Prayaga Raghavendra Kiran, News18, Vijayawada
మానవ సేవే మాధవ సేవ అంటూ ముందుకెళ్తున్నారు విజయవాడ (Vijayawada) కు చెందిన ఫొటోగ్రాఫర్ వెంకట్. వృత్తి రీత్యా వెంకట్ ఫోటోగ్రాఫర్ అయినా.. ప్రతి రోజు మధ్యాహ్నం అన్నార్థుల ఆకలి తీర్చుతున్నాడు. నిరాశ్రయులకు బట్టలు పంపిణి చేస్తూ ఆ నలుగురు కోసం తన జీవితాన్నే దారపోస్తున్నాడు. కరోనా (Corona) కాలం మొదలుకుని నేటి వరకు సభ్య సమాజం గర్వించేలా తన వంతు సహాయం అందిస్తున్న వెంకట్‌పై ప్రత్యేక కథనం..! పదేళ్ల క్రితం విజయనగరం (Vizianagaram) లోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఓ తల్లి ఆవేదనతో ప్రారంభమైన ఈ సేవాకార్యక్రమాలు నేటికి నిరంతరాయంగా కొనసాగుతున్నాయి. ప్రతి రోజు తన వంతు సహాయంగా పేద ప్రజలకు, నిరాశ్రయులకు భోజనం, బట్టలు అందిస్తూ అందరికీ స్ఫూర్తిగా నిలుస్తున్నాడు.
వెంకట్ భార్య హిమ బిందు కూడా సమాజసేవలో భర్త అడుగుజాడల్లో ముందుకెళ్తున్నారు. భర్తకు సహాయంగా అతని వెంటే వెళ్లి అన్నార్థులకు భోజనాన్ని వడ్డిస్తున్నారు. ఆప్యాయంగా పలకరిస్తూ తామున్నామే ధైర్యాన్ని ఇస్తున్నారు. సాధారణ ఫోటో గ్రాఫర్‌గా జీవనం సాగిస్తూ తన వంతుగా నిరాశ్రయులకు సహాయం చేస్తున్న వెంకట్... ఎవ్వరూ ఆకలితో ఉండకూడదు అన్నదే తన ఆశయం అంటున్నాడు. తాను చేసే పనిలో తన భార్య కూడా సేవ చేయడం చాలా సంతోషంగా అనిపిస్తోందని వెంకట్ ఆనందం వ్యక్తం చేశారు.
తొలత వెంకట్ ఒక్కడే సమాజ సేవ చేసేవాడు..ఆ తర్వాత అతనికి భార్య తోడయ్యింది. ఇప్పుడు వాళ్లిద్దరు కలిసి ఒక హెల్పింగ్ హాండ్స్ పేరిట సేవాసంస్థను స్థాపించారు. ఈ సంస్థ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ప్రతిరోజు అవసరం ఉన్న వారికి సహాయం అందిస్తున్నారు.
అంతేకాదు కరోనా కాలంలో ఎవ్వరూ చేయలేనటువంటి సాహసాలే చేశారు. హోమ్ క్వారంటైన్‌లో ఉన్న వాళ్లకు ఇళ్ల వద్దకే వెళ్లి భోజనాలు అందించారు. అంతేకాదు సొంత బంధువులు కూడా దగ్గరకు రావడానికి భయపడేవాళ్లు.. కానీ వెంకట్ ముందడుగు వేసి కరోనాతో చనిపోయిన వాళ్లకు అంతిమ సంస్కారాలు చేశాడు. కరోనా కాలంతో తన సంస్థ సభ్యులతో కలిసి సుమారు 300 మృతదేహాలకు పైగా కులమతాలకు అతీతంగా అంత్యక్రియలు నిర్వహించారు.
ఎక్కడైనా అనాథ పిల్లలు కనిపిస్తే వాళ్లను ఏదో ఒక ఎన్‌జీవోలో జాయిన్ చేసి వాళ్ల పూర్తి బాధ్యతను తామే చూసుకుంటామని వెంకట్ భార్య బిందు తెలిపారు. చదువుకోవాలని ఉండి ఆర్థికస్థోమత లేని వారికి సహాయం అందిస్తున్నారు. తల్లిదండ్రులు లేని పిల్లలకు ఆర్థిక భరోసా ఇస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలలో ఎవ్వరికీ ఎలాంటి అవసరం ఉన్నా తమను సంప్రదిస్తే తమ వంతు సహాయం అందిస్తామని వెంకట్ దంపతులు తెలిపారు. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్: 9949926465.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Local News, Vijayawada