Anna Raghu, Guntur, News18
ఆమెకు భర్త, ముగ్గురు పిల్లలున్నారు. అందమైన కాపురంలో మనస్పర్థలు రేగాయి. దీంతో భర్తతో విడిపోయింది. పుట్టింటికి చేరి చీటీల వ్యాపారం చేసి నష్టపోయింది. ఆస్తులమ్మి బాకీలు తీర్చింది. ఓ పనిమీద ఊరు వెళ్తూ రైల్వే ఉద్యోగితో ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది. అతడితో సహజీవనం చేస్తూ అక్రమ వ్యాపారం చేసి కస్టమర్లను కోట్లలో ముంచింది. చివరకు కటకటాల పాలైంది. ఈ ఇంట్రెస్టింగ్ క్రైమ్ స్టోరీ విజయవాడ (Vijayawada)లో చోటు చేసుకుంది. ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) లోని తూర్పుగోదావరి జిల్లా (East Godavari) తునికి చెందిన సింహాద్రి నాగమణి అలియాస్ మౌనికకు పెళ్లై భర్త, ముగ్గురు పిల్లలు ఉన్నారు. భర్తతో గొడవల కారణంగా విడిపోయి పుట్టింటికి చేరింది. అక్కడ చిటీల వ్యాపారం చేసి చాలా మందికి బాకీలు పడింది. చివరకి తండ్రితరపు ఆస్తులమ్మి అందరికీ సెటిల్ చేసింది.
ట్రైన్ పరిచయంతో ఊహించని మలుపు
2006లో ఓ రోజు విజయవాడ వచ్చేటప్పుడు ట్రైన్లో టీ.టీ.ఐ సండ్రాన వెంటేశ్వరరావుతో పరిచయం ఏర్పడింది. పరిచయం కాస్తా వివాహేతర సంబంధానికి (Extra Marital Affair) దారితీయడంతో ఇద్దరూ విజయవాడ సూర్యారావుపేటలోని శ్రీలక్ష్మీ హోమ్ ల్యాండ్ అపార్ట్ మెంట్ లో సహజీవనం చేస్తున్నారు. వీరిద్దరూ కలిసి సులువుగా డబ్బులు సంపాదించాలనే ఆలోచనతో తక్కువ ధరకే బంగారం ఇప్పిస్తామని చాలా మంది దగ్గర డబ్బులు వసూలు చేశారు. వెంకటేశ్వరరావుతో పనిచేసే రైల్వే ఉద్యోగులు, దుర్గగుడి ఉద్యోగుల దగ్గర కోట్లలో డబ్బులు తీసుకున్నారు. తామది జమిందారీ కుటుంబమని.. పొలాల రిజిస్ట్రేషన్ నిమిత్తం డబ్బు అవసరమంటూ ఎక్కువ వడ్డీ ఆశచూపి కొందరి వద్ద బంగారం కూడా తీసుకున్నారు.
నాలుగేళ్లలో రూ.14 కోట్లు
దుర్గగుడి సెక్యూరిటీ గార్డుకు వెంకటేశ్వరరావు తన భర్త అని.. కస్టమ్స్ అధికారిగా పనిచేస్తారని నమ్మించి తక్కువధరకే బంగారం ఇస్తామని భారీగా డబ్బులు వసూలు చేశారు. ఇలా దాదాపు 57 మంది నుంచి రూ.8కోట్ల వరకు వసూలు చేశారు. వీళ్లిద్దరు బ్యాంక్ అకౌంట్లు పరిశీలించగా గత నాలుగేళ్లలో రూ.14.22 కోట్ల లావాదేవీలు జరిగినట్లు గుర్తించారు. వీరి బాధితుల్లో చాలా మంది పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి వెనుకాడుతున్నారు. అంతేకాదు పలువురి నుంచి తీసుకున్న నాలుగు కేజీల బంగారాన్ని మణప్పురం లో తాకట్టు పెట్టారు. అందులో రూ.కోటిన్నర ఆన్ లైన్ రమ్మీలో పోగొట్టుకున్నారు.
వీరికి డబ్బులు, బంగారం ఇచ్చి మోసపోయిన రాఘవేంద్రరావు, సుబ్బారావు, వినయ్ అనే వ్యక్తులు నాగమణిని కిడ్నాప్ చేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం నాగమణిని పోలీసులు అదుపులోకి తీసుకోగా.. మరో నిందితుడు వెంకటేశ్వరరావు రైల్వే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతడు డిశ్చార్జ్ అయిన వెంటనే అరెస్ట్ చేస్తామని పోలీసులు తెలిపారు. మరోవైపు నాగమణిని కిడ్నాప్ చేసేందుకు యత్నించిన ముగ్గురిపైనా కేసు నమోదు చేశారు. కేసు దర్యాప్తు వెస్ట్ జోన్ డీసీపీ బాబూరావు ఆధ్వర్యంలో సిట్ ఏర్పాటు చేసినట్లు విజయవాడ కమిషనర్ బత్తిన శ్రీనివాసులు తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Cheating, Crime news, Vijayawada