ప్రేమ (Love). యువతీ యువకుల మధ్య మొదలయ్యే ఆకర్షణ ప్రేమగా మారుతుంది. కొన్ని ప్రేమలు పెళ్లి వరకు చేరితే మరికొన్ని మధ్యలో ముగుస్తాయి. ఇక ప్రేమ పేరుతో అమ్మాయిల జీవితాలతో ఆడుకునే కేటుగాళ్లకు ఈ సమాజంలో కొదవలేదు. నిత్యం ఏదో ఒక చోట ప్రేమ పేరుతో వంచనకు గురిచేసేవాళ్లు కూడా ఉంటారు. ఉపాధి కోసం ఊరుకాని ఊరు వచ్చిన ఓ యువతిని ముగ్గులోకి దించిన ఓ యువకుడు.. ఆమెతో సహజీవనం చేసి అవసరం తీరాక ముఖం చాటేశాడు. అంతేకాదు ఆ యువతికి ఊహించని షాకిచ్చాడు. వివరాల్లోకి వెళ్తే.. తెలంగాణ (Telangana) రాష్ట్రంలోని జనగామ జిల్లా ఘన్ పూర్ మండలానికి చెందిన యువతి విజయవాడ (Vijayawada) గవర్నర్ పేట్ లోని ఓ ఆస్పత్రిలో నర్సుగా పనిచేస్తోంది.
ఈమెకు కృష్ణాజిల్లా (Krishna District) కోడూరు మండలం బడేవారిపాలెంకు చెందిన కొలపాటి వెంకట రాము అనే యువకుడితో మూడేళ్ల క్రితం పరిచయం ఏర్పడింది. రాము కూడా ఓ ఆస్పత్రిలోని ఫార్మసీ దుకాణంలో పనిచేస్తూ తాడిగడపలో అద్దెకు ఉంటున్నాడు. రాముకి యువతికి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమకు దారి తీసింది. ఆమెను పెళ్లి చేసుకుంటానని నమ్మంచాడు. తాను అద్దెకుండే ఇంటికి తీసుకెళ్లి పలుసార్లు శారీరకంగా అనుభవించాడు. ఇద్దరూ కొన్నాళ్లు సహజీవనం కూడా చేశారు..
తనను పెళ్లి చేసుకోవాలని చాలాసార్లు యువతి ఒత్తిడి తెచ్చినా రాము వాయిదా వేస్తూ వస్తున్నాడు. ఐతే రాము ఎంత చెప్పినా వినకపోవడంతో కుటుంబ సభ్యులతో కలిసి ఇటీవల కోడూరు మండలం బడేవారిపాలెంలోని అతడి ఇంటికి వెళ్లింది. అక్కడికి వెళ్లిన తర్వాత మరో షాకింగ్ నిజం తెలిసింది.
స్వగ్రామంలోనూ అతడు ఓ యువతితో కలిసి ఉంటున్నాడు. దీంతో అక్కడ ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఈఘటన తర్వాత రాముతో ఉంటున్న యువతి పరారైంది. బాధిత యువతి రాముతో పాటు అతడి కుటుంబ సభ్యులు తమను కులంపేరుతో దూషించారంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. మరోవైపు నిందితుడు రాము కూడా పరారీలో ఉన్నాడు. ఐతే అతడు ఎంతమందిని మోసం చేశాడు. ఎంతమందిని పెళ్లి చేసుకున్నాడనే దానిపై పోలీసులు ఆరాతీస్తున్నారు.
ఇటీవల చిత్తూరు జిల్లా (Chittoor District)లో ఇలాంటి ఘటనే జరిగింది. బీహార్ కు చెందిన రాజ్ దూత్ అనే యువకుడు.. తన స్వగ్రామానికి చెందిన ఓ యువతిని ప్రేమించి గర్భవతిని చేశాడు. ఇద్దరూ పెళ్లి చేసుకుందామనుకొని ఇంట్లో నుంచి పారిపోయి చెన్నై వచ్చారు. అక్కడి నుంచి చిత్తూరు జిల్లాకు చేరుకున్నారు. ఇక్కడే ఓ ఇంట్లో సహజీవనం చేస్తున్నారు. ఐతే గర్భం తీయించుకోవాలని యువతిపై రాజ్ దూత్ ఒత్తిడి తీసుకురాగా.. అందుకు ఆమె నిరాకరించింది. దీంతో అక్టోబర్ 17న అర్ధరాత్రి ఆమె ముఖంపై దిండు అదిమిపెట్టి హత్య చేశాడు. దాదాపు 20 రోజుల తర్వాత నిందితుడ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.