దుర్గగుడి ఫ్లైఓవర్‌ని మీరే ప్రారంభించాలి.. నితిన్ గడ్కరీకి టీడీపీ ఎంపీ విజ్ఞప్తి

నితిన్ గడ్కరీని కలిసిన ఎంపీ కేశినేని నాని

మీరు చూపిన శ్రద్ధ వల్లే ఈ రోజు ఫ్లైఓవర్ పనులు పూర్తి దశకు వచ్చాయని, విజయవాడ అభివృద్ధికి మరింత సాయం చేయాలని నితిన్ గడ్కరీని ఆయన కోరారు.

  • Share this:
    విజయవాడ ఎంపీ కేశినేని నాని ఢిల్లీలో కేంద్ర రహదారులు, రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ కలిశారు. నితిన్ గడ్కరీ నివాసంలో ఆయన్ను మర్యాదపూర్వకంగా కలిసిన కేశినేని నాని.. విజయవాడలో కనకదుర్గా ఫ్లైఓవర్ ప్రారంభోత్సవానికి హాజరు కావాలని కోరారు. ఈ సందర్భంగా ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్న కనకదుర్గా ఫ్లైఓవర్ పనుల పూర్తి వివరాలను వివరించారు. బెంజ్ సర్కిల్ ఫ్లైఓవర్ మరియు నందిగామ-కంచికచర్ల హైదరాబాద్ రహదారి, విజయవాడ-బందరు రహదార్ల, తిరువూరు-విజయవాడ రహదారి నిర్మాణ పనులలో నితిన్ గడ్కరీ చేసిన విశేష కృషిని గుర్తుచేశారు కేశినేని. మీరు చూపిన శ్రద్ధ వల్లే ఈ రోజు ఫ్లైఓవర్ పనులు పూర్తి దశకు వచ్చాయని, విజయవాడ అభివృద్ధికి మరింత సాయం చేయాలని ఆయన కోరారు.

    కొన్ని దశాబ్దాలపాటు విజయవాడ నగరవాసులు దుర్గ గుడి దగ్గర ట్రాఫిక్ ఇక్కట్లు పడ్డారు. దుర్గగుడి ఫ్లై ఓవర్ పూర్తి కావడంతో ఎట్టకేలకు విజయవాడ వాసుల ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి. నగరంలో 50 శాతం ట్రాఫిక్ కష్టాలు తప్పనున్నాయని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. మరో రెండు వారాల్లోనే ఈ ఫ్లై ఓవర్‌ను ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. ఐతే దుర్గగుడి ఫ్లైఓవర్ తమవల్ల సాధ్యమైందని టీడీపీ, వైసీపీ నేతలు ఎవరికి వారు క్రెడిట్ తీసుకుంటున్నారు. చంద్రబాబు హయంలో ఫ్లై ఓవర్ నిర్మాణానికి గాలికొదిలేశారని.. కానీ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పనులను వేగవంతం చేసిందని వైసీపీ నేతలు చెబుతున్నారు. అధికారంలోకి వచ్చిన 14 నెలల్లోనే దుర్గగుడి ఫ్లైఓవర్‌ను పూర్తిచేశామని అంటున్నారు. ఈ క్రిడిట్ సీఎం జగన్‌కే దక్కుతుందని స్పష్టం చేస్తున్నారు.
    Published by:Shiva Kumar Addula
    First published: