ప్రేమ. పరిచయం లేనివారినైనా దగ్గర చేస్తుంది. దీనికి వయసుతో సంబంధం లేదు. ప్రేమించుకున్నవారు కలకాలం కలిసి జీవించాలని కలలుకంటారు. కానీ కొందరే ప్రేమను గెలిపించకొని పెళ్లి వరకు వెళ్తారు. కొందరు విడిపోయి ఎవరి జీవితాలు వారు చూసుకుంటారు. కొన్ని ఘటనల్లో మాత్రం ప్రేమికులు విడిపోయి జీవించలేక కఠిన నిర్ణయాలు తీసుకుంటారు. ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)లోని కృష్ణాజిల్లా (Krishna District)లో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. తమ ప్రేమను గెలిపించుకోలేమని భావించి ప్రేమికులు విడిపోలేక కలిసి తనువు చాలించారు. వివరాల్లోకి వెళ్తే... కృష్ణాజిల్లా ముసునూరు మండలం లోపూడి గ్రామానికి చెందిన 17 ఏళ్ల బాలిక.. పశ్చిమగోదావరి జిల్లా లింగపాలెం మండలం కొత్తపాలెం గ్రామానికి చెందిన పులిచర్ల అనిల్ కుమార్ అనే యువకుడికి ఏడాది క్రితం పరిచయమైంది. అదికాస్తా ప్రేమగా మారడంతో ఇద్దరూ తరచూ కలుసుకునేవారు.
ఇద్దరి మధ్య బంధుత్వం కూడా ఉంది. వీరి ప్రేమ వ్యవహారం ఇరుకుటుంబాలకు తెలిసింది. ఇద్దరూ బంధువులైనా వారి ప్రేమను మాతం పెద్దలు అంగీకరించలేదు. దీంతో ఇద్దరూ ఈలోకాన్ని విడిచిపోవాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో అనిల్ ఈనెల 18న బాలిక ఉంటున్న లోపూడి గ్రామానికి వెళ్లి ఆమెను బైక్ పై ఎక్కించుకొని తీసుకెళ్లాడు. ఇద్దరూ కలిసి కొత్తగూడెం-యర్రావారిగూడెం మధ్యలో ఉన్న ఉప్పువాగు వాగు వద్దకు వెళ్లి పురుగు మందు తాగారు. విషయం సమీప బంధువుకు తెలియడంతో ఆమె కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చింది.
ఇరు కుటుంబాలు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకునేలోగా ఇద్దరూ అపస్మారక స్థితిలోకి వెళ్లారు. దీంతో వారిని నూజివీడు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో విజయవాడ తరలించారు. అప్పటికే చేయిదాటిపోవడంతో ఇద్దరూ గంటల వ్యవధిలోనే ప్రాణాలు కోల్పోయారు. దీంతో బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు. పోస్ట్ మార్టం అనంతరం మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
ఈ ఏడాది మేలో కృష్ణాజిల్లాలోని ఇలాంటి ఘటన చోటు చేసుకుంది. మోపిదేవి మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన పేరుబోయిన సాయి (22), అదే గ్రామానికి చెందిన బాలిక (14) ప్రేమించుకున్నారు. ఐతే పెద్దలకు తెలిసి కాదన్నారో.. లేక వారికి చెప్పేందుకు ధైర్యం సరిపోలేదో తెలియదుగానీ ఇద్దరూ ఇంట్లో నుంచి వెళ్లిపోయారు. బంధువులు సమీప గ్రామాల్లో వారి ఆచూకీ కోసం వెతుకుండగా.. ప్రేమికులిద్దరూ పెదకళ్లెపల్లి గ్రామ పంచాయితీ శివారులోని పొలాల సమీపంలో మామిడి చెట్టుకు ఉరివేసుకొని కనిపించారు. దీంతో రెండు కుటుంబాలు తీవ్ర విషాదంలో మునిగిపోయాయి. చిన్నవయసులో మొదలయ్యే ఆకర్షణలు ప్రేమకుదారితీయడం.. వారి బంధాన్ని పెద్దలకు చెప్పలేక, కలిసి ఉండలేక ఇలాంటి కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Crime news, Krishna District, Lovers suicide