థానం చామంతిదే అని చెప్పాలి. ఈ చామంతి పూలుకి ఏడాది పొడవునా క్రేజ్ ఉంటుంది. అంతే డిమాండ్ ఉంటుంది. అందుకే ఈ చామంతి పంటపైనే రైతులు శ్రద్ద చూపిస్తున్నారు. ఈ పంటకు పెట్టుబడి తక్కువ ఆదాయం ఎక్కువ. అలాగే పరిసరాల అందాన్ని పెంచడంలో కూడా ఈ చామంతి ఎంతో ఉపయోగపడుతుంది. అందుకే ఏ సీజన్ లో అయినా చామంతి పూలకు మంచి డిమాండ్ ఉంటుంది. ప్రస్తుతం ఈ పంటను సాగు చేస్తున్నారు విజయవాడ (Vijayawada) లోని కొంతమంది రైతులు.
అన్ని రకాల నేలల్లోనూ చామంతిని సాగు చేయవచ్చు. మురుగు నీటి వసతి గల ఒండ్రు నేలల్లో భారీ దిగుబడులు సాధించవచ్చు అంటున్నారు. అలాగే మంచి నేలను ఎంచుకుని పొలాన్ని మూడు, నాలుగు సార్లు దున్నాలి అలాగే ముందుగానే ఎరువును, కాస్త నత్రజని, ఫాస్ఫర్ ని కలిపి దున్నుకోవాలి. తర్వాత మొక్కలు నాటలి. కాస్తంత దూరంలో అంటే ఒక 20 సెంటీమీటర్ల దూరంలో మొక్కను నాటాలి. మొక్కలు పడి పోకుండా వెదురు కర్రను ఊతంగా అమర్చాలి. మొక్క దగ్గర మట్టిని రెండు మూడు సార్లు కదిలిస్తూ ఉండాలి. అలా కదిలించడం వల్ల వేరు వ్యవస్థ దృఢంగా మారుతుంది.
మొక్క ఎదిగే కొద్దీ నీరు అందిస్తూ ఉండాలి. అలాగే నీరు నిల్వ ఉంచకుండా ఉండేలా చూసుకోవాలి. అలాగే మొక్కలకి ఎలాంటి హాని జరగకుండా మందులు పిచికారీ చేస్తుండాలి. బాగా ఎదిగాక తలలు తుంచితే నేలపైనే విస్తరిస్తుంది. సరైన సస్యరక్షణ చర్యలు పాటిస్తే దిగుబడులు చక్కగా ఉంటాయంటున్నారు రైతు పద్మారావు. తనకున్న 70సెంట్ల పొలంలో 5రకాల చామంతులు, రోజాలు పండిస్తూ లాభాలు గడిస్తున్నారు పద్మారావు. ఇతర పంటలతో పోలిస్తే పూలసాగులో శ్రమ తక్కువ అని.. లాభాలు ఎక్కువని చెబుతున్నారు. అంతేకాదు అందమైన పూలను చూస్తూ పనిచేస్తుంటే మనసకు ఆహ్లాదంగా ఉంటుందంటున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Agriculture, Andhra Pradesh, Local News, Vijayawada