Yashwanth, News18, Jaggayyapeta
ఎన్టీఆర్ జిల్లా (NTR District) జగ్గయ్యపేటలో అద్భుతం చోటు చేసుకుంది. అర్థరాత్రి వేళ శివాలయంలో ఎవరూ ఊహించని ఘటన జరిగింది. ఆలయంలో శివుడి మూడు నేత్రాలు ప్రత్యక్షమయ్యాయి. దీంతో భక్తులు ఆ వెండి నేత్రాలను చూసేందుకు భారీగా తరలివస్తున్నారు. ఇదంతా పరమేశ్వరుడి మహిమ అంటూ భక్తిపారవశ్యంతో ఆ నేత్రాలకు ప్రత్యేక పూజలు చేస్తున్నారు భక్తులు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. జగ్గయ్యపేట మండలం బూదవాడ గ్రామంలో శ్రీభమరాంబ సహిత నాగలింగేశ్వర స్వామి దేవాలయం ఉంది. రాత్రి ఆలయంలో నిద్రిస్తున్న అయ్యప్ప స్వాములకు వెండి నేత్రాలు కనిపించాయి.
స్థానికుడైన హుస్సేన్ అనే యువకుడికి 14 రోజులుగా దేవుని కళ్లు దేవాలయంలో ఉన్నట్లు కలలు వస్తున్నాయట. గుడిలోని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహం వెనుక ఈ త్రినేత్రాలు ఉన్నట్లు కలలో కనిపించాయట. ఇదే విషయాన్ని ఆలయంలో నిద్రిస్తున్న అయ్యప్ప స్వాములకు తెలిపాడు హుస్సేన్. అంతేకాదు.. పక్కనే ఉన్న పాలేరు నుంచి బిందెలతో శిశుడికి అభిషేకం చేసి స్వామి నేత్రాలు ఇక్కడే ఉన్నాయంటూ గుడిలోని ఓ ప్రాంతాన్ని చూపించాడు.
దాంతో ఆ ప్రాంతంలో తవ్వి వెతకగా.. వెండితో చేసిన మూడు నేత్రాలు కనిపించాయి. అది చూసి అయ్యప్ప స్వాములు ఆశ్చర్యానికి గురయ్యారు. ఇదంతా పరమశివుడి లీలే అని అంటున్నారు భక్తులు. ఆ నేత్రాలను గుడిలో పెట్టి ప్రత్యేక పూజలు చేశారు భక్తులు. కాగా, ఆలయంలో లభించిన మూడు వెండి నేత్రాలను తిలకించేందుకు గ్రామస్తులే కాకుండా, సమీప గ్రామాల ప్రజలు కూడా తరలివస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Local News, Vijayawada