Prayaga Raghavendra Kiran, News18, Vijayawada
ప్రపంచం మారుతున్న కొంతమంది ఆలోచనా విధానం మాత్రం మారడం లేదు. బాల్యవివాహాలను రూపుమాపేందుకు ప్రభుత్వం, అధికారులు, NGOలు ఎంతగా ప్రయత్నిస్తున్నా అప్పుడప్పుడు ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా అలాంటి ఘటనే కృష్ణా జిల్లా (Krishna District) లో జరిగింది. అభం శుభం ఎరుగని చిన్నారికి బాల్యం వివాహం చేసి ఆమె చావుకు కారణం అయ్యారు సొంత కుటుంబ సభ్యులు. స్నేహితులతో కలిసి ఆడుతూ పాడుతూ చక్కగా చదువుకోవాల్సిన వయసులో పెళ్లి చేసి ఆమె జీవితాన్ని మూడునాళ్ల ముచ్చట చేసింది ఆ కుటుంబం. ఏడో తరగతి చదువుతున్న బాలికకు 30 ఏళ్లు దాటిన వ్యక్తితో వివాహం జరిపించగా.., శారీరక వికాసం లేని ఆమె గర్భవతై శిశువుతో పాటు తనవు చాలించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
చల్లపల్లి మండలం పురిటిగడ్డ ప్రాంతానికి చెందిన ఎస్సీ బాలిక ఏడో తరగతి చదువుతోంది. చిన్నతనంలోనే తండ్రి చనిపోయారు. అప్పటి నుంచి అన్ని తల్లే చూసుకుంటుంది. మరి భారం అనుకుందో…ఇంక భాద్యత మోయలేననుకుందో కానీ ఏడో తరగతి చదువుతున్న తన కూతురుకు పెళ్లి చేయాలనుకుంది. బందరు శారదానగర్‌కు చెందిన 30 ఏళ్లు దాటిన వ్యక్తికి బాలికను ఇచ్చి వివాహం జరిపించింది.
శారీరకంగా పూర్తిగా ఎదుగుదలలేని స్థితిలో ఆ బాలిక గర్భం దాల్చింది. నెలలు నిండుతున్న కొద్దీ ఆమె ఆరోగ్యం క్షీణిస్తుండటంతో పుట్టింటికి చేరుకుంది. పరిస్థితి విషమించడంతో చల్లపల్లి, మచిలీపట్నంలోని ప్రైవేటు ఆసుపత్రులకు తీసుకెళ్లారు. కానీ, అక్కడి వైద్యులు చేతులెత్తేయడంతో విజయవాడలోని ఓ ఆసుపత్రికి వెళ్లారు. 15 రోజుల క్రితం గర్భంలోని శిశువు మరణించింది.
గర్భవతి అయిన బాలిక ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షించాల్సిన బాధ్యత సంబంధిత ఏఎన్‌ఎంలపై ఉంది. ఎప్పటికప్పుడు తమ పరిధిలోని గర్భిణుల వివరాలను వైద్యారోగ్య శాఖ రికార్డుల్లో నమోదు చేయాలి. బాలికతో పాటు ఆమె కడుపులోని శిశువు మృతి చెందిన విషయాన్ని రికార్డుల్లో చూపాలి. చిన్న వయసులోనే బాలిక గర్భవతి అయిందన్న విషయం తెలిసినా అధికారులకు నివేదించకుండా నిర్లక్ష్యం వహించారు. డీఎంహెచ్‌వో గీతాబాయిని వివరణ కోరగా ఈ ఉదంతంపై విచారణ చేయించి కమిషనర్‌కు నివేదిక పంపామని చెప్పారు.
అందరి పిల్లల్లా తోటి స్నేహితులతో కలిసి ఆడుకోవాల్సిన వయస్సులో..బాలికకు వివాహం చేసి ఆమె మరణానికి కారణం అయ్యారు..! తప్పు ఎవరిది..! బాలికకు పెళ్లి చేసిన వాళ్లదా..! చిన్న పిల్ల అని తెలిసి కూడా పెళ్లి చేసుకున్న వ్యక్తిదా..! ఈ వేడుకను అడ్డుకోకుండా చోద్యం చూసిన బంధువులదా..! తప్పు ఎవరిదైతేనేం..శిక్ష ఆ బాలిక అనుభవించింది..!
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Local News, Machilipatnam, Minor girl pregnant