K Pawan Kumar, News18, Vijayawada
ఒకే పార్టీలోని ఎమ్మెల్యేలంటే ఎంత సఖ్యతగా ఉండాలి..! అదే ఒకే జిల్లాకు చెందిన వారైతే మనం మనం బరంపురం అనే రేంజ్ లో కలిసిపోవాలి. కానీ ఎన్టీఆర్ జిల్లా వైసీపీ ఎమ్మెల్యేలు మాత్రం నువ్వెంత అంటే నువ్వెంత అనేలా పోట్లాడుకున్నారు. ఓపెన్ గానే తిట్టుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. విజయవాడ నగర వైసీపీ అధ్యక్షుడు బొప్పాన భవన్ కుమార్ జన్మదినం సందర్భంగా పటమటలోని పార్టీ ఆఫీసుకి జగ్గయ్యపేట ఎమ్మెల్యే సామినేని ఉదయభాను వచ్చి శుభాకాంక్షలు తెలిపారు. అప్పటివరకు అంతా బాగానే ఉంది. ఆయన తిరిగి వెళ్లే సమయంలో మాజీ మంత్రి, విజయవాడ వెస్ట్ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్, విజయవాడ ఈస్ట్ ఇన్ ఛార్జ్ దేవివినేని అవినాష్ వచ్చారు.
ఈ క్రమంలో వెల్లంపల్లికి సామినేని ఉదయభాను ఎదురుపడ్డారు. వెంటనే ఆయనపై కోపంతో ఊగిపోయారు వెల్లంపల్లి. తన నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ నేత ఆకుల శ్రీనివాస్ ను సీఎం జగన్ వద్దకు తీసుకెళ్లడంపై వెల్లంపల్లి.. ఉదయభానుని నిలదీశారు. “అసలు నువ్వుఎవరు... నువ్వుఏమైనా పోటుగాడివా” అని ఇష్టానుసారంగా దూషించారు. వెంటనే రియాక్ట్ అయిన సామినేని ఉదయభాను.. “నోరుని అదుపులో పెట్టుకోని మాట్లాడటం నేర్చుకోఅని... నాకు చెప్పడానికి నువ్వు ఎవరంటూ” వెల్లంపల్లి నోరు మూయించారు. అది అంత చూస్తున్న ఇరు నేతలు అనుచరులు వారిని పక్కకు తీసుకెళ్లారు దానితో గొడవ కాస్త సద్దుమణిగింది.
విజయవాడ వెస్ట్ నియోజకవర్గానికి చెందిన ఆకుల శ్రీనివాసరావు.. 2014లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు. అదే సమయంలో వెల్లంపల్లి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత ఆకుల శ్రీనివాస్ వైసీపీకి మద్దతిస్తున్నారు. ఈ క్రమంలో వెల్లంపల్లికి, ఆకుల శ్రీనివాస్ కు పడటం లేదు. ఇదిలా ఉంటే వారం రోజుల క్రితం నియోజకవర్గ సమస్యలపై మాట్లాడేందుకు తాడేపల్లిలోని సీఎం కార్యాలయానికి వెళ్లారు. అదే సమయంలో ఆకుల శ్రీనివాస్ తన కుమార్తె వివాహానికి సీఎంను ఆహ్వానించేందుకు అక్కడే ఉన్నారు. వెంటనే ఉదయభాను.. ఆకుల శ్రీనివాస్ ను సీఎం జగన్ దగ్గరకు తీసుకెళ్లారు.
ఇదే విషయంపై వెల్లంపల్లి.. ఉదయభానుని నిలదీసేందుకు యత్నించడం.. ఆయన కూడా అదే రేంజ్ లో కౌంటర్ ఇవ్వడంతో కాస్త టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇదిలా ఉంటే ఈ వ్యవహారంలో వెల్లంపల్లి స్పందించిన తీరు విమర్శలకు తావిస్తోంది. సొంత పార్టీ ఎమ్మెల్యేనే.. పార్టీకి అనుకూలంగా ఉండే నేతను సీఎం దగ్గరకు తీసుకెళ్తే.. వెల్లంపల్లికి ఉలుకెందుకని పలువురు ప్రశ్నిస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Local News, Vijayawada, Ysrcp