ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)లోని కృష్ణా(Krishna)జిల్లాలో భార్యభర్తల మధ్య విచిత్రమైన సమస్య పోలీసు(Police)లకు తలలు పట్టుకునేలా చేసింది. ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న భార్యభర్తలు ఇద్దరూ పరస్పరం ఒకరిపై మరొకరు ఫిర్యాదు చేసుకున్నారు. అయితే విభేదాలతో విడిపోతున్న జంటను కలపాలని చూసిన పోలీసులు కౌన్సిలింగ్(Counselling)కు పిలిపిస్తే ఇద్దరూ చెప్పిన విషయాలతో తలలు పట్టుకున్నారు. చివరకు భార్య ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా భర్తపై కేసు నమోదు చేశారు.అయితే అసలు ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న భార్యభర్తల మధ్య విభేదాలు తలెత్తడానికి అసలు కారణం ఏమిటో తెలిస్తే షాక్ అవుతారు.
కాపురం కూల్చిన సెల్‌ఫోన్..
సెల్‌ఫోన్‌లు వాడటం కారణంగా ఆరోగ్య సమస్యలే కాదు..ఆరోగ్యకరంగా ఉన్న కుటుంబాలు కూడా కూలిపోతున్నాయి. భార్యభర్తలు విడిపోవడానికి కారణవుతున్నాయి. ఇది వినడానికి కాస్త విడ్డూరంగా ఉన్నప్పటికి కృష్ణా జిల్లా విజయవాడలో కొద్దిరోజుల క్రితం జరిగిన ఓ సంఘటన ఆలస్యంగా బయటకొచ్చింది. ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న దంపతులు ఇద్దరిలో భర్త తన సెల్‌ఫోన్‌కి సీక్రెట్ లాక్ పెట్టుకున్నాడని భార్య పోలీసులకు కంప్లైంట్ చేసింది. అంతే కాదు ..తనను అనమానంతో వేధిస్తున్నాడని భర్త ఫోన్ సీక్రెట్ లాక్ తనకు చెప్పాలని పట్టుబట్టింది.
సీక్రెట్ లాక్ ఓపెన్ చేయనందుకు కేసు..
భార్య భర్త ఫోన్ లాక్ పెట్టుకున్నాడని ఆరోపిస్తే ..భర్త తన భార్య వేరే వ్యక్తులతో ఎక్కువ సేపు ఫోన్ మాట్లాడుతోందని ఫిర్యాదు చేశాడు. అంతే కాదు తన భార్య ఫోన్‌ని తనకు ఇవ్వాలని పట్టుబట్టాడు. అయితే చిన్న విషయంలో చదువుకొని ఉద్యోగాలు చేస్తున్న దంపతులు విడిపోకూడదని పోలీసుల కౌన్సిలింగ్ పేరుతో స్టేషన్‌కు పిలిపించి కాపురం చక్కదిద్దాలని చూశారు. అయితే భర్త సీక్రెట్ లాక్ ఓపెన్ చేయనని చెప్పడం..భార్య తన సెల్‌ఫోన్‌ను భర్తకు ఇవ్వనని తెగేసి చెప్పారు. దీంతో పోలీసులు తలలు పట్టుకున్నారు. ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్‌లో కొద్దిరోజుల క్రితం ఈసంఘటన జరిగింది. చేసేది ఏమి లేక భార్య ఇచ్చిన వేధింపుల ఫిర్యాదు మేరకు భర్తపై కేసు నమోదు చేశారు పోలీసులు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.