Anna Raghu, Guntur, News18
డబ్బు చుట్టూనే ఈ ప్రపంచం తిరుగుతుంది. డబ్బు సంపాదించే మార్గాలను ఎవరూ వదులుకోరు. అదే ఇంట్లో కూర్చొని సంపాదించే అవకాశం వస్తే అస్సలు మిస్సవరు. ముఖ్యంగా మధ్య తరగతి ప్రజలకు ఇలాంటి ఆఫర్లు వెతుక్కుంటూ వచ్చిన వరం లాంటివి. అలాంటి బలహీనతలనే ఓ సంస్థ పెట్టుబడిగా చేసుకుంది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రూ.200 కోట్లకు జనాన్ని ముంచేసింది. కరోనా కరెక్ట్ కన్నింగ్ ఐడియాతో కేటుగాళ్లు వేలాది మంది బురిడీ కొట్టింది. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని విజయవాడ (Vijayawada) లో జరిగిన ఈ ఘరానామోసం సంచలనం సృష్టిస్తోంది. వివరాల్లోకి వెళ్తే... లవ్ లైఫ్ అండే నేచుకల్ హెల్త్ కేర్ సంస్థ వైద్య పరికరాలను అద్దెకు ఇచ్చే సంస్థగా ప్రజలకు పరిచయం చేసుకుంది.
లవ్ లైఫ్ పేరుతో ఒక వెబ్ సైట్ ను కూడా క్రియేట్ చేసింది. ఆ వెబ్ సైట్ లో మొబైల్ నెంబర్ ఆధారంగా లాగిన్ అవ్వాలి. ఆ తర్వాత సదరు యూజర్ ఐడీతో స్టెతస్కోప్, పల్స్ ఆక్సీమీటర్, ఆక్సిజన్ కాన్సన్ ట్రేటర్స్ ఇలా వైద్యానికి సంబంధించిన పరికారలు కొనుగోలు చేయాల్సి ఉటుంది. సదరు వస్తువులను లవ్ లైఫ్ సంస్థ రోజువారీ అద్దెలకు ఇస్తుంది. అలా వాటిని కొనుగోలు చేసిన వారికే రోజువారీ అద్దె చెల్లిస్తామని ప్రచారం చేసింది.
అలా రెండు నెలలకే మీరు పెట్టిన పెట్టుబడి వస్తుందని నమ్మించింది. దీంతో చాలా మంది వైద్య పరికరాలు కొనుగోలు చేశారు. అనుకున్నట్లుగానే కొన్నాళ్లపాటు కస్టమర్లకు అద్దె చెల్లిస్తూ వస్తోంది లవ్ లైఫ్ సంస్థ. సమయానికి డబ్బులు కూడా విత్ డ్రా కావడంతో కస్టమర్లు సంస్థను బాగా నమ్మారు. ఐతే కొన్నాళ్లుగా నగదు విత్ డ్రా కాకపోవడంతో కస్టమర్లు సంస్థ ఏజెంట్లను సంప్రదించారు.
ఐతే తమ కంపెనీ సర్వర్ ను 5జీకి మారుస్తున్నామని.. త్వరగా డబ్బులు కావాలంటే రూ.9,999తో లైఫ్ లైన్ ఫాస్ట్ విత్ డ్రా స్కీమ్ లో చేరాలని చెప్పారు. దంతో తమ డబ్బును త్వరగా తీసుకునేందుకు దాదాపు 500 మంది వరకు మనిషికి రూ.10వేల చొప్పున చెల్లించారు. డబ్బులు చెల్లించిన కొన్ని రోజులకు సంస్థ వెబ్ సైట్ మాయమవడంతో పాటు ఫోన్ నెంబర్లు కూడా పనిచేయకుండా పోయినట్లు విజయవాడ బందర్ రోడ్డుకు చెందిన ఓ బాధితుడు తెలిపారు.
పక్కా స్కెచ్ తో జనాన్ని ముంచేసిన లవ్ లైఫ్ సంస్థ మొత్తం రూ.200 కోట్ల వరకు దోచుకున్నట్లు తెలుస్తోంది. అధిక లాభాలొస్తాయన్న ఆశతో అప్పులు చేసి మరీ పెట్టుబడిపెట్టిన వారు దారుణంగా మోసపోయారు. బాధితుల్లో మధ్యతరతి వారే ఉన్నట్లు తెలుస్తోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.