K Pawan Kumar, News18, Vijayawada
అవసరం ఎంత పని అయినా చేయిస్తుంది. ప్రాణాలను తీసే లాగా చేస్తుంది, వారికి వారే ప్రాణాలు తీసుకునేలా చేస్తుంది. ఈ కారణంగానే ఇటీవల లోన్ యాప్ (Loan Apps) ల తాకిడి ఎక్కువైంది. అవసరానికి అప్పుచేయడం అది సకాలంలో తీర్చకపోవడంతో వేధింపులు ఎదుర్కోవడం.. చివరకి అవమానంతో ఆత్మహత్య చేసుకోవడం.. ఇటీవల ఇలాంటి ఘటనలు ఎక్కువయిపోయాయి. తాజాగా విజయవాడలో ఇలాంటి ఘటనే జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. విజయవాడ (Vijayawada) సమీపంలోని సూరపాలెం గ్రామానికి చెందిన రాజేష్ అనే వ్యక్తి కొంతకాలం క్రితం తన అవసరం నిమిత్తం లోన్ యాప్ ద్వారా లోన్ తీసుకున్నాడు. లోన్ అయితే తీసుకున్నాడుగానీ.. దానిని సకాలంలో తీర్చలేకపోయాడు. దీంతో యాప్ నిర్వాహకులు వేధించడం మొదలుపెట్టారు.
లోన్ ఇచ్చే సమయంలో తీసుకున్న వివరాల ఆధారంగా రాజేష్ ఫోటోలు సేకరించారు. వాటిని మార్ఫింగ్ చేసే వేరే అమ్మాయితో అసభ్యంగా చిత్రీకరించారు. లోన్ తీర్చకపోవడంతో ఆ ఫోటోలను అతడి బంధువులు, స్నేహితులకు పంపారు. అంతేకాదు భార్యకు కూడా పంపించారు. దీంతో పరువు పోయిందని భావించిన రాజేష్.. ఇంట్లో ఎవరూలేని సమయంలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.
చనిపోయే ముందు తన భార్య రత్నకుమారికి ఫోన్ చేసిన రాజేష్.. తాను ఏ తప్పూ చేయలేదని.. లోన్ యాప్ నిర్వాహకులు చేసిన పనికే తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని చెప్పి ప్రాణాలు తీసుకున్నాడు. భర్త ఫోన్ కాల్ విని వెంటనే ఆమె వచ్చేలోపే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. లోన్ యాప్ వేధింపుల వల్లే తన భర్త బలవన్మరణానికి పాల్పడ్డాడని.. ఇలాంటి పరిస్థితి మరెవరికీ రాకూడదని రత్నకుమారి అంటోంది. లోన్ యాప్ నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతోంది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ప్రజలు అవసరాలకు లోన్ యాప్ లను ఆశ్రయించవద్దని.. అవన్నీ అధిక వడ్డీల పేరుతో వేధిస్తూ ప్రాణాలు తీసుకునేలా చేస్తాయని పోలీసులు చెబుతున్నారు. గతంలో ఇలాంటి ఘటనలు జరిగిన సమయంలో ప్రజలను హెచ్చరించామన్నారు. అంతేకదు లోన్ యాప్ లు వేధించినప్పు వెంటనే తమకు ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామని పోలీసులు భరోసానిస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Loan apps, Local News, Vijayawada