K Pawan Kumar, News18, Vijayawada
ప్రజల అవసరాలను, అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని అక్రమాలకు తెరలేపాడు. ఈ క్రమంలో సబ్ కలెక్టర్ అవతారమెత్తాడు. పోలీసు ఉన్నతాధికారులతో తనకు మంచి పరిచయాలు ఉన్నాయని ప్రజలు నమ్మించాడు. ప్రభుత్వ ఉద్యోగాలు , కాంట్రాక్ట్‌లు ఇప్పిస్తానని చెప్పి లక్షల రూపాయలు వసూలు చేశాడు ఈ కేటుగాడు. కృష్ణా జిల్లా (Krishna District) గన్నవరం (Gannavaram) ప్రాంతానికి చెందిన ఓ మహిళకు ప్రభుత్వ కాంట్రాక్టు ఇప్పిస్తానని, విడతల వారీగా రూ.9 లక్షలు వరకు వసూలు చేశాడు. సబ్ కలెక్టర్ అవతారంలో అమాయక ప్రజల నుంచి లక్షలు దండుకున్న కేటుగాడిని ఓ బాధితురాలు పక్కా ప్లాన్‌తో పోలీసులకు పట్టించింది. అతని పేరు పిల్లా వెంకట రాజేంద్ర.
గతంలో సీఆర్డీఏలో కాంట్రాక్టు వర్కర్‌గా పనిచేస్తూ అవినీతికి పాల్పడి విధుల నుంచి బహిష్కరణకు గురయ్యాడు.క్యాసినోలు, విలాసాలకు అలవాటు పడిన అతను.. నకిలీ ఐడీ కార్డులు తయారు చేసుకొని తాను అధికారిని అని చెప్పి ప్రజలను మోసం చేస్తున్నాడు. ఇప్పటికే అతనిపై 10 నుంచి 14 కేసుల వరకు నమోదయ్యాయి. అనేక మంది వద్ద సుమారు రూ.70 లక్షల నుంచి రూ.80 లక్షల వరకు వసూలు చేసినట్టు సమాచారం.
కృష్ణా జిల్లా గన్నవరం ప్రాంతానికి చెందిన ఓ మహిళకు ప్రభుత్వ కాంట్రాక్టు ఉద్యోగం ఇప్పిస్తానని, విడతల వారీగా రూ.9 లక్షలు వరకు వసూలు చేశాడు. అతను మోసం చేస్తున్నాడని గ్రహించిన సదరు బాధితురాలు పక్కా ప్రణాళికతో అతన్ని గురువారం గన్నవరం పిలిపించింది. తన కుటుంబసభ్యులు, బంధువులతో కలసి అతన్ని పట్టుకుని డబ్బు విషయం ప్రశ్నించింది.
ఇది చదవండి: పాడుపనులు చేస్తున్నా పట్టించుకోరు.. ఎక్కడో తెలుసా..?
మీరు నాపై కేసు పెట్టినా, నన్నేమీ చేయలేరంటూ అతను ఎదురు తిరిగాడు. తనకు పోలీసు అధికారులు, డీఎస్పీలు, సీఐలు చాలామంది తెలుసని చెప్పాడు. రూ.2 లక్షలు ఖర్చుపెడితే బయటికి వచ్చేస్తానని వారిని బెదిరించే ప్రయత్నం చేశాడు. రాజేంద్ర ఫోన్లో ఎక్కువ శాతం పోలీస్ అధికారుల ఫోన్ నంబర్లు ఉండటం గమనార్హం.
తిరుపతి వెళ్లినప్పుడు తమకు పరిచయం అయ్యాడని, తాను సబ్ కలెక్టర్ ను అని చెప్పి తన దొంగ ఐడీ కార్డు చూపించి.. ఈజీగా దర్శనం చేయిస్తానని చెప్పి తమను నమ్మించాడని బాధితురాలు చెబుతోంది. ఆ తర్వాత రకరకాల పనులు చేయిస్తానని చెప్పి తమ వద్ద డబ్బు తీసుకుని మోసం చేశాడని వివరించింది. రాజేంద్రను గన్నవరం పోలీస్ స్టేషన్లో గురువారం అర్ధరాత్రి అప్పగించి బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఉన్నతాధికారులు వెంటనే స్పందించి నిందితుడిపై తగిన చర్యలు తీసుకోవాలని ఆమె కోరింది. నిందితుడు రాజేంద్ర ప్రస్తుతం విజయవాడ చిట్టినగర్‌లో ఉంటున్నాడని సమాచారం.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Local News, Vijayawada