ఏపీలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ దూకుడును తట్టుకోలేకపోతున్న టీడీపీ.. విజయవాడలో మాత్రం మెజార్టీ స్థానాలను తమ సొంతం చేసుకుంటామని ధీమాగా ఉంది. అయితే విజయవాడ టీడీపీలో ఎంపీ కేశినేని నాని, బుద్దా వెంకన్న సహా పలువురు నేతల మధ్య ఉన్న విభేదాలు ఆ పార్టీ నేతలను కలవరపెడుతున్నాయి. పలు చోట్ల టీడీపీ అభ్యర్థి ఎంపిక విషయంలోనూ ఎంపీ కేశినేని, బుద్దా వెంకన్న మధ్య పోటాపోటీ నెలకొంది. ఈ విషయంలో బుద్దా వెంకన్న వర్గంపై ఎంపీ కేశినేని నాని పైచేయి సాధించారనే టాక్ ఉంది. అయితే ఈ విభేదాలు విజయవాడలో టీడీపీ గెలుపు అవకాశాలపై ప్రభావం చూపిస్తాయనే అంశంపై ఎంపీ కేశినేని నాని స్పందించారు. ఒక కుటుంబం అన్న తర్వాత రకరకాల మనస్తత్వాలుంటాయని.. ఇవన్నీ సహజమని ఎంపీ కేశినేని నాని అన్నారు.
జగన్ మోహన్ రెడ్డి ఫ్యామిలీలో విభేదాలు ఉన్నాయని ఉదహరించారు. షర్మిలకు, జగన్‌కు, తల్లికి విభేదాలు లేవా అని వ్యాఖ్యానించారు. జగన్ ఒక పార్టీ పెడితే.. ఆయన చెల్లెలు షర్మిల మరో పార్టీ పెట్టుకున్నారని గుర్తు చేశారు. ఒక కుటుంబంలోనే విభేదాలు సహజమని.. రాజకీయాల్లో విభేదాలు ఉండకుండా ఎలా ఉంటాయని అన్నారు. విజయవాడ కార్పొరేషన్ ఎన్నికల్లో టీడీపీ జెండా ఎగరేస్తే జగన్ తన సీఎం పదవికి రాజీనామా చేస్తారా అని ఎంపీ కేశినేని డిమాండ్ చేశారు. విజయవాడలో కచ్చితంగా తాము కార్పొరేషన్‌ను కైవసం చేసుకుని తీరతామని ధీమా వ్యక్తం చేశారు. 64 డివిజన్లు ఉంటే అందులో 45 నుంచి 50 వరకు టీడీపీకే వస్తాయని అన్నారు.
కేశినేని నాని(ఫైల్ ఫొటో)
ఏపీ సీఎం వైఎస్ జగన్‌కు సొంత పార్టీ అభ్యర్థిపై నమ్మకం లేదని.. అందుకే టీడీపీ అభ్యర్థులను బెదిరిస్తున్నారని ఆరోపించారు. ఒక్క విజయవాడలోనే టీడీపీ అభ్యర్థులు ధైర్యంగా నిలబడగలిగారని అన్నారు. తమ విజయవాడలో అందరూ ఫైటర్సే అని తెలిపారు. భయపెట్టడం, డబ్బులు ఆశచూపి లోబర్చుకోవడం, రకరకాలుగా ఏదో విధంగా ప్రలోభాలు గురిచేయడం, పోలీసులను అడ్డంపెట్టుకుంటున్నారని వైసీపీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
Published by:Kishore Akkaladevi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.