ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు (Andhra Pradesh Politics) వేడెక్కుతున్నాయి. పరిషత్ ఎన్నికల ఫలితాల తర్వాత అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల తూటాలు ఓ రేంజ్ లో పేలుతున్నాయి. ప్రతిపపక్ష నేత చంద్రబాబు నాయుడు (Nara Chandra Babu Naidu)పై మంత్రి కొడాలి నాని (Minister Kodali Nani) చేసిన కామెంట్స్ మరింత అగ్గిని రాజేశాయి. కుప్పంలో చంద్రబాబు నాయుడు రాజీనామా చేసి గెలిస్తే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని.. చంద్రబాబు కాళ్లదగ్గరుండి పనిచేస్తానంట కొడాలి నాని చేసిన ఛాలెంజ్ కాక రేపుతోంది. దీనిపై టీడీపీ నేతలు ఘాటుగానే స్పందించారు. నాని గుడివాడలో ఓడించి తీరుతామని మాజ ఎమ్మెల్యే యరపతినేని సవాల్ చేస్తే.. మరో మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధా (Vangaveeti Radha Krishna) పేరుతో జరుగుతున్న ప్రచారం ఇప్పుడు కృష్ణాజిల్లా రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. గుడివాడ (Gudivada)లో కొడాలి నానిపై తానే బరిలోకి దిగాలని రాధా నిర్ణయించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.
2024 అసెంబ్లీ ఎన్నికల్లో గుడివాడ నుంచి పోటీ చేసేందుకు వంగవీటి రాధా సిద్ధమైనట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే గుడివాడలోని కాపు సామాజికవర్గం నేతలతో వరుస భేటీలు నిర్విహించినట్లు తెలుస్తోంది. గుడివాడలోని కొందరు ప్రముఖులతో వంగవీటి కుటుంభానికి సన్నిహిత సంబంధాలుండటంతో తానే బరిలో దిగాలని సన్నిహితులతో అన్నట్లు కృష్ణాజిల్లా రాజకీయాల్లో చర్చ జరుగుతోంది. గుడివాడ గడ్డపై నానిన ఓడించి తీరుతానని... టీడీపీ తరపునే పోటీ చేస్తానని రాధా తన సన్నిహితులతో అన్నట్లు సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే రాజకీయాల్లో తినాల్సిన ఎదురుదెబ్బలన్నీ తిన్నానని.. ఇకపై పరిణితితో కూడిన రాజకీయాలు చేస్తానని అన్నట్లు తెలిసింది. తన తండ్రి వంగవీటి రంగా ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే తన లక్ష్యమని.. బడుగు, బలహీనవర్గాలకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని ఆయన చెప్పినట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
కొంతకాలంగా రాజకీయాల్లో అంతగా కనిపించని వంగవీటి రాధా సడన్ గా కొడాలి నానిపై పోటీకి సై అన్నారంటూ జరుగుతున్న ప్రచారం చర్చనీయాంశమవుతోంది. 2019 అసెంబ్లీ ఎన్నికల ముందు వైసీపీని వీడి టీడీపీలో చేరిన వంగవీటి రాధా.. పోటీకి మాత్రం దూరంగా ఉన్నారు. అప్పట్లో విజయవాడ సెంట్రల్ టికెట్ ఆశించిన రాధా.. ఈస్ట్ కి వెళ్లమని జగన్ సూచించడంతోనే వైసీపీని వీడారు. ఆ తర్వాత కొన్నాళ్లు జనసేన పార్టీ వైపు చూస్తున్నట్లు ప్రచారం జరిగింది. ఒకటి రెండుసార్లు పవన్ కల్యాణ్ తో కూడా భేటీ అయ్యారు. మున్సిపల్ ఎన్నికల్లో విజయవాడ జనసేన అభ్యర్థుల తరపున ప్రచారంలో కూడా పాల్గొన్నారు.
ప్రభుత్వం మూడు రాజధానులను ప్రకటించిన తర్వాత అమరావతి రాజధానికి మద్దతుగా ఉద్యమంలో కూడా పాల్గొన్నారు. ప్రస్తుతం తాను టీడీపీలోనే ఉన్నానని చెబుతున్న రాధా.. పార్టీ సమావేశాలు, కార్యక్రమాల్లో కనిపించడం లేదు. ఇప్పుడు ఉన్నట్లుండి కొడాలి నానిపై ఘాటు వ్యాఖ్యలు చేడయం.. పోటీకి సై అన్నట్లు వార్తలు రావడంపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. రాధా నిజంగా గుడివాడ బరిలో నిలుస్తారా..? కొడాలి నాని ఢీ కొడతారా..? లేక ఇది కేవలం ప్రచారమేనా..? అనేది తెలియాల్సి ఉంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.